Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: సత్యజిత్ రాయ్ - 'చారులత'

ఎమ్బీయస్: సత్యజిత్ రాయ్ - 'చారులత'

సత్యజిత్ రాయ్ శతజయంతి మేలో జరిగింది. ఆయన సినిమాల్లో కొన్నిటి గురించి రాద్దామని సంకల్పం. మొదటిగా రాస్తున్నది ‘‘చారులత’’ గురించి. సత్యజిత్ గురించి దేశంలోనూ, బయటా చాలామంది ఆకాశానికి ఎత్తివేయడంతో కొంతమంది అంత గొప్పవాడేమీ కాదు అంటూ తీసిపారేయాలని చూస్తారు. దరిద్రం గురించి చూపించి ఎవార్డులు కొట్టేశాడంతే అని ప్రముఖులే యీసడించారు. నా వ్యక్తిగత అభిప్రాయం అడిగితే, ఆయన నిశ్చయంగా గొప్పవాడు, చాలామందిని ఇన్‌స్పయిర్ చేయగలిగాడు. కానీ ఆయనే అందరి కంటె గొప్పవాడంటే ఒప్పుకోను. కొంత కమ్మర్షియల్ యాంగిల్ కూడా జోడించిన బిమల్ రాయ్ అంటే నాకు ఎక్కువ గౌరవం. తపన్ సిన్హా అంటే ఎక్కువ గౌరవం. పోనీ ఆర్టిస్టిక్ స్కూలు వరకూ మాత్రమే తీసుకుందామంటే ఋత్విక్ ఘటక్ ఎక్కువ యిష్టం. మృణాళ్ సేన్ సినిమాల్లో అతి తక్కువ నచ్చాయి. థీమ్స్ బాగున్నా, ఆయనకు సినిమా తీయడం సరిగ్గా రాదని నా అభిప్రాయం. అఫ్‌కోర్స్, యివన్నీ వ్యక్తిగతమైన యిష్టాయిష్టాలు. మీరు మరోలా భావించవచ్చు.

సత్యజిత్ సినిమాలు పెద్దగా చూడకుండానే ఆయన అన్నీ దరిద్రం చుట్టూనే తీసేసి, ఇండియా పరువు తీసి, తనకు మాత్రం పేరు తెచ్చేసుకున్నాడని ఆడిపోసుకోవడం అన్యాయం. ఆయన రకరకాల అంశాలతో 27 సినిమాలు తీశాడు. ఆయన సినిమాలలో కొన్నిటి గురించి చెప్పినపుడు వైవిధ్యం గురించి తెలుస్తుంది. ఈసారి తీసుకున్న సినిమా ‘‘చారులత’’ 1964 నాటిది. సత్యజిత్ వంటి పెర్‌ఫెక్షనిస్టుకి తన సినిమాల్లో కూడా తప్పులు కనబడతాయి. మళ్లీ తీసే అవకాశం వస్తే యింకా బాగా తీస్తానని అనేవాడు. ఈ సినిమా విషయంలో మాత్రం ‘మళ్లీ అలాగే తీస్తా’ అన్నాడు. దీనికి మూలం 1901లో రవీంద్రనాథ్ ఠాగూరు రాసిన ఒక నవల ‘‘నష్టనీడ్’’ (చెదిరిన గూడు). వదినా మరదుల మధ్య ఏర్పడిన మానసిక అనుబంధం (ప్లెటోనిక్ లవ్) గురించి చెప్పిన ఆ నవల రవీంద్రుడి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాసినదని ప్రతీతి.

టాగూర్ గురించి ‘రవీంద్రనాథ్’ పేర డాక్యుమెంటరీ తీయడానికి ఆయన దస్తావేజులన్నీ సత్యజిత్ తిరగవేశాడు. నష్టనీడ్ వ్రాతప్రతులు పరిశీలించినప్పుడు దాని మార్జిన్‌లో రాసుకున్న నోట్స్‌తో ఆయనకు యీ థీమ్ గురించి స్పష్టమైన అవగాహన ఏర్పడింది. దాంతో ఆ కథను తెరపై ఎలా వ్యక్తీకరించాలో బోధపడింది. అంతకు ముందు ఠాగూర్ రాసిన ‘‘తీన్ కన్యా’’ (1961) తీశాడు. దానికి మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు వచ్చింది కానీ సత్యజిత్‌కు తృప్తి నీయలేదు. అందువలన దీన్ని తీయడానికి సమకట్టాడు. సినిమా గురించి చెప్పుకునే ముందు, తన వదినగారు కాదంబరీ దేవితో రవీంద్ర నాథ్ ఠాగూర్ అనుబంధం గురించి, నవల గురించి తెలుసుకోవడం సమంజసం.

