cloudfront

Advertisement


Home > Articles - Kapilamuni

సీఎం చంద్రబాబు @ 23 ఏళ్లు!

సీఎం చంద్రబాబు @ 23 ఏళ్లు!

చంద్రబాబునాయుడు లోని ముఖ్యమంత్రి వయస్సు ఇవాళ్టికి 23 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 23 ఏళ్లు గడచిపోయాయి. మధ్యలో పదేళ్లు అధికారానికి దూరమై ఆయన ప్రతిపక్షంలో గడిపినప్పటికీ కూడా.. ఉమ్మడి తెలుగు రాష్ట్ర చరిత్రలో అతి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉండడం విశేషం. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి రికార్డు కూడా ఆయనదే.

అయితే సీఎంగా ఇంతటి సుదీర్ఘ అనుభవంలో చంద్రబాబు నేర్చుకున్న పాఠాలేమిటి? ఆయనను సీఎంగా చూసిన ఈ పదమూడేళ్ల వ్యవధిలో ప్రజలు నేర్చుకున్న పాఠాలేమిటి? అని చర్చించుకోవడం ఓసారి సహేతుకం అనిపిస్తుంది.

చంద్రబాబు నేర్చుకున్న పాఠాలు :
=) ప్రజలు రాజకీయవేత్తను కాదు.. ఒక చక్కటి సీఈవోను కోరుకుంటారు అని ఆయన అనుకున్నారు. 23 ఏళ్ల కిందట సీఎం అయినప్పుడు ఆయన పరిపాలన మొత్తం అదే తరహాలో సాగింది. తనకు తాను సీఈవో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పిలిపించుకోవడానికి సరదా పడ్డారు. కానీ ఆ అభిప్రాయం తప్పు అని ఆయన తర్వాత తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల ముసుగులో జనాకర్షక పథకాలు అవసరం అని అనుకున్నారు.

ఇంతాకలిపి 2004 ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలయ్యాక... ప్రజలకు అభివృద్ధి సంక్షేమం ఇవేమీ అక్కర్లేదు. వాళ్లకు ఇష్టం లేకపోతే ఓడించేస్తారు.. అంతే... అని చంద్రబాబు సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఎన్నికల్లో నెగ్గడానికి ఒక మ్యాజిక్ అవసరం అని ఆయన అనుకున్నారు. ఉచిత విద్యుత్ పేరుతో అలాంటి మ్యాజిక్ తోనే వైఎస్ సీఎం అయ్యారని ఆయన అనుకున్నారు. 2014లో రుణమాఫీ పేరుతో అలాంటి మ్యాజిక్ ప్రకటించి గద్దెఎక్కారు.

ప్రజలు నేర్చుకున్న పాఠాలు
=) తొలి సంఘటనను గమనిస్తే.. తెలుగు ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిని చేయలేదు. ఆయనే ‘ముఖ్యమంత్రి అయ్యారు’! ఈ రెండింటికీ మధ్య చాలా తేడా ఉంది. అయితే తర్వాత ఒక దఫా ఆయన ఆ పదవిని నిలబెట్టుకున్నారు. అంటే అచ్చంగా ప్రజలు నమ్మినట్టే లెక్క. కానీ, మొత్తంగా చూస్తే రాష్ట్రం సమతుల్య అభివృద్ధి అనేదానిని మరచిపోయింది. ఒక రకమైన వ్యామోహంతో చంద్రబాబు అభివృద్ధి అనదగిన ప్రతిపనినీ హైదరాబాదులోనే కేంద్రీకరించారు. దాని పర్యవసానంతో పాటు, మరికొన్ని కారణాలు జతకలిసి.. తెలంగాణ రాష్ట్రం చీలిపోయింది.

కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక.. చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. కారణాలు ఏవైనా అమరావతి, ఆంధ్ర జిల్లాల్లో ప్రగతిని కేంద్రీకరింపజేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం అనే బాధ్యతను తుంగలో తొక్కుతున్నారు. మ్యాజికల్ జనాకర్షక పథకాలే నిత్యం గెలిపిస్తాయని ఆయన ఇప్పటికీ అనుకుంటున్నారు. మ్యాజిక్ వరాలు ప్రకటించడం గొప్ప కాదు... మరి ఆ క్రమంలో వాటిని ప్రజలు నమ్మేలా విశ్వసనీయతను సంపాదించుకుంటున్నారా? లేదా? అనేది కీలకమైన విషయం.

తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఘట్టానికి 23 ఏళ్లు నిండిన ఈ సందర్భంలో.. చంద్రబాబు కొత్త ప్రతిజ్ఞలు తీసుకుంటే బాగుంటుంది. ఓటు బ్యాంకు, వ్యూహ రాజకీయాలు కాకుండా... నిజాయితీగా వ్యవస్థ బాగుకోసం కొన్నాళ్లయినా పనిచేయాలని చిత్తశుద్ధితో అనుకుంటే బాగుంటుంది. తెలుగు రాజకీయాల్లో నలభయ్యేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన ఎక్కిచూడని శిఖరాలు లేవు. ఇకనైనా కాస్త నిజాయితీ, చిత్తశుద్ధి, కల్మషం, కూహకం లేని పాలన ఆయన నుంచి ప్రజలకు అందుతుందా అని పలువురు ఎదురుచూస్తున్నారు.
-కపిలముని