ఫిబ్రవరి బాక్సాఫీస్ రివ్యూ.. ఒకే ఒక్క ఉప్పెన

కరోనా/లాక్ డౌన్ తర్వాత పూర్తిస్థాయిలో థియేటర్లు ఓపెన్ అయిన నెలగా ఈ ఏడాది ఫిబ్రవరి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిచాయి. సినిమాలు కూడా మొహమాటపడకుండా…

కరోనా/లాక్ డౌన్ తర్వాత పూర్తిస్థాయిలో థియేటర్లు ఓపెన్ అయిన నెలగా ఈ ఏడాది ఫిబ్రవరి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిచాయి. సినిమాలు కూడా మొహమాటపడకుండా దండిగా విడుదలయ్యాయి. ఫిబ్రవరి నెలలో 22 సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో క్లిక్ అయినవి మాత్రం కొన్నే.

ఫిబ్రవరి మొదటివారంలో ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో కాస్త క్రేజ్ తెచ్చుకున్న సినిమా జాంబీ రెడ్డి మాత్రమే. బాలనటుడు తేజ సజ్జాను ఫుల్ లెంగ్త్ హీరోగా పరిచయం చేసిన ఈ సినిమా.. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. ప్రమోషన్ బాగా చేయడంతో మొదటి 3 రోజులు వసూళ్లు బాగా వచ్చాయి. ఆ తర్వాత సినిమా కోలుకోలేకపోయింది. 2 వారాల్లో 15 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చిందంటూ మేకర్స్ ప్రకటించుకున్నప్పటికీ.. ఈ సినిమా బడ్జెట్, కాస్టింగ్ ఆధారంగా చూసుకుంటే ఇది ఎబోవ్ యావరేజ్ సినిమా మాత్రమే.

ఇక జాంబీ రెడ్డితో పాటు థియేటర్లలోకి వచ్చిన ఇతర సినిమాలేవీ నిలబడలేకపోయాయి. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, ప్రణవం, నాతో ఆట, చేతిలో చెయ్యేసి చెప్పుబావ, జై మరియమ్మ, జర్నలిస్ట్, విఠల్ వాడి, రాధాకృష్ణ, జి-జాంబీ లాంటి సినిమాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. 

ఇక ఫిబ్రవరి రెండో వారంలో ఉప్పెన, ఎఫ్.సీ.యూ.కే, వైతరుణి రానా సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వైష్ణవ్ తేజ్, కృతిషెట్టిలను హీరోహీరోయిన్లుగా.. బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేసిన ఈ సినిమా కళ్లుచెదిరే కలెక్షన్లు రాబట్టింది. కొత్త హీరోహీరోయిన్లు, కొత్త దర్శకుడితో వచ్చిన ఈ సినిమా మొదటి వారానికే 70 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి ట్రేడ్ ను ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది క్రాక్ సినిమా తర్వాత సాలిడ్ హిట్ ఇదే.

ఉప్పెనతో పాటు వచ్చిన ఎఫ్.సీ.యూ.కే డిజాస్టర్ అయింది. జగపతిబాబు, రామ్ కార్తీక్ తండ్రికొడుకులుగా నటించిన ఈ సెమీ అడల్డ్ ప్రయోగం పూర్తిగా వికటించింది. దీంతో పాటు వచ్చిన వైతరుణి రానా కూడా ఫ్లాప్ అయింది.

ఫిబ్రవరి మూడో వారంలో నాంది, కటపధారి, చక్ర, పొగరు సినిమాలు రిలీజయ్యాయి. ఇవన్నీ వేటికవే విభిన్నమైనవి. అల్లరి నరేష్ నుంచి సీరియస్ మూవీగా వచ్చిన నాంది సినిమా ఈవారం విజేతగా నిలిచింది. అండర్ ట్రయల్ ఖైదీగా అల్లరోడి నటన అందర్నీ ఆకట్టుకుంది. మౌత్ టాక్ తో ఈ సినిమాకు రోజురోజుకు వసూళ్లు పెరిగాయి.

ఇక నాందితో పాటు వచ్చిన మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కన్నడలో సూపర్ హిట్టయిన కవలుధారి సినిమాకు రీమేక్ గా కపటధారి వచ్చింది. సుమంత్ నటించిన ఈ తెలుగు రీమేక్ ఫ్లాప్ అయింది. అటు విశాల్ చక్ర సినిమా మరోసారి అభిమన్యుడు మూవీని గుర్తుచేయగా… ధృవ సర్జా-రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన పొగరు సినిమా , పాత చింతకాయ పచ్చడి కథతో ఫ్లాప్ అయింది.

ఇక ఫిబ్రవరి ఆఖరి వారంలో భారీ అంచనాల మధ్య వచ్చింది చెక్ సినిమా. నితిన్ హీరోగా, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఆశ్చర్యంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. ప్రస్తుతం నడుస్తున్న టాక్, వస్తున్న వసూళ్లు బట్టి చూస్తే.. ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యం. ఓ ఫ్లాప్ సినిమాతో నితిన్ ఈ ఏడాదిని స్టార్ట్ చేసినట్టయింది.

ఉప్పెనతో పాటు వచ్చిన అక్షర, క్షణక్షణం, బాలమిత్ర, ఏప్రిల్ 28 విడుదల సినిమాలన్నీ ఫ్లాపులుగా నిలిచాయి. నందిత శ్వేత నటించిన అక్షర సినిమాపై రిలీజ్ కు ముందు కాస్త బజ్ ఉన్నప్పటికీ.. విడుదల టైమ్ కు ఆ ప్రభావం కనిపించలేదు.

ఇలా ఫిబ్రవరిలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవగా.. అదే స్థాయి అంచనాలతో వచ్చిన చెక్ సినిమా ఫ్లాప్ అయింది.

పవన్ ఓ మానసిక రోగి

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