మాజీ మంత్రి, తెలుగుదేశం ప్రముఖ నాయకుడు గంటా శ్రీనివాసరావు ఏం చేసిన వార్తే మరి. ఆయన ఇన్నాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. ఇపుడు విద్యుత్ ధరల పెంపు అంటూ తమ్ముళ్ళందరి చేత ఇంట్లో నిరాహార దీక్షలు పేరిట అధినేత చంద్రబాబు నిరసనల రాగాలు పలికించారు.
గంటా ఇంట్లో దీక్ష చేశారో లేదో తెలియదు కానీ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ కి ఒక లేఖను రాశారు. ఆ లేఖలో ఘాటు పదజాలం ఏదీలేదు చాలా స్మూత్ గా రాసుకుంటూ ఇలా చేయండి అంటూ సలహా ఇస్తున్న మాదిరింగానే ముగించారు. మిగిలిన తమ్ముళ్ల మాదిరిగా ప్రభుత్వాన్ని తిట్టడాల జోలికి పోలేదు.
మా టైంలో కుమ్మేశాం, చించేశాం వంటి రొటీన్ రొడ్డకొట్టుడు డైలాగులూ కూడా ఏమీ లేవు. ఇపుడు లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఆదాయాలు లేక ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మూడు నెలల విద్యుత్ బకాయిలు ప్రభుత్వం విపత్తు గానే భావించి రద్దు చేయాలని గంటా ఆ లేఖలో జగన్ని కోరారు.
ఇదిలా ఉండగా ఇంతకాలం సైలెంట్ గా ఉన్న గంటా ఇపుడు వైసీపీకి ఈ లేఖ రాయడం ద్వారా అటు పార్టీ కట్టు తప్పకుండా, ఇటు గుట్టు చెడకుండా జాగ్రత్త పడ్డారని అంటున్నారు. మొత్తానికి రాజకీయ చాణక్యంలో గంటా అందరినీ మించారని అంటున్నారు.
పాము విరగకుండా కర్ర చావకుండా చందాన పార్టీ ఇచ్చిన నిరసన పిలుపును గంటా ఇలా పూర్తి చేశారని అంటున్నారు. ఇంత చేసినా కూడా గంటా మరీ ఇంత స్మూత్ గానా ప్రభుత్వాన్ని అడిగేది అంటూ తతిమ్మా తమ్ముళ్ళ గుసగుసలు, గుస్సాలూ ఎటూ ఉంటూనే ఉంటాయి. అది వేరే విషయమంతే.