Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మృచ్ఛకటికమ్‌- 9

మదనిక వచ్చి చారుదత్తుడు పంపగా ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు అని చెప్పింది. వసంతసేన లోపలకి రమ్మనమంది. అతను వచ్చాక కూర్చోమని మర్యాద చేసింది. అతను 'మీ నగలు రక్షించడం కష్టంగా వుంది కాబట్టి తిరిగి యిచ్చేస్తున్నానని చారుదత్తుడు చెప్పమన్నారు' అని చెప్పి నగల పాత్రను ఆమె చేతిలో పెట్టేసి వెళ్లిపోబోయాడు. వసంతసేన 'నా మాట కూడా వినండి. మదనికను భార్యగా స్వీకరించండి' అంది. అతను తెల్లబోయి 'మీరనేది నాకు అర్థం కావటం లేదు' అన్నాడు. 'నగలపాత్ర పట్టుకుని వచ్చే అతనికి మదనికను యిచ్చి పెళ్లి చేయమని చారుదత్తుడు నాకు చెప్పారు' అంది వసంతసేన. విషయమంతా యీమెకు తెలిసిపోయిందని గ్రహించిన శర్విలకుడు గుంభనగా 'బాగు, బాగు. ఆయన మహానుభావుడు.' అన్నాడు. 

వసంతసేన వెంటనే బండివాణ్ని రప్పించి మదనికను పిలిచి ''నువ్వు అతనితో వెళ్లి సుఖంగా కాపురం చేసుకో'' అంది. మదనిక కన్నీరు కారుస్తూ వసంతసేన కాళ్లపై పడింది. 'నువ్వు యిప్పుడు ఒక బ్రాహ్మణుడికి భార్యవయ్యావు. నేనే నీ కాళ్లపై పడాలి' అంటూ ఆమెను పైకి లేపింది. శర్విలకుడు తన భార్యను ఉద్దేశించి 'వేశ్యావాటికలో వున్న వాళ్లకు దుర్లభమైన 'ఇల్లాలు' అనే పదం నిన్ను వరిస్తోందంటే అదంతా ఆమె దయవల్లనే, అందువలన ఆమెకు నమస్కరించి తీరవలసినదే' అని చెప్పి, వసంతసేనకు కృతజ్ఞతలు చెప్పి భార్యతో సహా బండి ఎక్కడానికి వీధిలోకి వెళ్లాడు.

అంతలో ఒక చాటింపు వినవచ్చింది - 'రాజుగారు ఆర్యకుణ్ని బంధించి కారాగారంలో పెట్టారు. ఇటువంటి అసాధారణ స్థితిలో ఉజ్జయినీ వాసులందరూ ఎవరి యిళ్లల్లో వాళ్లు వుంటూ అప్రమత్తంగా వుండాలి' అని. అది వింటూనే శర్విలకుడు 'నా ఆప్తమిత్రుడు ఆర్యకుడు బంధింపడ్డాడా? ఎంత కష్టం వచ్చింది. మనిషికి భార్య, మిత్రుడు యిద్దరూ కావలసినవారే. ఇప్పుడు మిత్రుడు అపాయంలో చిక్కుకున్నాడు కాబట్టి కొత్త భార్య కంటె అతనికే నా అవసరం ఎక్కువగా వుంది' అనుకున్నాడు. మదనిక కూడా అలాగే చేయి, అయితే నన్ను మీ యింటికి పంపించి మరీ వెళ్లు అంది. శర్విలకుడు బండివాడితో 'గాయకుడు రేభిలుడి యిల్లు నీకు తెలుసు కదా, ఆయన నా తండ్రే. ఈమెను క్షేమంగా తీసుకెళ్లు' అని చెప్పి పంపించివేశాడు. 'ఆర్యకుణ్ని విడిపించాలంటే అందరినీ కూడగట్టుకోవాలి. ఇప్పటి రాజు అనేక మంది మహావీరులను వివిధ సందర్భాల్లో అవమానించాడు. వారంతా కోపంతో కుములుతున్నారు. వారిని రెచ్చగొట్టి ఆర్యకుణ్ని బంధించిన కారాగారంపై దాడి చేయిస్తాను' అనుకుని ఆ పని మీద బయలుదేరాడు.

***********

శర్విలకుడు వెళ్లిపోయిన కాస్సేపటికే వసంతసేన వద్దకు చారుదత్తుడి సహచరుడు మైత్రేయుడు వచ్చాడు. అతను యింట్లో ఒక్కో గడప దాటుకుంటూ, అక్కడి విశేషాలు, ఐశ్వర్యం చూసి ఆశ్చర్యపడుతూ చివరకు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె యితన్ని కూర్చోబెట్టి 'చారుదత్తుడు కుశలమా?' అని అడిగింది. ''కుశలమే. ఆయన నీతో యిలా చెప్పమన్నాడు - 'మీరు యిచ్చిన నగల పాత్ర జూదంలో ఓడిపోయాను. దానికి బదులుగా యీ రత్నహారం పంపుతున్నాను. నిజానికి యీ రత్నహారం ఆ జూదంలో నాపై గెలిచినవాడికే యిచ్చి నగలను వెనక్కి తీసుకోవచ్చు. కానీ అతను రాజుగారి గూఢచారి దళంలో పనిచేస్తాడు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అందువలన నగలకు బదులుగా యీ రత్నహారం తీసుకుని ఋణముక్తుణ్ని చేయవలసినది.' చారుదత్తుడు జూదరి అనే విషయం మీకు తెలుసనుకుంటా'' అన్నాడు మైత్రేయుడు. చారుదత్తుడు, వసంతసేన ఒకరంటే మరొకరు విముఖులు కావాలని అతని ఆకాంక్ష. 