1868లో రవీంద్ర అన్నగారు జ్యోతిరీంద్రనాథ్ ఠాగూర్ తన 19 ఏళ్ల వయసులో 9 ఏళ్ల కుముదినీ దేవిని పెళ్లాడి, ఉమ్మడి కుటుంబంలో కోడలుగా యింటికి తెచ్చుకున్నాడు. అప్పుడు రవీంద్ర వయసు 7. జ్యోతిరీంద్రనాథ్ గంభీరమైన వ్యక్తి. నాటకాలు రాశాడు, చిత్రాలు గీశాడు. సంగీతకారుడు. పత్రికా సంపాదకుడు. తన కంటె పదేళ్లు పెద్దవాడు, యింటలెక్చువల్‌గా పై స్థాయిలో వున్న భర్తతో కంటె, రెండేళ్లు చిన్నవాడైన మరిదితో కుముదినికి చనువు వుండేది. ఇద్దరూ కలిసి ఆటలాడుకునేవారు. కలిసి పుస్తకాలు చదివేవారు, సంగీతం ఆలపించేవారు. కవిత్వం రాసేవారు. 14 ఏళ్ల వయసులో రవీంద్రకు మాతృవియోగం కలిగింది. పెద్ద ఉమ్మడి కుటుంబం కాబట్టి వంటమనుషులే రవీంద్రకు వండిపెట్టేవారు. అవి అతనికి రుచించేది కావు. కుముదిని అతనికి యిష్టమైన వంటకాలన్నీ స్వయంగా చేసి పెట్టేది. రవీంద్రకి చిన్నప్పటి నుంచి కవిత్వం, ఊహలు, రొమాంటిసిజమ్ పిచ్చి. కుముదిని కూడా సరదా మనిషి కాబట్టి రవీంద్ర అంటే మక్కువ పెంచుకుంది. అతని కవిత్వానికి మెరుగులు దిద్దేది.

అలా 15 ఏళ్లు కలిసి వున్నారు. వయసు వస్తున్న కొద్దీ వారిలో సహజమైన మార్పులు వచ్చి పరస్పరాకర్ణణ పెరిగింది. వారిద్దరి మధ్య బంధం ప్లేటోనిక్ స్థాయి నుంచి భౌతికమైన స్థాయికి వెళ్లిందా లేదా అనేది ఎవరికీ తెలియదు. కానీ రవీంద్ర మాత్రం ఆమెను తన కలలరాణిగా, ప్రేయసి (స్వీట్‌హార్ట్)గా భావించాడు. ఆమెను ఊహించుకునే ప్రణయకవిత్వం రాశాడు. ఆ విషయం ఆయన సి ఎఫ్ ఆండ్రూస్‌కి రాసిన ఉత్తరంలో స్పష్టమైంది. అయితే వాళ్లిద్దరి మధ్య బంధాన్ని సమాజం ఆమోదించదు కాబట్టి, యిద్దరూ తమను తాము నియంత్రించుకున్నారు. 1883లో రవీంద్రకు 22 ఏళ్ల వయసు వుండగా 9ఏళ్ల మృణాళినితో పెళ్లయింది. ఇది కుముదినికి అశనిపాతంలా తగిలింది. పెళ్లయిన నాలుగు నెలలకు ఆత్మహత్య చేసుకుంది. రవీంద్ర-కాదంబరి అనుబంధం, బెంగాలీలకు ఎప్పటికీ ఆసక్తికరమైన విషయమే. ఆ థీమ్ మీద 2015లో ‘‘కాదంబరి’’ అనే సినిమా వచ్చింది. దానిలో కాదంబరిగా బెంగాలీ నటి, దర్శకురాలు అపర్ణా సేన్ కూతురు కొంకణా సేన్ శర్మ వేసింది. యువకుడైన రవీంద్రుడిగా పరమవ్రత వేశాడు. 

1901లో తన 40 ఏళ్ల వయసులో రవీంద్ర ఆమెను పాత్రగా చేసి నష్టనీడ్ నవలను సీరియల్‌గా రాశాడు. తర్వాత పుస్తకంగా వచ్చింది. దాని ఆధారంగానే సత్యజిత్ సినిమా తీశాడు. అందుచేత ఆ నవల కథ చెప్పేస్తాను. 1879లో జరిగినట్లుగా రాసిన యీ కథలో నాయిక చారులత. ఆమెకు సాహిత్యం, సంగీతం చాలా యిష్టం. సౌందర్యారాధకురాలు. సున్నితహృదయురాలు. భర్త భూపతి జమీందారే కానీ స్వాతంత్ర్యపోరాటం సాగాలని కోరుకునేవాడు. కలకత్తాలో వుంటూ తన సంపాదకత్వంలో ఇంగ్లీషులో ఒక పత్రికను ప్రచురిస్తూ వుంటాడు. మితభాషి. గంభీరంగా వుంటాడు. ఎప్పుడూ పుస్తకాలు చదువుకుంటూ, రాజకీయాల్లో మునిగి తేలుతూంటాడు. వయసులో పెద్దవాడు. ఈమె పట్ల ఆదరంగానే వుంటాడు కానీ ఆమె యిష్టాయిష్టాలు, అభిరుచులు పట్టించుకోడు. ఒకే కారిడార్ యిద్దరూ ఎదురైనా అతను పుస్తకం చదువుకుంటూ వెళ్లిపోతాడు తప్ప, భార్య కేసి కన్నెత్తి చూడడు. ఆ పెద్ద భవంతిలో ఒక అలంకారంగానే ఆమె మిగిలిపోతుంది. చేయడానికి పనీ లేదు. తెగ బోరు కొట్టేస్తూ వుంటుంది.

తన వ్యాపకాల్లో తను బిజీగా వున్నాడు కాబట్టి భార్యకు తోడుగా వుంటారని భూపతి భార్య అన్నగారినీ, వదినగారినీ పల్లెటూరి నుంచి రప్పించి తన ఎస్టేటు నడిపే వ్యవహారాలు బావమరిదికి అప్పగించాడు, భార్య వద్దని వారించినా వినకుండా! చారులతకు, ఆమెకు తోడుగా వుందామని వచ్చిన ఆడపడుచుకి ఏ మాత్రం పడదు. ఈమెకున్న అభిరుచులు ఆమెకు లేవు. పల్లెటూరి గబ్బిలాయి. చుప్పనాతి బుద్ధి. చారులతకు లైఫంటే బోరు కొట్టే సమయంలో భూపతి కజిన్ అమల్ తుపానులా వచ్చిపడ్డాడు. అతను అప్పుడే కాలేజీ చదువు పూర్తి చేసి వచ్చాడు. గలగల మాట్లాడతాడు. చాలా హుషారుగా వుంటూ సందడి చేస్తూంటాడు. కవిత్వం రాస్తానంటాడు. జోకులు వేస్తాడు. వదినగార్ని ఆట పట్టిస్తాడు. ఇతని రాకతో అప్పటివరకు స్తబ్ధంగా వున్న చెరువులాటి చారులత జీవితం జలపాతంలా మారింది. ఇతనితో కలిసి కబుర్లు చెప్పింది. వదినా మరదుల మధ్య ఛలోక్తులు సహజమే కాబట్టి భూపతికి యిదేమీ ఎబ్బెట్టుగా అనిపించలేదు. వారిద్దరినీ ప్రోత్సహించాడు.

అమల్ కవిత్వం రాశాడు, చారులతను చూసి పాటలు పాడాడు. భర్త నిర్లిప్తతతో, సంతానహీనతతో విసుగెత్తిన చారులత తను అమల్‌ను ప్రేమించానని గుర్తించింది. ఆ గుర్తించిన ఆనందంలో ‘‘ఫూలే ఫూలే, డోలే డోలే..’’ పాట పాడింది. అనుకోకుండా అమల్ కూడా అదే ట్యూన్ హమ్ చేయడంతో అతను తన ప్రేమను అంగీకరించాడని చారులత భావించింది. భర్త కోసం ‘బి’ అనే అక్షరాన్ని ఎంబ్రాయిడర్ చేసిన చెప్పుల్ని అమల్‌కు బహూకరించింది. ఆ సంగతి గుర్తించగానే అమల్ భయపడ్డాడు. సరిగ్గా అదే సమయానికి చారులత అన్న, వదిన భూపతిని మోసం చేసి, ఆస్తంతా దోచేసి పారిపోయారు. భూపతి ఆ విషయం అమల్‌కు చెప్పుకుని, ఇక నీ మీదే ఆధారపడాలి, నువ్వొక్కడివే విశ్వాసపాత్రుడివి అన్నాడు.

