తెలంగాణలో రెడ్డి ఓటుబ్యాంకు వుందని, వాళ్లు వెలమదొరల పాలన కూల్చడానికి తహతహ లాడుతున్నారని చాలాకాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. అందుకే లంచం యిస్తూ వీడియోలో దొరికిపోయి టిడిపి నుంచి ఫిరాయించిన రేవంత్ రెడ్డికైనా సరే కాంగ్రెసు పగ్గాలు యివ్వాలనే డిమాండ్ వచ్చింది. ఆ రెడ్డి ఓటు బ్యాంకు ఏ బిజెపికో వెళ్లిపోకుండా కెసియారే, జగన్‌తో లాలూచీ పడి షర్మిలను యిక్కడ దింపారని ఓ టాక్. షర్మిలను రెడ్డి కులస్తులు ఓన్ చేసుకుంటారా? ఆమె క్రైస్తవ రెడ్డికి (ఇదే ఒక అభాసం. క్రైస్తవంలో కులం ఎక్కడుంది? జగన్‌ను రెడ్డిగా కొందరు పరిగణిస్తున్నారు కాబట్టి యీమెను అలాగే అనుకోవాలి) కూతురు. హిందూ ‘రెడ్డి’ ఐన మేనమామ కిచ్చి పెళ్లి చేస్తే విడాకులు తీసుకుని (రాజకీయాల్లోకి వస్తే యిలాటి వ్యక్తిగతమైనవన్నీ చర్చకు వస్తాయి), ఒక బ్రాహ్మణ్ని చేసుకున్నది. మరి ఈమెను రెడ్డిగా చూస్తారా?
జగన్ యిలాటివన్నీ అధిగమించి, ఆంధ్రులకు ఆమోదయోగ్యుడయ్యాడు. దానికి గాను, హిందూ దేవాలయాలకు వెళుతున్నాడు, తిరునామాలు పెట్టుకుంటున్నాడు, పుష్కరస్నానాలు చేస్తున్నాడు, స్వామీజీలకు మొక్కుతున్నాడు. షర్మిల యివన్నీ యిప్పటిదాకా చేసినట్లు లేదు, ఇకపై చేస్తారేమో! ఎన్ని చేసినా జగన్ ఎన్నుకున్న కార్యక్షేత్రం ఆంధ్ర. షర్మిల ఎన్నుకున్నది తెలంగాణా. అక్కడే చాలా తేడా వచ్చింది. 2014లో జగన్ నెగ్గడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ప్రజలేమనుకున్నారు? పాలనానుభవం లేని జగన్ కంటె చంద్రబాబైతే మేలు అనుకున్నారు. అందుకని ఓడిపోయాడు.
వారసత్వం చాలా? అనుభవం అక్కరలేదా? – ఇప్పుడు షర్మిలకు కూడా అదే పాయింటు ఎదురవుతుంది. ఈమెకూ పాలనానుభవం లేదు. జగన్ ఎంపీగానైనా చేశాడు, యీవిడ అదీ లేదు. ఎమ్మెల్యేగా శాసనసభను చూడలేదు. కనీసం ఒక పట్టణానికి మేయరుగా కూడా లేదు. మరి తెలంగాణను పాలించగలదా? అనే అనుమానం జనాలకు రాదా? వైయస్ కూతురైనంత మాత్రాన ఆ సామర్థ్యం దిగుమతి అయిపోతుందా? ఆయన పార్టీలో అనేక పదవులు చేశాడు, ఉద్యమాలు నడిపాడు, ఎంపీగా వున్నాడు, రాష్ట్రమంత్రిగా వున్నాడు, అయినా ముఖ్యమంత్రి కావడానికి 25 ఏళ్లు పట్టింది. 47 ఏళ్ల షర్మిల అంతకాలం వేచి వుండగలరా?
2014-2019 మధ్య జగన్ చాలా పోరాటమే చేశాడు. ఏం చేసినా ఉన్నదున్నట్లు చెప్పాలంటే బాబు అధ్వాన్నపాలన వలననే జగన్ నెగ్గాడు. జగన్‌ను యీ రోజు ముఖ్యమంత్రి చేసినది చంద్రబాబే! లేకపోతే రాయలసీమలో ఉన్న నంద్యాల ఉపయెన్నికలో తన వైపు కాకలు తీరిన కాండిడేటు వున్నా గెలవలేని వైసిపి 20 నెలల తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికలలో 86శాతం సీట్లు గెలుచుకోవడమేమిటి? పాదయాత్ర చేస్తే మాత్రం, ఒక్క ఛాన్స్.. అని జూనియర్ ఆర్టిస్టు అడిగినట్లు అడిగినంత మాత్రాన ఛాన్సు యిచ్చేస్తారా? మాజీ ప్రధాని చంద్రశేఖర్ 1983లో కన్యాకుమారి నుంచి దిల్లీ వరకు పాదయాత్ర చేశారు. మంత్రాలకు చింతకాయలు రాలనట్లే, ఓట్లు రాలలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుండిపోయింది. పాదయాత్రలో జగన్ దగ్గరకు ప్రజలు వచ్చి మొరపెట్టుకున్నారంటే ఎందుకు పెట్టుకున్నారు? దేని గురించి ఫిర్యాదు చేశారు? బాబు పాలన గురించే కదా!
