సెహ్వాగ్ నువ్వు కేక హే.. భలే దెబ్బ కొట్టావ్!

అతడెవరో పియర్స్ మోర్గన్ అట.. వృత్తి రీత్యా జర్నలిస్టు. అయితే నోటి తీట తీవ్ర స్థాయిలో ఉన్న జర్నలిస్టు. తనకు ఏ మాత్రమూ సంబంధం లేని వ్యవహారం గురించి స్పందించి భారతీయుల మనోభావాలను దెబ్బతీయ…

అతడెవరో పియర్స్ మోర్గన్ అట.. వృత్తి రీత్యా జర్నలిస్టు. అయితే నోటి తీట తీవ్ర స్థాయిలో ఉన్న జర్నలిస్టు. తనకు ఏ మాత్రమూ సంబంధం లేని వ్యవహారం గురించి స్పందించి భారతీయుల మనోభావాలను దెబ్బతీయ ప్రయత్నించాడు. 120 కోట్ల జనాభా ఉన్న దేశం కేవలం రెండు ఒలింపిక్స్ మెడల్స్ గెలుచుకున్నందుకు సంబరాలు చేసుకొంటోంది.. అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. చాలా సహజసిద్ధమైన తెల్లతోలు వ్యంగ్యం వ్యక్తం అయ్యింది ఆ బ్రిటీషోడి దగ్గర నుంచి.

అయితే ఏం చేద్దాం.. నిజమే,  రెండు ఒలింపిక్స్ మెడల్స్ కు మురిసిపోవడం మన బలహీనత. ఇంతకు మించి ఏమీ చేయలేని స్థితి. ఈ ఆలోచనే చాలా మందిని బ్రిటీషోడి వ్యంగ్యం విషయంలో స్పందించకుండా చేసింది. అతడి ఎగతాళిని భరించక తప్పని పరిస్థితిలోని నెట్టేసింది. అయితే అందరు భారతీయులూ మోహమాటంతో, సిగ్గుపడుతూ ఉండరు కదా.. అక్కడక్కడ వీరూ లాంటీ వాళ్లూ ఉంటారు. ఆటతీరులోనే కాదు.. మాటతీరులోనూ వారి ధాటి అవతల వారిని అదరగొట్టేస్తుంది.

ఆ బ్రిటీషనర్ ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు డ్యాషింగ్ బ్యాట్స్ మన్ వీరూ. 120 కోట్ల మంది మనోభావాల మీద దెబ్బ కొట్టిన వ్యక్తికి తగురీతిలో ఉంది సమాధానం. ఇండియా ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించలేకపోతోందని వ్యంగ్యం ప్రదర్శించిన ఆ జర్నలిస్టుకు.. క్రికెట్ లో ఇంగ్లండ్ గతి ఏమిటో నొక్కి చెప్పాడు వీరూ!

 ‘అవును.. మేం చిన్న సంతోషాలనే సంబరంగా మార్చుకున్నాం. మరి క్రికెట్ ను ఇన్వెంట్ చేసిన దేశం మీది. మరి ఇంత వరకూ ఒక్క ప్రపంచకప్పునూ సాధించలేకపోయిందే మీ దేశం.. ఇప్పటికీ వరల్డ్ కప్ కోసం మీరు సాగిస్తున్న వేట  ఎంబరాసింగ్ గా లేదా?’’ అంటూ సెహ్వాగ్ ఘాటైన ట్వీట్ ను పెట్టాడు.

మరి 1975 నుంచి వన్డే వరల్డ్ కప్ సాధనలో ఇంగ్లండ్ ప్రయాస ఏమిటో వివరించనక్కర్లేదు. భారత్ అయినా ఒలింపిక్స్ లో కొన్ని స్వర్ణాలను చూసింది. క్రికెట్ ను పుట్టించిన ఇంగ్లండ్ కు ఇంత వరకూ ఒక్క వన్డే వరల్డ్ కప్పూ దక్కలేదు. మరి సెహ్వాగ్ ఎంతటి బలమైన పంచ్ ఇచ్చాడో సగటు బ్రిటీషర్ కే అర్థం అయ్యుంటుంది.

అయితే మోర్గన్ మాత్రం తగ్గలేదు.. “మా దేశం టీ 20 వరల్డ్ కప్ నెగ్గింది.. లెజెండ్, ఆ ప్రపంచకప్ లో పీటర్సన్ కు మ్యాన్ ఆఫ్ ద సీరిస్ దక్కింది’’ అంటూ చె ప్పుకొచ్చాడు.

ఇక్కడే మళ్లీ వీరూకి దొరికిపోయాడు ఆ బ్రిటీషర్. పీటర్సన్ ప్రస్తావన తెచ్చి అతడు బుక్ అయ్యాడు. ఎందుకంటే.. పీటర్సన్ జన్మతః బ్రిటిషర్ కాదు. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒక నల్లజాతి కుటుంబీకుడతడు. కొంతకాలం సౌతాఫ్రికాకు ఆడి.. ఇంగ్లండ్ కు వలస వచ్చాడతను. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. సెహ్వాగ్ మరో పంచ్ ఇచ్చాడు.

“టీ 20 ప్రపంచకప్ విజయాన్నే సెలబ్రేట్ చేసుకుంటాం.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పీటర్సన్ ను హీరో అనుకొంటే మాకేం అభ్యంతరం లేదు.. అలాగే మా సంబరాలూ మేం చేసుకుంటాం.’’ అంటూ మళ్లీ కిక్కురుమనలేని స్థాయిలో సెహ్వాగ్ ట్వీట్ పెట్టే సరికి ఆ బ్రిటీషర్ మళ్లీ మారు మాట్లాడలేదు!

మొత్తానికి క్రికెట్ నుంచి రిటైరైనా.. వీరూ మాత్రం మాంఛి ఫామ్ లో ఉన్నట్టున్నాడు. ఇటీవల ఒలింపియన్ల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన శోభాడేకు ఘనమైన ‘సన్మానం’ చేసింది కూడా వీరూనే. ఇప్పుడు బ్రిటీషోడికి దక్కింది ఆ భాగ్యం!