ఒక లైన్ అనుకుని ఆ పాయింట్ మీదే సినిమా మేకింగ్ చేసే విధానం హాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంది. అదనపు కథ ఉండదు, అనవసరమైన పాత్రలు కనిపించవు, ఉపకథలు ఉండవు.. కథ కూడా ఒకే పాయింట్ లో తేలిపోతుంది. ఆ తరహా సినిమాలను ఇండియాలో రూపొందించే ఏకైక చలన చిత్ర పరిశ్రమ మలయాళీ చిత్ర పరిశ్రమ! హాలీవుడ్ తరహా కథాంశాలను అందుకోవడంలో బాలీవుడ్ కన్నా ముందుంటుంది మలయాళీ చిత్ర పరిశ్రమ. మన దగ్గర సినిమా అంటే ఒక హీరో, వీలైతే ఇద్దరు హీరోయిన్లు, ఒక విలన్, హీరో వెంట కమేడియన్లు.. ఈ ఫార్మాలాలే అమలవుతున్న దశలోనే మలయాళీలు రూటు మార్చారు!
90లలో వచ్చిన మలయాళీ సినిమాలే మనకు చాలా విచిత్రమైన కథలు. అందుకే ఆ సినిమాలను అప్పట్లో తెలుగులోకి అనువదించడం కానీ, రీమేక్ చేయడం కానీ చాలా తక్కువ! ఎందుకంటే మలాయళీ కథలు మనకు అంత తేలికగా ఎక్కవు! తక్కువ సినిమాలు మాత్రమే మలయాళం నుంచి వచ్చి తెలుగులో హిట్ అయ్యాయి. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన పెద్దరికం, చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్, ఇంకా చిన్న సినిమాలు మధురానగరిలో.. ఇలా మలయాళం నుంచి వచ్చి తెలుగులో హిట్ అయిన సినిమాల జాబితా తక్కువే. అనేక మలయాళ సినిమాలను మనోళ్లు రీమేక్ చేశారు. అయితే వాటి హిట్ పర్సెంటేజ్ తక్కువ! ఈ మధ్యకాలంలో మలయాళం నుంచి వచ్చి తెలుగులో ఫర్వాలేదనిపించుకున్న సినిమా ప్రేమమ్!
మలయాళంలో కల్ట్ హిట్ అయిన సినిమాలు, ఆ పై హిందీలో కూడా హిట్టైన సినిమాలు అనేకం తెలుగులో మాత్రం ఆకట్టుకోలేకపోయాయి! ఆ సినిమాలు బాగానే ఉంటాయి, అయితే ఎందుకో కమర్షియల్ గా సక్సెస్ కాలేదు! నవీన్ వడ్డే హీరోగా వచ్చిన 'మా బాలాజీ' అలాంటి సినిమానే. వాస్తవానికి దాని మూలం ఒక మలయాళీ సినిమా. అక్కడ హిట్టయ్యే సరికి తెలుగులో దాన్ని భార్గవ్ ఆర్ట్స్ వాళ్లు రీమేక్ చేశారు. అయితే మా బాలాజీ మాత్రం తెలుగులో ఆకట్టుకోలేదు. వంక పెట్టడానికి ఆ సినిమాలో ఏం ఉండదు, అడలేదంతే!
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ వాళ్లు మరికొన్ని మలయాళీ సినిమాలను రీమేక్ చేశారు. మధురానగరిలో, అల్లరిపిల్ల వంటి సినిమాలు మలయాళీ రీమేక్ లే. అవన్నీ సింగిల్ పాయింట్ సినిమాలే! ఆ రెండు సినిమాలూ తెలుగులో మ్యూజికల్ హిట్. కామెడీ సినిమాలు కావడంతో బయటపడిపోయాయి.
