సినిమా రంగ అంటే అందరూ బడాబాబులే వుండరు. వందకు, యాభై కి కూడా తడుముకునే వాళ్లు కూడా వుంటారు. తెలుగు సినిమా రంగంలో అనేక మంది నిర్మాతలు వున్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా వుంది. ఈ కౌన్సిల్ మీద రకరకాల కబుర్లు కూడా వినిపిస్తుంటాయి. ఒకప్పుడు ఆరంభంలో ఎవరికి పడితే వారికి సభ్యత్వాలు ఇచ్చేసారని, ఇప్పుడు మాత్రం కనీసం మూడు సినిమాలు నిర్మిస్తే తప్ప సభ్యత్వం ఇవ్వరని అంటారు.
తమ వాళ్లు అందరినీ ఎడాపెడా ఓట్ల కోసం కౌన్సిల్ లో చేర్చేసారని ఇంటర్నల్ గా విమర్శలు వినిపిస్తుంటాయి. ఏటా ఇన్స్యూరెన్స్ ను ఎందరో చాలా చౌకగా ఈ విధంగా అందుకుంటున్నారనీ అంటారు. అవన్నీ ఎంతవరకు నిజమో కానీ, ఈ కౌన్సిలో సంబంధం లేకుండా రెగ్యులర్ గా సినిమాలు తీసేవారంతా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సంగతి ఇలా వుంచితే, కరోనా నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ కి 10 వేల వంతున రుణం ఇస్తామంటూ కౌన్సిల్ ప్రకటించింది. ఒక విధంగా ఇది రుణం కాదు. కౌన్సిల్ లో చేరినపుడు పాతిక వేల వంతున సభ్యత్వ రుసుం చెల్లించారు. అందులో పదివేలు వెనక్కు ఇవ్వడం అన్నమాట. ఇలా తీసుకున్న వారు మళ్లీ కొన్నాళ్ల తరువాత వెనక్కు ఇచ్చేయాలి. అలా ఇవ్వకపోతే, వాళ్లకు ఏటా ఇచ్చే ఇన్స్యూరెన్స్ సదుపాయం వుండదు.
నిర్మాతలు కదా, ఎవరు పది వేల కోసం వస్తారు. పదివేలు కూడా లేకుండా వున్న నిర్మాత వుంటారా? అనుకున్నారు చాలా మంది. కానీ గమ్మత్తు ఏమిటంటే ఇప్పటికి 95 మంది వరకు ఇలా పదేసి వేలు వంతున తమకు ఇవ్వమని దరఖాస్తు చేసుకున్నారట. ఎందరినో హీరోలను చేసి, డైరక్టర్లను చేసి, ఎందరికో లైఫ్ ఇచ్చినా, నూటికి తొంభై మంది నిర్మాతలది ఆఖరికి ఇదే పరిస్థితి.