అప్పుడే ముద్ర వేసేశారు

వైఎస్ షర్మిల పార్టీ తెలంగాణలో ఇంకా పురుడు పోసుకోనేలేదు. కానీ తెలంగాణా మంత్రులు అప్పుడే అది పుట్టినట్లుగా భావించి దానికో పేరు పెట్టేశారు. షర్మిల పార్టీకి టీఆర్ఎస్ మంత్రులు పేరు పెట్టడమేమిటి ? అంటే…

వైఎస్ షర్మిల పార్టీ తెలంగాణలో ఇంకా పురుడు పోసుకోనేలేదు. కానీ తెలంగాణా మంత్రులు అప్పుడే అది పుట్టినట్లుగా భావించి దానికో పేరు పెట్టేశారు. షర్మిల పార్టీకి టీఆర్ఎస్ మంత్రులు పేరు పెట్టడమేమిటి ? అంటే ఈ పార్టీ వెనుక టీఆర్ఎస్ ఉందా ? మరీ అంత డీప్ గా ఆలోచించవద్దు.

వారు షర్మిల పార్టీకి పేరు పెట్టింది ఆగ్రహంతో. షర్మిల పార్టీ పెట్టుకున్నా మాకేమీ భయం లేదని చెబుతూనే దానికి ఆంధ్రా పార్టీ అని పేరు పెట్టారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు అండ్ శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ రాష్ట్రాన్ని చక్కగా పరిపాలిస్తుంటే ఇక్కడ కొత్తగా మరో పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

షర్మిల పార్టీ పెట్టినా ప్రజలు దాన్ని ఆదరించరని,  ఆంధ్రా పార్టీని తెలంగాణా ప్రజలు తరిమి కొడతారని అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని, ఇప్పటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఉదాహరణగా చూపించారు. అవన్నీ ఆంధ్రా పార్టీలు కాబట్టి జనం తరిమి కొట్టారని అన్నారు. మొత్తం మీద షర్మిల పార్టీ ఇంకా పుట్టకముందే దానికి ఆంధ్రా పార్టీ అని పేరు పెట్టి ప్రజల్లో తెలంగాణా సెంటిమెంటును రాజేసే ప్రయత్నం చేశారు.

ఇక మరో మంత్రి ఈటల రాజేందర్ మరో అడుగు ముందుకేసి ఇది మత ప్రాతిపదికన ఏర్పడబోతున్న పార్టీ అని నిర్ధారించారు. షర్మిల మతం ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా. షర్మిల పార్టీ రూపకల్పనలో ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు విబడుతోంది కాబట్టి ఒక మత వర్గం టీఆరెస్ కు దూరం అవుతుందనే భయంతో ఈటల రాజేందర్ ఇది మత ప్రాతిపదికన ఏర్పడుతున్న పార్టీ అని కామెంట్ చేసి ఉంటాడు.

ఒకవేళ షర్మిల పార్టీ పెట్టాక అది విజయవంతమైతే సహజంగానే ఆమె మతం వారు ఆ పార్టీ వైపు ఆకర్షితులు కావచ్చు. అందుకోసం ఇప్పటినుంచి హైరానా పడటం అనవసరం. పార్టీ పెట్టడం దాన్ని సుదీర్ఘకాలం నడపడం అంత సులభం కాదని ఈమధ్య టీఆర్ఎస్ మీటింగ్ లో కేసీఆర్ అన్నారు. దానికి రెండు రకాలుగా భాష్యం చెప్పారు కొందరు. ఆయన షర్మిలను ఉద్దేశించే అన్నాడని కొందరంటే, మంత్రి ఈటలపై ఆయనకు అనుమానం ఉందని, అందుకే అలా అన్నాడని కొందరున్నారు.

అందుకు తగ్గట్లే కొందరు టీఆర్ఎస్ నాయకులు ఈటలపై మండిపడుతూ కామెంట్స్ చేశారు. ఆమె ఖమ్మం వెళ్లాలని నిర్ణయించున్న తరువాతనే ఆంధ్రా పార్టీ అనే కామెంట్స్ చేశారు. ఖమ్మంలో మొదటినుంచి గులాబీ పార్టీకి బలం లేదు. 2014  ఎన్నికల్లో రాష్రమంతా టీఆర్ఎస్ గాలి వీచినా ఖమ్మం జిల్లాలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంటు స్థానంతోపాటు మూడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. సరే … ఆ తరువాత వారంతా టీఆర్ఎస్ లో చేరారనుకోండి.

2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా ఎన్నికైన పొంగేలేటి శ్రీనివాస రెడ్డి టీఆర్ఎస్ లో చేరాక కేసీఆర్ ఆయనకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని ఆయన ఫీలవుతున్నాడు. షర్మిల పార్టీ పెడితే ఆయన అందులో చేరతాడనే అనుమానం టీఆర్ఎస్ నాయకుల్లో ఉంది. భవిష్యత్తులో గులాబీ పార్టీకి  ఆ జిల్లాలో గండి పడుతుందేమోనని అనుకుంటున్నారు.

తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కేసీఆర్ దాన్ని విజయవంతంగా అణగదొక్కారు. అలాగే టీడీపీ ఊసు లేకుండా చేశారు. మరి షర్మిల పార్టీ కేసీఆర్ ధాటికి తట్టుకొని నిలబడుతుందా ? ఎన్టీఆర్  సెంటిమెంట్ పనిచేయలేదు. వైఎస్సార్ సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.

చంద్రబాబు అంకెల గారడీ చేస్తున్నారు

ఆ విధంగా చంద్రబాబు ధీరుడు