అయితే ఒక దశలో మలయాళీ కామెడీలు కూడా తెలుగులో అంతగా ఆడలేదు. హిందీలో హేరాఫెరీ అని ఒక కల్ట్ సినిమా. ఇప్పటికీ హిందీ సినీ ప్రేక్షకులు ఆ సినిమా పేరును కలవరిస్తూ ఉంటారు. అది కూడా ఒక మలయాళీ సినిమాకు రీమేక్. 90లలో మలయాళంలో వచ్చిన సినిమానే హిందీలో 'హేరాఫెరీ'గా తీశారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో ఆ సినిమా హిందీలో రూపొంది సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత దానికి సీక్వెల్ వచ్చి సూపర్ హిట్ అయ్యింది. త్వరలోనే మూడో పార్ట్ తీస్తారట. హేరాఫేరీ సినిమాను ఎప్పుడో తెలుగులో తీశారు. 'ధనలక్ష్మీ ఐలవ్యూ' పేరుతో ఆ సినిమాను రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఆ సినిమా నాణ్యమైన నటులతోనే కనిపిస్తుంది. సీనియర్ నరేష్, అల్లరి నరేష్ ల్లోని ప్రతిభావంతమైన నటన ఆ సినిమాలో కనిపిస్తుంది. అయితే మలయాళంలో కల్ట్ హిట్ అయిన ఆ సినిమా తెలుగులో కనీసం హిట్ అనిపించుకోలేకపోయింది! అయినా మలయాళీ కామెడీలు కొన్ని తెలుగులో వచ్చాయి. అలాంటి వాటిల్లో మరోటి 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా'. ఈ సినిమా మాత్రం ఫర్వాలేదు కేటగిరిలో నిలిచింది. మరో మలయాళ కామెడీ తెలుగు రీమేక్ సినిమా 'బ్రహ్మానందం డ్రామా కంపెనీ' మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.
తెలుగు స్టార్ హీరోలు చేసిన మలయాళీ రీమేక్ ల విషయానికి వస్తే.. నాగార్జున నిర్ణయం, వజ్రం, చంద్రలేఖ, భాయ్ వంటి సినిమాలు చేశారు. ఈ సినిమాలూ తెలుగులో చెప్పుకోదగిన విజయాన్ని సాధించలేదు!
చిరంజీవికి మాత్రం మలయాళీ సినిమా 'హిట్లర్' గొప్ప విజయాన్ని అందించింది. 'పసివాడి ప్రాణం' సినిమాకు కూడా మూలం ఒక మలయాళీ సినిమానే. వెంకటేష్ పలు మలయాళీ సినిమాలను రీమేక్ చేశారు. బాడీగార్డ్ డిజాస్టర్ గా నిలిచింది. దృశ్యం సినిమాకు అభినందనలు వచ్చాయి కానీ ఆ స్థాయిలో కలెక్షన్లు రాలేదు!
ఇతర హీరోలు చేసిన సినిమాల విషయానికి వస్తే.. హనుమాన్ జంక్షన్, మోహన్ బాబు సినిమా అల్లుడు గారు హిట్స్ గా నిలిచాయి. ఖుషీ ఖుషీగా, నువ్వేకావాలి కూడా హిట్ సినిమాలే. ఏతావాతా తమిళం నుంచి తెచ్చుకుని రీమేక్ చేసే సినిమాలతో పోలిస్తే మలయాళం నుంచి కథలను కొనక్కొచ్చుని తీసిన సినిమాల హిట్ పర్సెంటేజీ చాలా తక్కువ!
గత కొంతకాలంలో తెలుగులో రీమేక్ అయిన మలయాళీ చిన్న సినిమాల్లో.. రైట్ రైట్, ఫలక్ నూమాదాస్, మేడమీది అబ్బాయి, 2 కంట్రీస్.. ఇలాంటి సినిమాలన్నీ తెలుగు వాళ్లతో కనెక్ట్ కాలేకపోయాయి! ఎక్కడో తేడా కొట్టేసింది!
కల్చరల్ గా మలయాళీలకూ తెలుగు వాళ్లకు ఏ మాత్రం సాపత్యం ఉండదు. సౌతిండియానే అయినప్పటికీ.. మలయాళీల లైఫ్ స్టైల్, వాళ్ల ఆలోచన తీరు.. ఇవన్నీ కూడా తెలుగు వాళ్లకు చాలా భిన్నంగా ఉంటాయి. తెలుగు వాళ్లతో పోలిస్తే మలయాళీలది అడ్వాన్స్డ్ సొసైటీ. అలాగే పాతతరం సంప్రదాయాలు కూడా కొనసాగుతాయి. హిందూ-ముస్లిం-క్రిస్టియన్లు బాగా కలిసిపోయిన వైనం కేరళలో చూడొచ్చు.
