నాగబాబు ‘అతి’.. అభిమానులకే నచ్చట్లేదు

చిరంజీవి సోదరుడు నాగబాబు, సోషల్‌ మీడియా వేదికగా 'రచ్చ' చేస్తున్నారు. అదీ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి వ్యతిరేకంగా. మొన్న 'బ్లడ్‌ అండ్‌ బ్రీడ్‌' అంటూ ఓ ఫొటో పెట్టాడు, తాజాగా…

చిరంజీవి సోదరుడు నాగబాబు, సోషల్‌ మీడియా వేదికగా 'రచ్చ' చేస్తున్నారు. అదీ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి వ్యతిరేకంగా. మొన్న 'బ్లడ్‌ అండ్‌ బ్రీడ్‌' అంటూ ఓ ఫొటో పెట్టాడు, తాజాగా ఓ కవితని పోస్ట్‌ చేసి.. 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' మీద సెటైర్లు వేశాడు. ఇవన్నీ నాగబాబు ఎందుకు చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అవును, పవన్‌ అభిమానుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసమే. 

అప్పుడెప్పుడో బాలయ్య, పవన్‌కళ్యాణ్‌ మీద చేసిన కామెంట్స్‌కి లేటుగా కళ్ళు తెరిచిన నాగబాబు.. సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్‌ ఇచ్చినప్పటినుంచి అసలు వ్యవహారం మొదలైంది. మొదట్లో అభిమానులు, నాగబాబు.. బాలయ్య మీద చేసిన కామెంట్స్‌తో పండగ చేసుకున్నారు. ఆ తర్వాత నాగబాబు అసలు ఉద్దేశ్యం వారికి అర్థమయ్యింది. అంతే, 'వద్దు బాబూ నాగబాబూ..' అంటూ సోషల్‌ మీడియాలోనే మొరపెట్టుకుంటోన్న పరిస్థితి ఏర్పడిందిప్పుడు. 

'మీ ఓవరాక్షన్‌ అంతా జనసేన పార్టీలో యాక్టివ్‌ అవడానికే కదా.? దయచేసి ఈ రచ్చ ఆపెయ్యండి. జనసేన పట్ల కాస్తో కూస్తోన్న ప్రజల్లో వున్న గుడ్‌ విల్‌, మీ కారణంగా పోయే ప్రమాదముంది. కుటుంబమంతా మళ్ళీ ఒక్కటై.. జనసేనను కుటుంబ పార్టీగా మార్చెయ్యొద్దు. గతంలో ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీరంతా కలిసి ఏం చేశారో చూశాం..' అంటూ సుదీర్ఘంగా అభిమానులు, నాగబాబుకి వివరణతో కూడిన విజ్ఞప్తి చేస్తున్నారు. 

రామ్‌గోపాల్‌ వర్మ, సోషల్‌ మీడియాలో 'అతి' చేశాడంటే అర్థముంది.. శ్రీరెడ్డి చేసిందన్నా అర్థం చేసుకోవచ్చు. కానీ, నాగబాబు కూడా అదే చేస్తే ఎలా.? చిరంజీవి సోదరుడిగా, నటుడిగా, నిర్మాతగా నాగబాబు తనకున్న డిగ్నిటీని.. 'అభిమానుల్ని రెచ్చగొట్టి పండగ చేసుకోవాలనే క్రమంలో' కోల్పోతుండడం ఆశ్చర్యకరమే.