వెంకటేష్ హీరోగా నటించిన 'అబ్బాయిగారు' సినిమాలో కోట శ్రీనివాసరావు తప్పుడు లెక్కలు చెబుతాడు. లాభాన్ని నష్టంగా, నష్టాన్ని లాభంగా చూపుతాడు. లెక్కలు తెలియని హీరోని మభ్యపెట్టే క్రమంలో నమ్మకద్రోహి వేసిన వేషాలవి. ఆ సంగతి పక్కన పెడితే, గడచిన ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థం కాని ఏవేవో లెక్కలు చెబుతూ వచ్చింది చంద్రబాబు సర్కార్. తాము చెప్పే లెక్కల్నే జనం గుడ్డిగా నమ్మేస్తారన్నది అప్పట్లో చంద్రబాబు ఆలోచన కావొచ్చుగాక. కానీ, జనం అన్నీ లెక్కలేసుకుంటారు.. సమయమొచ్చినప్పుడు 'తాట' తీస్తారు.. తీశారు కూడా.! దాని ఫలితమే, చంద్రబాబు పార్టీకి 23 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు.
ప్రతిపక్షంలో కూర్చున్నా, చంద్రబాబు అండ్ టీమ్ ఉత్తుత్తి లెక్కలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఏ రంగంలోనూ అభివృద్ధి కన్పించడంలేదనీ, గడచిన ఐదేళ్ళు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి, అభివృద్ధి విషయమై తప్పుడు లెక్కలు చెప్పారనీ ఆర్థిక మంత్రి బుగ్గన కడిగి పారేశారు. తలసరి ఆదాయం దగ్గర్నుంచి, రాష్ట్రం అప్పుల వరకు.. అన్నిటినీ ఏకరువు పెట్టేశారు.
షరామామూలుగానే, అధికార పక్షానికి ప్రతిపక్షం నుంచి కౌంటర్ షురూ అయ్యింది. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియా ముందుకొచ్చేశారు. బుకాయింపులు మొదలెట్టేశారు. తమ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిపోయిందంటూ 'సోది' మొదలెట్టేశారు. తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి సాధించామన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి పరుగులు తీసిందనీ సెలవిచ్చారు. పైగా, 'మంత్రి పదవి కొత్త కదా.. అందుకే బుగ్గనకి వాస్తవాలు తెలియడంలేదు..' అంటూ, పైన పేర్కొన్న సినిమాలోని డైలాగ్ తరహాలో యనమల ఓ అర్థం పర్థం లేని డైలాగులిచ్చారు.
అప్పుడూ, ఇప్పుడూ అధికారులే లెక్కలు తేల్చుతారు. ఆ లెక్కల్ని, ప్రభుత్వంలో వున్నవారు 'అట్నుంచి ఇటు.. ఇట్నుంచి అటు' తిప్పేస్తారు. ఈ నగ్నసత్యాన్ని కూడా యనమల నోరు జారేసి బయటపెట్టేయడం గమనార్హం.