తను యిక్కడే వుంటే, ఒక బలహీనక్షణంలో వదినతో తప్పుచేసి, మరో రకంగా అన్నగారికి ద్రోహం చేసినట్లవుతుందని అమల్ తల్లడిల్లాడు. అక్కణ్నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఇక్కడ ఉండలేను, క్షమించండి అంటూ అన్నగారి పేర ఉత్తరం రాసి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయాక అమల్‌ గదిలో భార్య బహుమతిగా యిచ్చిన చెప్పులు భూపతి కంటపడ్డాయి. ఆమె గదికి వెళితే ఆమె అమల్ కోసం అలవికాకుండా ఏడుస్తూండడం చూశాడు. భార్య తనకు మానసికంగా దూరమై పోయిందని గ్రహించాడు. తన తప్పు కూడా వుందని గ్రహించి, వేరే వూళ్లో పని కల్పించుకుని యింట్లోంచి వెళతానన్నాడు. నన్నూ వెంటపెట్టుకుని వెళ్లండి అంది చారులత. భూపతి జవాబు చెప్పకుండా సంకోచించాడు. ‘సరే, అలాగే కానీయండి’ అంది చారులత. ఇదీ నవల.

ఈ కథను సినిమాగా తీసినపుడు సత్యజిత్ చివర్లో భూపతి, దిక్కుతోచక తన బండిలో ఊరంతా తిరిగి యింటికి తిరిగి వచ్చినట్లు మార్చాడు. చారులత తలుపు తీసి, అతన్ని చూసి కాస్త సంకోచిస్తూనే యింట్లోకి రమ్మనమని పిలిచింది. అతను లోపలకి వచ్చాడు. ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు అందుకోబోతూండగా షాట్ ఫ్రీజ్ చేసి సినిమా ముగించాడు. ఒక రకంగా ఓపెన్-ఎండెడ్ (ముగింపు స్పష్టంగా చెప్పని) క్లయిమాక్స్‌గానే చెప్పవచ్చు.

దీనిలో అమల్ పాత్రను సత్యజిత్ ఆస్థాన నటుడు సౌమిత్ర చటర్జీ వేశాడు. పాత్రలో బ్రహ్మాండంగా యిమిడిపోయాడు. భూపతి పాత్ర వేసిన శైలేన్ ముఖర్జీ కూడా అద్భుతంగా నటించాడు. కానీ అసలు ఘనతంతా చారులత పాత్ర వేసిన మాధవీ(బీ) ముఖర్జీకి చెందుతుంది. నిజానికి ఆ పాత్రను సావిత్రీ చటర్జీకి యిద్దామనుకున్నారు. కానీ సత్యజిత్ ఆస్థాన ఫోటోగ్రాఫర్ సుబ్రత మిత్ర చారులత పాత్రకు మాధవీ అయితేనే నప్పుతుందని వాదించాడు. మాధవి అంతకు ముందే మృణాల్ సేన్, ఋత్విక్ ఘటక్ సినిమాలతో పాటు, సత్యజిత్ తీసిన ‘‘మహానగర్’’ (1963) సినిమాల్లో వేసింది. మాధవికి అప్పుడు 22 ఏళ్లు. పెద్ద జుట్టు, నల్లటి పెద్ద కళ్లు. కానీ తమలపాకులు తెగ నమిలే అలవాటు చేత పళ్లు గారపట్టాయి. సత్యజిత్ కింది పళ్లవరుస అంతా మార్పించుకోమన్నాడు. కానీ మాధవి తల్లి ఒప్పుకోలేదు. ఈ వయసులో అంత కష్టం భరించలేదంది. అప్పుడు ఫోటోగ్రాఫర్‌కు చెప్పి లో యాంగిల్స్ ఎక్కువగా తీసి, పలువరుస కనబడనీయకుండా చేయమన్నాడు. చారులత పాత్రకు మాధవి జీవం పోసిందంటే అతిశయోక్తి కాదు.

