దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఐదు రోజుల ముందు ట్రంప్ యూరోప్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలాకాలంగా అమెరికాకు మద్దతుగా నిలిచిన నాటో, యూరోపియన్ యూనియన్ల గురించి చులకనగా తీసిపారేశాడు. ''ద టైమ్స్'' అనే బ్రిటిషు పత్రికకు, ''బిల్డ్'' అనే జర్మన్ పత్రికకు కలిపి ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్మనీ నేతృత్వంలో నడుస్తున్న ఈయు నుంచి బ్రిటన్ బాటలోనే తక్కిన దేశాలన్నీ నడుస్తాయని, శరణార్థులను రానివ్వడంలో జర్మనీ ఛాన్సెలర్ ఏంజిలా మెర్కెల్ పెద్ద పొరపాటు చేస్తోందని కుండ బద్దలు కొట్టి చెప్పాడు. ఈయు విషయంలో అమెరికాకు పెద్ద పాత్ర లేదు కాబట్టి ఆ వ్యాఖ్యల మాట ఎలావున్నా కాలం చెల్లిన, ఖర్చుదారీ వ్యవహారంగా మిగిలిన నాటో నుంచి వైదొలుగుతామని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. రెండవ ప్రపంచ యుద్ధంలో పెట్టుబడిదారీ దేశాలైన అమెరికా, ఇంగ్లండు, ఇతర దేశా లు కమ్యూనిస్టు దేశమైన రష్యాతో చేతులు కలిపి జర్మనీ, ఇటలీ, జపా న్లను ఓడించాయి. శత్రువు ఓడిపోయాక స్వప్రయోజనాలు ముం దుకు వచ్చాయి. గెలిచిన దేశాలలో కమ్యూనిజం వ్యాప్తి చేయాలని రష్యా, రష్యా ప్రభావాన్ని అడ్డుకోవాలని అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్సు లు తంటాలు పడ్డాయి. జర్మనీని రెండు ముక్కలుగా చేస్తే తూర్పు జర్మనీని రష్యా తన అధీనంలోకి తీసుకుని అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇలా వదిలేస్తే యూరోప్ అంతా కమ్యూని జం వ్యాపించేస్తుందని భయపడి 1949 ఏప్రిల్‌లో అమెరికా తన సారథ్యంలో నాటో ఏర్పాటు చేసింది. అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్సు పోర్చుగల్, ఇటలీ, నార్వే, డెన్మార్క్ వంటి ఉత్తర అమెరికా, యూరోప్ దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. ఇది ప్రధానంగా సైనిక ఒప్పందం. సభ్య దేశాలపై ఎవరైనా (కమ్యూనిస్టు దేశాలని భావం) దాడి చేస్తే యివన్నీ ఉమ్మడిగా ప్రతిఘటించాలని ఒప్పందం. దానికి గాను సైన్యం సమీకరించారు. సైన్య నిర్వహణకు గాను అందరూ తలా కాస్తా నిధులిస్తామన్నారు. ఈ విధంగా అమెరికా పశ్చిమ యూ రోప్‌పై తన పెత్తనాన్ని నిలుపుకుంది. తూర్పు యూరోప్‌పై పెత్తనం సాగిస్తున్న రష్యా నాటోను చూసి కంగారు పడింది. తన మాట చెల్లు బాటు అయ్యే ఏడు తూర్పు యూరోప్ దేశాలతో కలిసి వార్సా ఒప్పం దం కింద 'ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్, కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ ఎసిస్టెన్స్' పేర ఒక కూటమిని 1955లో ఏర్పరచింది. అది చూసి భయపడి మరి కొన్ని దేశాలు నాటోలో చేరాయి. రష్యా ప్రభావం సడలిపోయిన తర్వాత తూర్పు యూరోప్ దేశాలూ వచ్చి చేరాయి.
