టీమిండియాకు ప్రతిష్టాత్మక 500వ టెస్టులో తొలి రెండు రోజుల పాటూ పట్టు నిలుపుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణయాత్మక మూడో రోజున చేతులు ఎత్తేసింది. భారత స్పినర్ల ధాటికి కాన్పూర్ గ్రీన్ పార్క్ పిచ్ పై కివీ బ్యాట్స్ మన్ కుప్పకూలారు. స్పినర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్రజడేజాలు కివీల పతనాన్ని శాసించారు. రవీంద్ర జడేజా తన కెరీర్ లో ఐదో సారి ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. అశ్విన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వీరి ధాటికి న్యూజిలాండ్ 262 పరుగులకు కుప్పకూలింది.
రెండో రోజు ఆటలో కివీల జట్టు భారత స్పిన్ తంత్రాన్ని గట్టి ఎదుర్కొన్న విషయం విదితమే. మూడో రోజు మాత్రం అలా జరగలేదు. కివీల టాప్ ఆర్డర్ కొంత వరకూ ప్రతిఘటించినా.. లోయర్ ఆర్డర్ పూర్తిగా దాసోహం అయ్యింది. చివరి ఐదు వికెట్లూ కేవలం 29 బంతులకే పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో రన్నులేమీ ఇవ్వకుండా మూడు వికెట్లను పడగొట్టాడు. తృటిలో హ్యాట్రిక్ మిస్సయ్యాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆచితూచి ఆడుతోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ , మురళీ విజయ్ లు ఎనిమిది ఓవర్లకు 23 పరుగులతో ఆడుతున్నారు. 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిపత్యాన్ని సాధించిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో కనీసం మూడొందలు చేసినా.. వరుణుడు అడ్డంకిగా నిలవకపోతే.. సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకోగలదు.