పాకిస్తాన్ కంటే ఏడు రెట్లు పెద్దదైన భారతదేశం దాడికి దిగుతున్నప్పుడు మమ్మల్ని మేం రక్షించుకోవడానికి ఏం చేయడానికైనా వెనుకాడబోమంటూ అణ్వస్త్రాల ప్రస్తావనను తీసుకొచ్చారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. ఎన్నో ఏళ్ళుగా పాకిస్తాన్ ఇదేమాట చెబుతోంది. అణ్వస్త్రాలున్నాయంటూ పాకిస్తాన్, భారత్‌ని భయపెట్టాలనుకుంటోంది. ఏం, భారతదేశం దగ్గర అణ్వాయుధాలు లేవా.? అని పాకిస్తాన్ తనను తాను ప్రశ్నించుకుని వుంటే, ఈ మాటలు పాకిస్తాన్ నుంచి రానే రావు.
ఐక్యరాజ్యసమితి సాక్షిగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారతదేశంపై విషం చిమ్మాడు. ఇది పాకిస్తాన్‌కి కొత్తేమీకాదు. అయితే, ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల పట్ల కరడుగట్టిన తీవ్రవాదులు హర్షం వ్యక్తం చేయొచ్చేమో. కానీ, విజ్ఞతతో ఆలోచించేవారెవరూ ఇమ్రాన్ ఖాన్ని సమర్థించరు. 'మాది విజ్ఞత లేని దేశం' అని ఇమ్రాన్ ఖాన్, ఐక్యరాజ్య సమితి సాక్షిగా తేల్చేశాడు.
ఇస్లామిక్ టెర్రరిజం గురించి ఒకటికి వందసార్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పుకున్నాడు. నిజానికి, భారత ప్రధాని నరేంద్రమోడీ, ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం కన్నా ముందే ప్రసంగించినా, ఎక్కడా పాకిస్తాన్ పేరు ప్రస్తావించలేదు. భారతదేశం ఏయే రంగాల్లో దూసుకుపోతున్నదీ ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో ఎక్కడా పాకిస్తాన్ అభివృద్ధి గురించి మాట్లాడకపోవడం ఆ దేశ ప్రజల్నీ తీవ్ర నిరాశకు గురిచేసి వుండొచ్చుగాక.!
ఇక, ఇస్లామిక్ దేశాల నుంచి మద్దతును ఆశిస్తూ, 'ఇస్లామిక్ టెర్రరిజం' పేరుతో సెంటిమెంట్ అస్త్రాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రయోగిస్తే, అది కాస్తా బెడిసికొట్టింది. 'రైట్ టు రిప్లయ్' కింద భారత ప్రతినిథి, ఇమ్రాన్ ఖాన్ ప్రసంగానికి చాలా గట్టి కౌంటర్ ఇచ్చాక.. ఇమ్రాన్ ఖాన్ వాదన మరింత చులకనైపోయింది ప్రపంచం దృష్టిలో.
'భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూకాశ్మీర్ గురించిన ఆలోచన పాకిస్తాన్‌కి ఎందుకు.?' అన్న ప్రశ్న దగ్గరే పాకిస్తాన్ పనైపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే, తమ దగ్గర వున్న అణ్వాయుధాల్ని సరదాగా వాడుకునేందుకు ఓ అవకాశం పాకిస్తాన్ కోరుకుంటున్నట్లుంది. అంతకు మించి పాకిస్తాన్ వాదనలో అర్థమేలేదు. యుద్ధమంటూ జరిగితే, పాకిస్తాన్ 'గతి' ఏమవుతుందో ప్రపంచానికి తెలుసు.
ఇప్పటికే ప్రపంచం దృష్టిలో ఒంటరి అయిన పాకిస్తాన్, ఐక్యరాజ్య సమితిలో తమ ప్రధాని చేసిన చెత్త వాదనతో మరింత చులకన అయిపోయింది. పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం ఆయనలోని అపరిపక్వతని బయటపెడితే, అది భారతదేశానికి మరింత అడ్వాంటేజ్ అయ్యిందన్నది నిర్వివాదాంశం.