భారత్ ను మరోసారి కరోనా మహమ్మారి కమ్ముకునే ప్రమాదం పొంచి ఉంది. చైనాలో విస్తృతంగా వ్యాపిస్తున్న బీఎఫ్7 వేరియంట్ ను ఇండియాలో కూడా కనుగొన్నారు. దీంతో వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. అయితే ఈ కొత్త వేరియంట్ తో పాటు, ఇండియాలో పుకార్లు కూడా ఎక్కువయ్యాయి.
ప్రాణాంతకమైన ఎక్స్ బీ బీ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించిందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. “ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ బీ బీ. ఇది ఇండియాలో వెలుగుచూసింది. డెల్టా వేరియంట్ కంటే 5 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుంది. లక్షణాలు కూడా పైకి కనిపించవు, తొందరగా ప్రాణాలు పోతాయి” అనే సందేశంతో సోషల్ మీడియాల్లో ఈ మెసేజ్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా వాట్సాప్ లో ఇది దాదాపు ప్రతి ఖాతాకు చేరుకుంటోంది.
ఈ వాట్సాప్ ఫార్వాడ్ మెసేజ్ పై ప్రభుత్వం స్పందించింది. ఈ మెసేజ్ పూర్తిగా అవాస్తవమని ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ, ఎక్స్ బీబీకి సంబంధించి తమ దగ్గర ఎలాంటి సమాచారం, రికార్డులు లేవంటూ స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తోంది.
ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, గందరగోళం సృష్టించే ఇలాంటి సందేశాల్ని నమ్మొద్దని చెబుతూనే.. వీటిని ఎక్కువగా ఫార్వార్డ్ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. గతంలోలానే ఈసారి కూడా కరోనా వైరస్ పై తమ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని అందిస్తామని ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో గడిచిన 24 గంటల్లో 129 కొత్త కేసులు నమోదయ్యాయి, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,408గా ఉంది. గడిచిన 24 గంటల్లో ఒక మరణం నమోదైంది.