అంబటి తిరుపతి రాయుడు.. చివరికి అర్థాంతరంగా క్రికెట్ కెరీర్‌ని ముగించేసుకున్నాడు. వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్న సమయంలో అంబటి రాయుడి రిటైర్మెంట్ అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. అన్నట్టు, వరల్డ్ కప్‌కి కొద్ది రోజుల ముందరే 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అభిమానుల మనసుల్ని గెలిచాను.. క్రికెట్ రాజకీయాల ముందర ఓడిపోయాను.. అంటూ అప్పట్లో ఉద్వేగంగా వ్యాఖ్యానించాడు యువీ.
ఇప్పుడు అంబటి రాయుడి పరిస్థితీ యువరాజ్ సింగ్‌కి ఏమాత్రం భిన్నంగా లేదు. 47 సగటుతో 50కి పైగా వన్డేలు ఆడిన ఈ క్రికెటర్‌కి, వరల్డ్ కప్‌లో చోటు దక్కడం ఖాయమని అంతా అనుకున్నారుగానీ, సెలక్టర్లు మాత్రం అంబటి రాయుడి కంటే విజయ్ శంకర్ బెస్ట్ అనుకున్నారు. పైగా, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ 'త్రీడీ' అనే కొత్త ఈక్వేషన్ని పరిచయం చేస్తూ, అంబటిపై సెటైర్లు వేశాడు.
దాంతో, 'త్రీడీ కళ్ళద్దాల కోసం ఆర్డర్ చేశాను..' అంటూ సోషల్ మీడియాలో అంబటి రాయుడి సెటైర్ వేయాల్సి వచ్చింది. ఆ సెటైర్, ఈ తెలుగు క్రికెటర్ అవకాశాల్ని మరింత దెబ్బతీసిందన్న వాదనలూ లేకపోలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి అర్థాంతరంగా వైదొలగినా, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కూడా అదే బాటలో స్వదేశానికి పయనమైనా, అంబటి రాయుడికి మాత్రం పిలుపు రాలేదు జట్టు యాజమాన్యం నుంచి.
ఈ నేపథ్యంలో, అంబటి రాయుడు సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. అయితే, 'రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం ద్వారా అంబటి రాయుడు తొందరపడ్డాడు' అంటూ కొందరు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకుని వుంటే బావుండేది'.. అన్నది సదరు క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. కానీ, ఇంకా క్రికెట్లో కొనసాగి అవమానాలు ఎదుర్కొనడం కంటే, ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన అంబటి, తన నిర్ణయాన్ని బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు.
మొత్తమ్మీద, క్రికెట్లో అంబటి రాయుడి ప్రస్థానం ముగిసినట్లే. జట్టులో చోటు కోసం సుదీర్ఘ పోరాటం చేసి, చోటు దక్కాక దాన్ని నిలబెట్టుకోవడం కోసం నానా తంటాలూ పడి.. చివరికి క్రికెట్ రాజకీయాలకు అంబటి బలైపోవడం బాధాకరమే.