ఒకప్పుడు రిపోర్టర్లు ఎవరైనా వార్త రాసినందుకు డబ్బు తీసుకుని ఉంటే అది అవసరం అయిఉండొచ్చు.. ఆ తర్వాత తీసుకున్నవాళ్లది వారసత్వంగా, తరవాత అలవాటుగా, అ తరవాత లక్షణంగా మారిపోయింది. ఇప్పుడు బెదిరింపు రూపం కూడా సంతరించుకుంటోంది. సినీ పరిశ్రమలో ఈ పోకడ మరింత దుర్మార్గం. ప్రెస్ మీట్ అంటేనే వృద్ధులకు పెన్షన్లు పంచినట్లుగా… కవర్లు పంపిణీ కార్యక్రమం కింద మారిపోయిందిప్పుడు. ఇచ్చేవాళ్లు పైకి నవ్వుతూ ఇచ్చినా.. దాన్ని ముష్టికింద భావిస్తోంటే.. తీసుకునే వాళ్లు దాన్ని హక్కు కింద అనుకుంటూ ఉండడం జరుగుతోంది. ఇస్తే తీసుకోవడం పర్లేదు అనుకునేది కాస్తా.. ఇవ్వకపోతే ఊరుకునేది లేదు.. అనే తరహాలోకి మారిపోయింది.
అయితే సినీ ఇండస్ట్రీలో ప్రెస్ మీట్లలో కవర్లు ఇచ్చే సంస్కృతికి చరమగీతం పాడాలని తమిళ పరిశ్రమ నిర్ణయించడం విశేషం. ఈ మేరకు తమిళ నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకుంది. ప్రెస్ మీట్లకు వచ్చే రిపోర్టర్లకు కవర్లు ఇవ్వరాదని, లంచ్ డిన్నర్ లాంటివి కూడా వద్దని, కేవలం టీ ఎరేంజ్ చేస్తే చాలునని వారు నిర్ణయించారు. దీనిమీద తమిళ సినీ ప్రెస్ లో నిరసనలు కూడా రేగాయి. మేమేం భోజనాలకు వస్తున్నామా అంటూ ఆగ్రహించారు కూడా!
తమిళంలో ఈ పోకడ మరీ ఎక్కువైపోయిందిట. ప్రెస్ మీట్ అనగానే అతిథులుగా వచ్చే మీడియా ప్రతినిధులు సుమారు నాలుగొందల దాకా లెక్కతేలుతున్నారట. వారందరికీ స్థాయికి తగ్గ భోజనాలు పెట్టించేసరికి ఖర్చు పెళ్లిభోజనాల చందంగా లెక్క తేలుతున్నదట. అందుకే అక్కడ అలాంటి నిర్ణయం తీసుకున్నారు.
అయితే.. తెలుగు సినీనిర్మాతల మండలి కూడా అదే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ కూడా ప్రెస్ కు కవర్లు పంపిణీ బెడద చాలా ఎక్కువే. నిర్మాతల విలాపం ఏంటంటే… కవర్లు తీసుకుంటున్నారు సరే.. తమకు పాజిటివ్ ప్రచారం ఇవ్వడం లేదని! ఆ మధ్య ఓ మీడియం బడ్జెట్ సినిమాకు ఒక్కొక్కరూ రెండేసి లక్షలు తీసుకుని.. రివ్యూలు కాస్త లేటుగా ఇవ్వమన్న రిక్వెస్టును ఖాతరు చేయకుండా.. వెంటనే ఇచ్చేసి కలెక్షన్లకు డ్యామేజీ చేశారని! ఒక రకంగా చూస్తే.. మీడియం బడ్జెట్ సినిమాకు ప్రెస్ కవర్లు మరియు అడ్వర్టయిజ్ మెంట్ల ఖర్చు కలిపి ఓ చిన్న సినిమా బడ్జెట్ అంత తయారవుతున్నదంటే అతిశయోక్తి కాదు.
అగ్ర దినపత్రికలుగా చెలామణీలో ఉన్నవి.. చిన్న సినిమాకే రెండు మూడు లక్షల రూపాయలు బెదిరించి మరీ దందా వసూలు చేస్తుండడం సాధారణంగా జరుగుతోంది. అందుకే ఈ బెడద తప్పించుకోవడానికి కవర్ల సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారట. అయితే నిర్మాతలంతా ఐక్యంగా ఒక్కమాట మీద ఉంటే తప్ప.. ఇలాంటివి సాధ్యంకాదు. ఇలాంటి నిర్ణయాలు బోలెడు అనుకుంటూ ఉంటారు గానీ.. ఆచరణలోకి వచ్చేవరకు నమ్మలేం.