నాటోలో చేరిన దేశాలే కాదు, విడిచిపోయిన దేశాలూ వున్నాయి. నాటో అమెరికా ఆధిపత్యంలో నడుస్తోందని, బ్రిటన్ దానికి తోకగా తయారైందని, తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందని అలిగి ఫ్రాన్సు 1959లోనే తప్పుకోవడం మొదలుపెట్టింది. తన దేశంలో నాటో సైన్యాలను, ఆయుధాలను రానివ్వలేదు. నాటో భయపడినట్లు సభ్య దేశాలపై దాడులు ఏమీ జరగలేదు. కానీ అమెరికా ఇరాక్ వ్యవ హారాల్లో తలదూర్చినపుడు వాళ్లకి అండగా నిలబడసాగింది. రష్యా ఆధిపత్యం క్షీణించడంతో 1989లో కొన్ని దేశాల్లో తిరుగుబాట్లు వచ్చా యి. దానాదీనా 1991లో వార్సా ఒప్పందం విచ్ఛిన్నమై పోయింది. అదే ఏడాది డిసెంబరులో రష్యా కూడా చిన్నాభిన్నమైౖంది. అప్ప ణ్నుంచి నాటోకు కమ్యూనిస్టు భయం తొలగిపోయింది. అప్పుడే నాటో దుకాణం కట్టిపెట్టేసి వుంటే బాగుండేది. కానీ కొనసాగించారు. మిల టరీ సహకారంతో బాటు యితర కార్యక్రమాలు కూడా చేపట్టారు. 1991 నాటికి యూరోపియన్ దేశాలు ఖర్చులో 34% భరించేవి. 2012 నాటికి అది 21%కి పడిపోయింది. ప్రస్తుతం అమెరికా 70% భరిస్తోంది. ఐదు దేశాలు మాత్రమే అమెరికాకు రక్షణ వ్యయాన్ని చెల్లిస్తున్నాయి. తక్కినదంతా చేతిచమురే. దీనికిగాను అమెరికాకు దక్కినదేమిటంటే – 9/11 దాడులు జరిగిన తర్వాత సభ్యదేశమైన అమెరికాపై దాడి అల్‌ఖైదా దాడి చేసింది కాబట్టి మనమంతా అమెరి కాకు అండగా నిలవాలి అంటూ నాటో సైన్యాలు అఫ్గనిస్తాన్‌లో కొం తకాలం యుద్ధం చేశాయి. ఏది ఏమైనా తాలిబన్లతో యుద్ధంలో కానీ, బిన్ లాడెన్‌ను చంపడంలో కానీ అమెరికాయే ప్రధానంగా భారం మోసింది. ఉక్రెయిన్ వ్యవహారంలో అమెరికా రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించినపుడు నాటో వత్తాసు పలికింది.
నాటోకు ఇచ్చినది, నాటో నుంచి పొందినది లెక్కవేసి చూస్తే అమెరికాకు ఇది నష్టదాయకమైనదే అని తేలుతుంది. అందుకే ట్రంప్ అన్నాడు – ''68 ఏళ్ల క్రితం నాటో ఏర్పడిన పరిస్థితులు ఇప్పుడు లేవు. పైగా ఒప్పందం ప్రకారం మనకు చెల్లించవలసిన మొత్తాలు ఆ యా దేశాలు చెల్లించటం లేదు.'' అని. రష్యాతో మైత్రీపరమైన బంధం ఏర్ప రచుకుంటే యిలాటి తోక సంస్థలను మేన్‌టేన్ చేయవలసిన భారం తప్పుతుంది కదా అని అతని ఆలోచన. కానీ ఇది అమెరికాలో కొం దరికి నచ్చటం లేదు. ''న్యూయార్క్ టైమ్స్'' తన సంపాదకీయంలో 'నాటో ఒకప్పుడు మనకు అందించిన సాయం మర్చిపోకూడదు. నాటోను రద్దు చేస్తే పుతిన్‌కు సాయపడినట్లే..' అని విమర్శించింది. ఇతర సభ్యదేశాలు తాము ఇవ్వవలసినది ఇవ్వకపోయినా గొప్పలకు పోయి నిష్ప్రయోజనంగా తేలిన నాటోను నిర్వహిస్తూ పోవడం కంటె ఆ డబ్బు మిగుల్చుకోవడం మంచిదే కదా అన్న ట్రంప్ ప్రశ్నకు ఆ సంపాదకీయంలో సమాధానం లేదు.