జగన్‌కు ఎఱ్ఱతివాచీ పరిచినది బాబే – పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే పని కేంద్రానికే వదిలేసి, అమరావతిని చిన్నగా, సైబరాబాదులాగానే ప్లాన్ చేసి వుంటే బాబు చేతిలో చాలా టైమే మిగిలేది. ప్రజల అసంతృప్తిని పార్టీ నాయకుల ద్వారా తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టి వుండేవారు. జన్మభూమి కమిటీల అరాచకాన్ని అరికట్టి వుండేవారు. ఎంతసేపూ అమరావతి ఆర్భాటాలు, మట్టీ, నీళ్లు తెండి, కలపండి, పసుపుబొట్లు పెట్టండి అంటూ ప్రజలకు పూజావిధానాలు నేర్పడాలు, అంత చేస్తా, యింత చేస్తా, యిప్పటికే చాలా చేసేశా.. లాటి కబుర్లు చెపుతూ కాలక్షేపం చేస్తూ తను మేనేజ్ చేసిన మీడియా చెప్పిన కబుర్ల మాయలో తనే పడి వేరే లోకంలో జీవించారు బాబు. జగన్‌ను తిట్టాలనే యావలో తను పుట్టి పెరిగిన రాయలసీమను కూడా మాటిమాటికీ యీసడించారు. రాయలసీమ సంస్కృతిని హింసా ప్రవృత్తిగా చిత్రీకరించి వాళ్ల ఆగ్రహానికి గురయ్యారు.
వైసిపి పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను తన పార్టీలోకి గుంజుకుని, తక్కిన వాళ్లను శాసనసభలో వెక్కిరించి, వేధించి, అసెంబ్లీ నుంచి తరిమేసి విజయం సాధించామనుకున్నారు. ఎంత అక్రమం చేసినా టిడిపి సభ్యుడైతే ఫర్వాలేదనే వాతావరణాన్ని సృష్టించారు. ప్రజల కంటె ఎక్కువగా జగన్ గురించి ఆలోచించి, బాబు తప్పులు చేశారు. ప్రత్యేక హోదాపై, ప్యాకేజిపై మాటిమాటికి మాట మార్చి విశ్వసనీయత పోగొట్టుకున్నారు. వాస్తవాలను చూడడానికి నిరాకరిస్తూ, తనను తాను చాలా ఎక్కువగా జాతీయస్థాయి నాయకుడిగా వూహించుకుంటూ, యితర రాష్ట్రాల రాజకీయాలలో జోక్యం చేసుకుంటూ, మోదీతో తీవ్రంగా ఘర్షించారు. నిర్జీవమై పోయిన కాంగ్రెసుతో చేతులు కలిపారు. ఇలా ఎన్నో ఎన్నో పొరపాట్లు చేసి జగన్ సింహాసనం ఎక్కడానికి రాచబాట వేశారు బాబు.
బాబు చేసిన తప్పులు కెసియార్ చేస్తున్నారా? – షర్మిల విషయంలో కెసియార్ యింత ఉపకారం చేస్తారా? కెసియార్ పాలనలో చాలా అవకతవకలున్నాయి. అహంకారపూరితమైన చేష్టలున్నాయి. అసమర్థత వుంది. అంతా కెసియార్ యిష్టారాజ్యంగా నడుస్తోంది. బలమైన ప్రతిపక్షం ఏర్పడి, కెసియార్‌ను నిలవరించే అవసరం ఎంతైనా వుంది. ప్రతిపక్షంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి, సాధారణ కార్యకర్త దాకా అందరూ చచ్చుబడి వున్నారు. పార్టీ పదవులు పంచుతారట అని వార్త వచ్చినపుడే వారిలో కోలాహలం కనబడుతుంది. లేకపోతే కాడి పారేసి కూర్చున్నారు. కెసియార్‌పై కోపంతో జనాలు వాళ్లకు ఓటేసినా, నెగ్గగానే తెరాసలోకి దుమికేస్తున్నారు. అందుకని ప్రజలు కాంగ్రెసును నమ్మడం మానేశారు. కెసియార్‌కు గట్టి పోటీ యిచ్చేది బిజెపి ఒక్కటే. కానీ దానికి పరిమితులున్నాయి. తెలంగాణ ప్రజలు దాని విధానాలను ఆమోదించేందుకు చాలా టైమే పట్టవచ్చు. ఇక కమ్యూనిస్టులు నామమాత్రంగా కూడా లేరు. వారి గురించి చర్చిండమే వేస్టు.
పరిస్థితి యిలా వుంది కాబట్టి షర్మిల పార్టీకి తెలంగాణలో చోటు వుంది అని తార్కికంగా మాట్లాడవచ్చు. కానీ కెసియార్, బాబుకి చాలా వ్యత్యాసం వుంది. తెలంగాణలో ఎన్ని పొరపాట్లు జరుగుతున్నా హైదరాబాదు వంటి యింజను వుంది కాబట్టి మిగులు రాష్ట్రంగా వుంది. తరతరాలుగా సమకూరిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వుంది. ఉద్యోగావకాశాలకు లోటు లేదు. అందువలన ప్రజల్లో అశాంతి తక్కువ. బాబు అమరావతిని రియల్ ఎస్టేటు వెంచర్‌గా మార్చి దాని మీదే కాన్సట్రేట్ చేశారు కానీ చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేకం కట్టించారు, చెఱువుల పూడిక తీయించారు, సాగునీటి వ్యవస్థను చాలా మెరుగు పరిచారు. ఈ కాంట్రాక్టుల్లో కిక్‌బాక్స్ వచ్చే వుండవచ్చు. కానీ ప్రజలకు మేలైతే జరిగింది. తెలంగాణలో వ్యవసాయం చాలా బాగుపడింది. దిగుబడి పెరిగింది. అమరావతి విషయంలో అదంతా బాబు వర్గీయులకు, ధనికులకు, పెట్టుబడిదారులకు లాభం చేయడానికే అనే మాట వచ్చేసింది. ఇక్కడ సామాన్యుడు బాగుపడ్డాడు. కాంట్రాక్టర్లందరూ కెసియార్ వర్గీయులే అనే మాట రాలేదు. (సశేషం)
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2021)