ఇస్రో కొత్త చైర్మన్.. వెంకటేశ్వరుడి భక్తుడేనా..?!

ఇస్రో కొత్త చైర్మన్ గా శైలేష్ నాయక్ నియామకం దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. చైర్మన్ గా  రాధాకృష్ణన్ పదవీకాలం ముగియడంతో శైలేష్ నాయక్ కు అవకాశం లభించింది. అంతరిక్ష పరిశోధనల విషయంలో గత కొంతకాలంలో…

ఇస్రో కొత్త చైర్మన్ గా శైలేష్ నాయక్ నియామకం దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. చైర్మన్ గా  రాధాకృష్ణన్ పదవీకాలం ముగియడంతో శైలేష్ నాయక్ కు అవకాశం లభించింది. అంతరిక్ష పరిశోధనల విషయంలో గత కొంతకాలంలో ఇస్రో పేరు ప్రఖ్యాతులు రెట్టింపు అయ్యాయి. అంతరిక్ష పరిశోధనల విషయంలో ఇస్రో ఇతరదేశాల పరిశోధన సంస్థల నుంచి కూడా ప్రశంసలుపొందుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధణ సంస్థ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటిసంస్థలకు ధీటుగా ఇస్రో తన శక్తిసామర్థ్యాలను చాటుతోంది.

అయితే ఆ దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలకు ఉన్న నిధుల లభ్యతతో పోలిస్తే.. ఇస్రోకు ఉన్న ఆర్థిక శక్తి చాలా తక్కువ. ఇది మైనస్ పాయింట్. కానీ దీన్నే ప్లస్ పాయింట్ గా మార్చుకొంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. తక్కువ డబ్బు ఖర్చుతో ప్రయోగాలు నిర్వహించడం ఇస్రో ప్రత్యేకత అవుతోంది.

ఇలాంటి నేపథ్యం ఉన్న ఇస్రోకు మొన్నటి వరకూ కే. రాధాకృష్ణన్ చైర్మన్ గా ఉన్నారు. ఆరేళ్ల పాటు పదవీ కాలంలో ఉన్న రాధాకృష్ణన్ అత్యంత కీలకమైన పరిశోధనలకు ప్రాతిధ్యం వహించారు. చంద్రయాన్, మామ్ వంటి ప్రయోగాలు ఈయన పదవిలో ఉండగానే జరిగాయి. రాధాకృష్ణన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇస్రో ఏదైనాప్రధాన ప్రయోగం చేపట్టడానికి కొన్ని గంటల ముందు వెంకటేశ్వరుడిని దర్శించుకొంటారు. ఆ ప్రయోగం విజయవంతం అయ్యాకా మళ్లీ కలియుగ ప్రత్యక్ష దైవానికి మొక్కుచెల్లించుకొంటారు.

ఇస్రో చైర్మన్ గా ఉన్నంతకాలం రాధాకృష్ణన్ ఈ తీరునే కొనసాగించారు. శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన వ్యక్తి అయినా.. అంతరిక్ష పరిశోధనలు అంటే సృష్టి విషయంలో మానవుడు చేసే ప్రతి సవాళ్లే అయినా.. అవి విజయవంతంకావడానికి మాత్రం దేవుడి అనుగ్రహం అవసరమన్నట్టుగా సాగింది రాధాకృష్ణన్ ప్రస్థానం.

కేవలం రాధాకృష్ణన్ మాత్రమే కాదు.. అంతకు ముందు ఇస్రో చైర్మన్ గా ఉండిన మలయాళీ మాధవన్ నాయర్ కూడా ప్రయోగాల సమయంలో తిరుమలలో ప్రత్యక్షం అయ్యేవారు. వెంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకొచ్చేవారు. 

ఇలాంటి ప్రత్యేకత ఉంది ఇస్రో చైర్మన్ లకు. ఇలాంటి నేపథ్యంలో వారి స్థానంలోకి వస్తున్నారు శైలేష్ నాయక్. మరి ఈయన వెంకటేశ్వరుడి భక్తుడేనో.. లేక భిన్నంగా వ్యవహరిస్తారో!