సినిమా ఓపెనింగ్‌లో చారులత జీవితం ఎంత బోరుగా వుందో చెప్పడానికి సత్యజిత్ ఏడున్నర నిమిషాల సీను పెట్టాడు. ఏం చేయాలో తోచక ఆమె బైనాక్యులర్స్ తీసుకుని ఒక్కో కిటికీలోంచి బయటకు చూస్తూ వుంటుంది. ఒక్కో చోట ఒక్కో దృశ్యం. ‘‘నేనే ఆ సీను తీయాలంటే ఆమె ఒంటరితనం సూచించడానికి నేపథ్యంలో మూడు నిమిషాల పాట పెట్టేసేవాణ్ని.’’ అన్నాడు మనోజ్ కుమార్. కానీ సత్యజిత్ ఒక్క డైలాగు లేకుండా అంత సేపు సీను నడిపించాడు. దానికి ఫోటోగ్రఫీ ఎంతో సహాయపడింది. నేపథ్యంలో భారతీయ వాద్యసంగీతం వినిపించాడు సత్యజిత్. అతను స్క్రీన్‌ప్లే, డైరక్షన్‌తో పాటు సంగీతం కూడా సమకూర్చాడు. ఈ సినిమాలో సత్యజిత్ చేసిన ప్రయోగం ఒకటుంది. రవీంద్రుడు స్వయంగా రాసిన ‘‘అమి చినిగో చినీ తొమారె, ఓగో బిదేశిని’’ పాటను యీ సినిమాకు వాడుకున్నారు. అమల్ పియానో వాయిస్తూ ఆ పాట పాడతాడు.

బెంగాల్‌లో రవీంద్రసంగీతం పాడడంతో నిష్ణాతులు, ప్రఖ్యాతులు చాలామంది వున్నారు. కానీ సత్యజిత్ ఆ ఛాన్సు హిందీరంగంలో విఖ్యాతుడు, బెంగాల్ సినీసీమ అంతగా పట్టించుకోని కిశోర్ కుమార్‌కు యిచ్చాడు. కిశోర్ మొదటి భార్య రుమా గుహాఠాకుర్తా సత్యజిత్‌కు బంధువు. మామూలు రవీంద్ర సంగీతగాయకులు గంభీరంగా పాడుతూంటారు కాబట్టి, అమల్ వంటి హుషారైన వాడికి ప్లేబ్యాక్ కిశోర్ పాడితే బాగుంటుందని సత్యజిత్ అనుకుని వుండవచ్చు. కిశోర్ మహదానందంతో పాడాడు. సినిమా విడుదలయ్యాక కొందరు అతన్ని విమర్శించారు కానీ పాట బాగుంటుంది.

వీటితో బాటు చెప్పుకోదగినది ఆర్ట్ డైరక్షన్. సత్యజిత్‌కు ఎప్పుడూ చేసే బన్సీ చంద్రగుప్తయే చేశాడు. అతనికి 80 బై 45 అడుగుల హాలు యిచ్చి, ఆ కాలం నాటి జమీందారీ బంగళా సెట్లు మూడు కట్టమన్నారు. అద్భుతంగా కట్టాడు. మీరు సినిమా చూస్తే, ఆర్ట్ డైరక్షన్, ఫోటోగ్రఫీ, సంగీతం తప్పకుండా ఆకట్టుకుంటాయి. అభినయం సంగతి సరేసరి. ఒక సున్నితమైన మానవ సంబంధాన్ని చిత్రీకరించిన యీ సినిమా సత్యజిత్ నిజజీవితాన్ని కూడా ప్రభావితం చేసింది. ఆయన మాధవీ ముఖర్జీతో ప్రేమలో పడ్డాడు, కొంతకాలం తర్వాత బయటపడ్డాడు కూడా! రవీంద్రనాథ్ ఠాగూర్, సత్యజిత్ వంటి యిద్దరు మహానుభావులను కలిపింది యీ సినిమా. అలాగే సత్యజిత్, ఉత్తమ్ కుమార్ వంటి మరో యిద్దరు మహానుభావులను కలిపిన ‘‘నాయక్’’ అనే సినిమా గురించి మరోసారి!

- ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా