ఆ టైటిల్ కు చిరు సై అంటారా?

గ్యాంగ్ లీడర్..మెగాస్టార్ చిరంజీవి సాధించిన విజయాల్లో దానిది ఓ ప్రత్యేకత. అంతే కాదు. అదే సినిమాతో చిరంజీవి బాలీవుడ్ లోకి వెళ్లారు. గ్యాంగ్ లీడర్ విజయోత్సవ వేడుకలు ఇప్పటికీ చిరు ఫ్యాన్స్ కు ఓ…

గ్యాంగ్ లీడర్..మెగాస్టార్ చిరంజీవి సాధించిన విజయాల్లో దానిది ఓ ప్రత్యేకత. అంతే కాదు. అదే సినిమాతో చిరంజీవి బాలీవుడ్ లోకి వెళ్లారు. గ్యాంగ్ లీడర్ విజయోత్సవ వేడుకలు ఇప్పటికీ చిరు ఫ్యాన్స్ కు ఓ మధుర ఘట్టంగా మిగిలిపోయాయి. అలాంటి సినిమా టైటిల్ ను వాడేసుకోవాలనుకుంటున్నాడట సాయి ధరమ్ తేజ. 

ఇప్పటికే సినిమాల్లో మేనమామ పాటలను, మేనరిజమ్స్ ను విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాడు ఇతగాడు. ఇప్పుడు ఈ టైటిల్ కూడా వాడేయాలనుకుంటున్నట్లు వినికిడి. ఠాగోర్ మధు, నల్లమలపు బుజ్జి కలిసి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మించే సినిమాలో సాయి ధరమ్ తేజ హీరో. ఈ సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు బోగట్టా. 

అయితే మెగాస్టార్ చిరంజీవి ఊ అనకుండా ఈ టైటిల్ ను ఖాయం చేయరు అన్నది వాస్తవం. ఇప్పటికి ఇంకా ఆయన దృష్టికి ఈ విషయం తీసుకు వెళ్లలేదు. వెళ్లాక, ఆయన ఊ అన్నాక అప్పుడు కొత్త గ్యాంగ్ లీడర్ రెడీ అవుతుంది. కానీ మరి మెగాస్టార్ తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆ టైటిల్ ను సాయిధరమ్ కు ఇస్తారా అన్నదే అనుమానం. 

ఇదిలా వుంటే గ్యాంగ్ లీడర్ టైటిల్ వాడదాం అన్న ఆలోచన బయటకు రాగానే అసలు గ్యాంగ్ లీడర్ రీమేక్ అంటూ వార్తలు వినవచ్చాయి. అది మాత్రం నిజం కాదని సాయి ధరమ్ తేజ సన్నిహిత వర్గాలు తెలిపాయి.