దొంగలు ఎత్తుకు పోయినదాన్ని కూడా తప్పు తనపై వేసుకుని జూదంలో పోయిందని చెప్తున్న చారుదత్తుడు ఎంత గొప్పవాడు, పైగా డబ్బు లేకపోయినా ఎక్కణ్నుంచో రత్నహారం సంపాదించి పంపుతున్నాడు, పూతరాలిన మామిడిచెట్టు పూదేనె చుక్కలు రాలుస్తున్నట్లు వుంది అని వసంతసేన ఆశ్చర్యపడింది. నగలపాత్రను యితనికి చూపిద్దామా వద్దా అని ఆలోచించి వద్దులే అనుకుంది. 'ఇదిగో జూదరి చారుదత్తుడితో చెప్పండి - యివాళ సాయంత్రం ఆయన్ని చూడడానికి వస్తానని' అంది. 'ఇంకా ఏముంది తల్లీ మా చారుదత్తుడి వద్ద దోచుకోవడానికి' అనుకుంటూ మైత్రేయుడు బయలుదేరాడు. 

దారి పొడుగునా అతను ఆమె లోభత్వాన్ని తలచుకుని ఆశ్చర్యపడుతున్నాడు. అంత సంపద వుంది కదా, చారుదత్తుడంటే యిష్టం వుంటే 'నగల పాత్ర పోతే పోయింది, యీ రత్నహారం దేనికి' అంటుందేమోనని అతను ఆశపడ్డాడు. చారుదత్తుడి మనిషిని కాబట్టి తనను కూర్చోబెట్టి చక్కటి పానీయం యిస్తుందేమో, అతిథి మర్యాదలు చేస్తుందేమో అనుకున్నాడు. అలాటిదేమీ లేకుండా రత్నహారం తీసేసుకున్న వసంతసేనను తలచుకుని మండిపడ్డాడు. 

ఇంటికి రాగానే చారుదత్తుడు 'ఆమె రత్నహారం తీసుకుందా?' అని ఆతృతగా అడిగాడు. 'ఆ యించక్కా తీసుకుంది. ఆ నగల మూట మనదగ్గర దాచమని మనం అడగలేదు. తనంతట తానే పెట్టింది. మనం తిన్నది కాదు, పెట్టినది కాదు, వాటి కోసం మనం అంతకంటె విలువైన రత్నహారం పోగొట్టుకోవలసి వచ్చింది. ఇదేమీ బాగా లేదు' అన్నాడు మైత్రేయుడు నిస్పృహతో. 'నగల విలువ ఎంత అనేది ప్రశ్న కాదు, ఆమె మనను నమ్మి మన దగ్గర వుంచింది. ఆ నమ్మకానికే మనం మూల్యం చెల్లించాం.' అన్నాడు చారుదత్తుడు. 'నీకెలా వుందో కానీ నాకు మాత్రం ఆమె దగ్గరకు వెళ్లడం తలకొట్టేసినట్లయింది. నీ కాళ్లమీద పడతాను, యీ వేశ్యాసంపర్కం వదిలించుకో. వాళ్ల దగ్గరకు వెళ్లి బాగుపడినవాడు లేడు' అన్నాడు మైత్రేయుడు.

'నువ్వు యింతగా చెప్పాలా? నా దరిద్రమే నన్ను వేశ్యల దగ్గరకు పోకుండా రక్షిస్తోంది. నా వంటి దరిద్రుణ్ని వసంతసేన ఎలాగూ దూరం పెట్టేస్తుంది. పైగా నేను జూదరిని అని కూడా చెప్పుకున్నాను కదా. ఇక నువ్వు దాని గురించి చింతించకు' అని చారుదత్తుడు తన స్నేహితుణ్ని వూరడించాడు కానీ మనసులో 'వసంతసేన ధనానికి లొంగదు, గుణానికే లొంగుతుంది, అందుకే నాకు నచ్చుతుంది.' అనుకున్నాడు. 

అది మైత్రేయుడు గమనించాడు. ఆకాశంకేసి చూసి నిట్టూరుస్తున్నాడంటే వసంతసేన గురించి ఆలోచిస్తున్నాడన్నమాట. కామం బలీయమైనది కదా అనుకుని పైకి 'అన్నట్టు మిత్రమా, వసంతసేన సాయంత్రం యిక్కడకు వస్తానని చెప్పమంది. మనం యిచ్చిన రత్నహారంతో తృప్తి పడలేదనుకుంటాను. ఇంకా ఏమి అడుగుతుందో ఏమో' అన్నాడు. 'సరేరానీ, ఏమడిగినా యిచ్చి సంతృప్తి పరుస్తాను' అన్నాడు చారుదత్తుడు ధైర్యంగా. (సశేషం)

మృచ్ఛకటికమ్‌ పాత్రల పరిచయం

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు  2015)

[email protected]

Click Here For Arcchives

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా