మ్యాచ్ లో స్కోర్స్ లెవల్ అయ్యాయి, విజేత ఎవరో తేల్చడానికి పెట్టిన సూపర్ ఓవర్ లోనూ ఇరు జట్ల స్కోర్స్ లెవల్ అయ్యాయి. ఇలా క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడ్డాయి. రెండు జట్ల స్కోర్లూ సమం అయినప్పటికీ విజేత మాత్రం ఇంగ్లండ్!
ఇరు జట్ల స్కోర్లూ సమం అయినప్పుడు ఇద్దరినీ విజేతగా ప్రకటించాల్సింది. అయితే మ్యాచ్ లో ఎక్కువ ఫోర్లు కొట్టిన జట్టు విజేత అవుతుందనే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది! క్రికెట్ ను కనుగొన్నది బ్రిటీషర్లే అనే పేరుంది.
ప్రపంచకప్ జరగబట్టి దశాబ్దాలు అవుతున్నా ఇంగ్లండ్ ఒక్కసారి కూడా ఆ ట్రోఫీ నెగ్గలేదు అనే లోటు కూడా ఉంది. ఈ విషయంలో ఇతర దేశాల క్రికెటర్లు కూడా ఇంగ్లండ్ ను ఏడిపిస్తూ ఉంటారు. ఈ పరిణామాల్లో ఎట్టకేలకూ ఇంగ్లండ్ తొలి సారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఇప్పటికే పలు మార్లు ఫైనల్ వరకూ వెళ్లి ఓడిన ఆ జట్టు ఈ సారి విజేతగా నిలిచింది.
ఇక వరసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్ వరకూ వెళ్లి న్యూజిలాండ్ ఓటమి పాలైంది. క్రితం సారి ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్ లో కూడా కివీస్ ఫైనల్లో ఓడిన సంగతి తెలిసిందే. ఈ సారి కివీస్ గెలిచినంత పని చేసింది. అయితే కేవలం సాంకేతికమైన రీజన్లతో ఇంగ్లండ్ ప్రపంచ విజేతగా నిలిచింది. కీలకమైన మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లూ ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడి అభిమానులకు మాత్రం ఫుల్ వినోదాన్ని అందించారు!