శరత్‌కుమార్‌కి ఎందుకీ ‘దురద’

శరత్‌కుమార్‌ అంటే మనకి సినీ నటుడిగానే తెలుసు. తమిళ రాజకీయాల్లో మాత్రం ఎప్పటినుంచో ఆయన తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొత్తగా ఓ పార్టీ పెట్టాడుగానీ, ఆ పార్టీతో ఆయన రాజకీయంగా సాధించిందేమీ లేదు.…

శరత్‌కుమార్‌ అంటే మనకి సినీ నటుడిగానే తెలుసు. తమిళ రాజకీయాల్లో మాత్రం ఎప్పటినుంచో ఆయన తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొత్తగా ఓ పార్టీ పెట్టాడుగానీ, ఆ పార్టీతో ఆయన రాజకీయంగా సాధించిందేమీ లేదు. అన్నాడీఎంకే పార్టీకి ఆయన అత్యంత సన్నిహితుడు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోతే, అందులో శశికళ వర్గానికి శరత్‌కుమార్‌ ఈ మధ్యనే మద్దతిచ్చిన విషయం విదితమే. జయలలిత జీవించి వున్నన్నాళ్ళూ చాలామంది సినీ ప్రముఖులు అన్నాడీఎంకే పార్టీతో సన్నిహితంగా మెలిగేవారు. కొందరు వ్యతిరేకించేవారనుకోండి.. అది వేరే విషయం. 

ఎప్పుడైతే అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలి, జైలుకు వెళ్ళారో ఆ తర్వాత పరిస్థితులు మారాయి. అవినీతికి వ్యతిరేకంగా సినీ జనాలు మాట్లాడటం మొదలు పెట్టారు. అలా పన్నీర్‌ సెల్వం వర్గానికి మెజార్టీ సినీ ప్రముఖులు మద్దతిచ్చారు. కానీ, శరత్‌కుమార్‌ – ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా శశికళ వర్గానికే తన మద్దతు అని ప్రకటించడమే కాదు, పోటీలో ఆ వర్గం తరఫున నిలిచిన దినకరన్‌ని కలిసి చాలా హడావిడి చేశాడు. 

ఫలితం.. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇబ్బందులు. అసలెందుకు శరత్‌కుమార్‌, రాజకీయ 'దురద' ఇప్పుడు ప్రదర్శించాడో ఎవరికీ అర్థం కావడంలేదు. 'డబ్బు పంపకం కోసం శరత్‌కుమార్‌ని వాడుకున్నారు..' అనే ఆరోపణలు ఆయన అభిమానుల నుంచే వ్యక్తమవుతున్నాయి. శరత్‌కుమార్‌ మాత్రం, ఎప్పటినుంచో ఆ పార్టీతో వున్న అనుబంధం కారణంగానే దినకరన్‌కి మద్దతిచ్చానంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 100 కోట్లు ఈ ఉప ఎన్నిక కోసం దినకరన్‌ వెచ్చిస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ ధృవీకరించి, ఉప ఎన్నికని రద్దు చేసిన విషయం విదితమే. 

రాజకీయ నాయకులకి ఇలాంటి కేసుల్లో పెద్దగా నష్టమేమీ వుండదు. కానీ, శరత్‌కుమార్‌ ఇమేజ్‌ మాత్రం దారుణంగా పడిపోయింది. 'రజనీకాంత్‌ రాజకీయాల్లోకొస్తే నేనొప్పుకోను.. తమిళనాడుకి చెందిన వ్యక్తి కాదాయన..' అంటూ మొన్నీమధ్యనే రెచ్చిపోయిన శరత్‌కుమార్‌, ఇకపై రాజకీయాల గురించి మాట్లాడే అర్హతను కోల్పోయారనే చెప్పాలి.