పాక్-భారత్ క్రికెట్‌పై ‘దాడి’…

ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా పుంజుకుంటున్న పాకిస్థాన్-భారత్ క్రికెట్ సంబంధాలు తాజా ఉగ్రవాద దాడితో మరోసారి ప్రమాదంలో పడ్డాయి. పంజాబ్‌లో ఉగ్రదాడి దరిమిలా… భారత్‌తో క్రికెట్ సంబంధాల పునరుధ్ధరణకు ఆశగా ఎదురు చూస్తున్న పాకిస్థాన్ కలలు కల్లలయే…

ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా పుంజుకుంటున్న పాకిస్థాన్-భారత్ క్రికెట్ సంబంధాలు తాజా ఉగ్రవాద దాడితో మరోసారి ప్రమాదంలో పడ్డాయి. పంజాబ్‌లో ఉగ్రదాడి దరిమిలా… భారత్‌తో క్రికెట్ సంబంధాల పునరుధ్ధరణకు ఆశగా ఎదురు చూస్తున్న పాకిస్థాన్ కలలు కల్లలయే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ తీవ్రవాద చర్యల కారణంగానే గత కొన్నేళ్లుగా భారత్-పాక్‌ల మధ్య ప్రత్యక్ష క్రికెట్ పోరు లేకుండా పోయిన సంగతి తెల్సిందే.  

ఇరు దేశాల్లోని క్రికెట్ అభిమానులకు ఇది బాధాకరమైన విషయమే అయినప్పటికీ… దేశ భధ్రతను మించిన విషయం ఏదీ ఉండదు కాబట్టి.. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఈ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. తర దేశాలతో కలిసి పాల్గొనే టోర్నమెంట్స్‌లో తప్ప ఈ రెండు దేశాలూ ముఖా ముఖి తలపడి ఒక సిరీస్ ఆడి చాలా ఏళ్లయింది. ఇప్పుడిప్పుడే వాతావరణం కాస్త సర్ధుకుంటున్న నేపధ్యంలో ఇరు దేశాల్లో కాకుండా తటస్థ వేదికలపై క్రికెట్ ఆడాలని దాదాపు అంగీకారానికి వచ్చి, వచ్చే డిసెంబరులో దుబాయ్‌లో సిరీస్‌ని ప్లాన్ చేశారు. 

అయితే తాజా దాడి ఈ సిరీస్ జరగడాన్ని సందేహాస్పదంగా మార్చింది. పంజాబ్‌లో ఉగ్రదాడి అనంతరం బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటన సందేహాలను మరింత పెంచుతోంది. ‘‘తీవ్రవాద చర్యలు-క్రికెట్ రెండూ ఒక ఒరలో ఇమడలేవు’’అని ఆయన పాక్‌కి స్పష్టం చేశారు. క్రికెట్ సంబంధాల కన్నా దేశ భధ్రత, రక్షణ అత్యంత ప్రధానమైన అంశాలని ఆయన తేల్చి చెప్పారు. భారత్‌లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు పాకిస్థాన్ పాల్పడుతున్నంత కాలం ఆ దేశంతో క్రికెట్ ఆడే అవకాశం లేదని ఆయన అంటున్నారు.

 -ఎస్బీ