మన తెలుగోడు.. మాజీ వికెట్ కీపర్.. ఆంధ్రా క్రికెట్ తరఫున చాలాకాలం ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెస్కే ప్రసాద్‌కి అరుదైన గౌరవం దక్కింది. గౌరవం కాదిది, బాధ్యత అంటున్నాడాయన. బీసీసీఐ సెలక్టర్స్ కమిటీ ఛైర్మన్‌గా సందీప్ పాటిల్ స్థానంలో ఎమ్మెస్కే ప్రసాద్ ఎంపికయ్యారు.
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున 6 టెస్టులు 17 వన్డేలు ఆడిన ఎమ్మెస్కే ప్రసాద్, వికెట్ కీపర్‌గా మంచి ప్రదర్శనతోనే ఆకట్టుకున్నా, బ్యాట్స్‌మన్‌గా మాత్రం రాణించలేకపోయాడు. అరుదుగా వచ్చిన అవకాశాలే కావడంతో, వాటినీ సద్వినియోగం చేసుకోలేకపోయినా, అతని టాలెంట్ మాత్రం తక్కువేమీ కాదని సీనియర్లు అప్పట్లో ఎమ్మెస్కే టాలెంట్‌కి కితాబులిచ్చారనుకోండి.. అది వేరే విషయం.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకి చెందిన ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియాలో స్థానం సంపాదించుకోలేకపోయినా, బీసీసీఐతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. సెలక్టర్ల ప్యానల్లో ఇదివరకే పనిచేసిన ఎమ్మెస్కే, ఇప్పుడు సెలక్టర్ల కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకోవడం విశేషమే మరి. ఈ అరుదైన గౌరవం తనకు దక్కడం పట్ల చాలా ఆనందంగా వుందని ఎమ్మెస్కే ప్రసాద్ అంటున్నారు. టీమిండియా రానున్న రోజుల్లో ఇంకా మెరుగ్గా రాణించేందుకు సెలక్టర్స్ కమిటీ ఛైర్మన్‌గా తనవంతు బాధ్యత నిర్వహిస్తానని ఎమ్మెస్కే చెప్పుకొచ్చారు.
మొత్తమ్మీద, సెలక్టర్ల కమిటీ ఛైర్మన్ మనోడే అయినా, మన తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి టాలెంట్ వున్న ఆటగాళ్ళను ఎంపిక చేయడంలో తనదైన ముద్ర వేయగలుగతారా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే బీసీసీఐలో పెత్తనమంతా ఉత్తరాది ప్రముఖులదే.