సినిమాలను కల్చర్ చాలా వరకూ ప్రభావితం చేస్తుంది. మలయాళీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తున్న ప్రస్తుత తరం సినిమాలను తెలుగు వాళ్లు ఆదరించడం అయితే కనిపిస్తుంది. అది మలయాళీ సినిమాగా ఉన్నంత వరకూ ఆ సినిమాకు మంచి ఆదరణే కనిపిస్తుంది. అయితే ఎటొచ్చీ తెలుగులో దాన్ని తీస్తేనే.. ఎంత వరకూ ఆడుతుందనేది సందేహం!
బాడీగార్డ్ సినిమానే ఉదాహరణగా తీసుకుంటే.. ఆ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అక్కడ హిట్ అయ్యిందని తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఆ సినిమా ఎంత డిజాస్టర్ అంటే.. దాన్ని టీవీల్లో వేయడానికి కూడా చానళ్లు భయపడతాయి. ఎక్కడో తేడా కొట్టేసింది. ఇప్పుడు ఈ చర్చ ఎందుకంటే.. వరసగా కొన్ని మలయాళీ సినిమాల రీమేక్ ప్రతిపాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ సినిమాలు కూడా విభిన్నమైన సినిమాలే. అలాంటి పాయింట్స్ మీద సినిమా తీయొచ్చు అని మలయాళీలు నిరూపించారు.
'అయ్యప్పనుం కోషియం' సినిమా విషయానికి వస్తే.. ఏ హాలీవుడ్ నుంచినో అలాంటి ఔట్ పుట్ ను చూడగలం! ఇద్దరి మధ్యన అనవసరమైన ఇగో వార్ ఎలాంటి పరిణామాలకు కారణం అయ్యేందనే అంశంపై ఆ సినిమాను తెరకెక్కించిన తీరును ఎంత అభినందించినా తక్కువే. క్యారెక్టర్ స్టడీ అనేది బ్రహ్మాండంగా జరిగింది ఆ సినిమాలో. దాని కన్నా ముందుగానే వచ్చిన 'డ్రైవింగ్ లైసెన్స్ 'కూడా అదే తరహా కథాంశమే. ఒక పోలీసుకు- ఒక సినిమా హీరోకి మధ్యన ఇగో వార్ డ్రైవింగ్ లైసెన్స్. తను ఎంతగానే అభిమానించిన హీరోను ఒక్కసారి డైరెక్టుగా కలిసే సరికే అతడికి శత్రువు అవుతాడు సదరు పోలీస్.
అక్కడ నుంచి కథ ఆసక్తిదాయకంగా సాగుతుంది. ఒక సినిమా హీరోకి, సామాన్య పోలిస్ కు ఇగో వార్ డ్రైవింగ్ లైసెన్స్, ఒక పోలీసుకు మరో చిన్నసైజు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి మధ్యన ఇగో వార్ 'అయ్యప్పనుం కోషియం'! ఈ రెండు సినిమాలూ దేనికదే ప్రత్యేకం. అయ్యప్పనుం కోషియం సినిమా అయితే.. ఐఎండీబీ రేటింగ్స్ లో టాప్ లో ఉంది. అక్కడ 8 పాయింట్లకు మించి స్కోర్ ను సాధించిన అతి తక్కువ భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది ఆ సినిమా! అయితే అలాంటి సినిమా తెలుగులో రీమేక్ చేస్తే.. కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పలేని పరిస్థితే ఉంటుంది. దానికి అనేక కారణాలు.
ఇక లూసీ ఫర్ కూడా ఆ తరహా సినిమానే. ఆల్రెడీ సినిమాను తెలుగులోకి అనువదించారు. అమెజాన్లో అందుబాటులో ఉంచారు. సినిమా అయితే సూపర్ గా ఉంటుంది. తెలుగువారికి అంటే.. మాత్రం ఆలోచించుకోవాల్సిన అంశమే! ఇదోరకమైన పొలిటికల్ మాస్ మసాలా! ఈ మూడు సినిమాలనూ అమెజాన్లో అందుబాటులో ఉంచారు. లాక్ డౌన్ నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ లో తేలియాడుతున్న తెలుగు వాళ్లు ఈ మూడు సినిమాల మీద ఇప్పటికే ఒక కన్నేశారు. ప్రేమమ్ వంటి సినిమాను కూడా ఎవరో కొందరే మలయాళీ వెర్షన్ ను ముందే చూశారు. అయితే ఈ సినిమాలను మాత్రం చాలా మంది చూసేశారు. దీని వల్ల తెలుగులో రీమేక్ చేసినా పోలిక ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కూడా!
-జీవన్ రెడ్డి. బి