ఉచిత పథకాలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి పథకాలను అడ్డుకోలేమని తేల్చి చెప్పింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు ఉచితాలు పంపిణీ ప్రకటనలు చేస్తున్నాయని, వీటిని అడ్డుకోవాలంటూ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఎన్నికల వేళలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఉచిత హామీలు ఎన్నికల్లో గెలుపోటములను నిర్దేశిస్తాయని అనుకోవడం లేదని ధర్మాసనం తెలిపింది. ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసిన పార్టీలు ఎన్నికల్లో ఓడిపోతున్నాయనే విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేయడం గమనార్హం. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పౌరులు గౌరవంగా బతికేందుకు దోహదం చేస్తోందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.
ఏది ఉచితం? ఏది కాదనేది ప్రధాన ప్రశ్న అని చీఫ్ జస్టిస్ అన్నారు. ఉచిత విద్య, వైద్యం, తాగునీటిని అందించడం ఉచిత పథకాలుగా భావించాలా? అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. అలా కాకుండా వినియోగదారులు ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతరత్రా వస్తువులను సంక్షేమ పథకాల కింద జమకట్టాలా? అని జస్టిస్ ఎన్వీ రమణ అడిగారు. అయితే ఉచితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండడాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తావించారు.
ఉచితాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కొందరంటుంటే, మరికొందరు మాత్రం అవన్నీ సంక్షేమ పథకాలని చెబుతున్నారని చీఫ్ జస్టిస్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఖర్చు చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలపై చర్చించి, వాటి గురించి సమగ్ర నివేదిక కోసం కమిటీ వేయాలని నిర్ణయించుకున్నట్టు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.