cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రక్షకుడో? తక్షకుడో? - 2/2

ఎమ్బీయస్‌: రక్షకుడో? తక్షకుడో? - 2/2

ఆఫర్‌ యిచ్చారా? - అందుకేలాగుంది, రెండు నెలలగా ఒక పుకారు ప్రచారంలోకి వచ్చింది. 20 అసెంబ్లీ సీట్లు, 2 లేదా 3 పార్లమెంటు సీట్లు, 800 కోట్లు ఎవరిస్తే వాళ్లకే తన మద్దతు అని పవన్‌ రెండు పార్టీలకూ ఆఫర్‌ యిచ్చారని! నిజానికి యిలాటి గొడవేమీ లేకుండా ఆయన ఎంచక్కా ఎడిఎంకె తరహాలో బిజెపితో పొత్తు పెట్టుకుని ఉంటే అన్నీ వాళ్లే చూసుకుని ఉండేవారు. కానీ హోదా విషయంలో ఆంధ్రప్రజలు బిజెపిపై కోపంగా ఉన్నారనీ, గతంలో కాంగ్రెసును శిక్షించిన రీతిలో యీసారి బిజెపిని శిక్షిస్తారని భయపడినట్లున్నారు. పైగా ఆంధ్ర, తెలంగాణ విషయంలో బిజెపి పెద్దగా శ్రద్ధపెట్టటం లేదు. ఉత్తరభారతంలో పట్టు జారుతోంది కాబట్టి అక్కడే సేనలను మోహరిస్తున్నారు. ఇంతకీ యీ ఆఫర్‌కు జగన్‌ నో అన్నారని వార్త. 'ఈ డబ్బు యిచ్చుకోవడమే కాక, ఆయన అభ్యర్థులను గెలిపించే బాధ్యత కూడా మన మీదనే పెడతాడు, ఎందుకొచ్చిన గొడవ' అన్నాడని పుకారు. జగన్‌, పవన్‌ మధ్య ఉన్న ఘర్షణవాతావరణం, ఒకరి నొకరు విమర్శించుకున్న తీరు చూసినవారికి యీ పాటి చర్చ కూడా జరిగివుండ దనిపిస్తుంది.

బాబుకి మాత్రం యీ ఆఫర్‌ నచ్చిందని, అప్పణ్నుంచే జనసేనను ఏమీ అనకూడదని తన పార్టీ నాయకులను ఆదేశించారనీ అంటున్నారు. తెలంగాణలో డబ్బు ఎఱ చూపించే కాంగ్రెసును పొత్తుకు ఒప్పించారనేది అందరూ చెప్తున్న మాట. లేకపోతే కాంగ్రెసుకు నిధులెక్కడివి? బాబు-పవర్‌ డబ్బు ఒప్పందం సంగతులు బయటకు రావు కాబట్టి, నిర్ధారణగా చెప్పలేం కానీ జనసేనను టిడిపి విమర్శించటం లేదు. పవన్‌ కూడా ఫలానా స్థానంలో ఫలానా కులం వారికి టిక్కెట్టివ్వలేదు అని జగన్‌ను ఎత్తిచూపించారు కానీ బాబును ఎత్తిచూపలేదు. ఈనాడు కిచ్చిన యింటర్వ్యూలో 'అనుభవం ఉందని బాబుకి మద్దతిస్తే అది టిడిపి నాయకుల దోపిడీకి, ఇసుక మాఫియాకు ఉపయోగపడింది' అని ఊరుకున్నారు. ఇది అచ్చు ఆంధ్రజ్యోతి భాష! టిడిపి ఎమ్మెల్యేలు అవినీతిపరులే కానీ వారిని అనుమతిస్తున్న బాబు మాత్రం నిజాయితీపరుడు! తన అనుచరుల దోపిడీని, మాఫియా కార్యకలాపాలను బాబు ఎందుకు అడ్డుకోలేదో పవన్‌ ఎందుకు అడగరు? వైసిపి వస్తే వైజాగ్‌లో చెట్టూ, పుట్టా దోచుకుంటారని భయపెడుతున్న పవన్‌ యిసుక ఎత్తుకుపోయినా పట్టించుకోరా?

బాబు లెక్కలు బాబువి...- ఈ పొత్తు ఆఫర్‌ని ఎలా తీసుకోవాలనేది బాబు యిష్టమే కాబట్టి ఆయన కాలిక్యులేషన్స్‌ ఆయన వేసుకుని ఉంటారు. ఒకటి బాహాటంగా పొత్తు, రెండోది లోపాయికారీ పొత్తు. మొదటిదానిలో 2014 నాటి సమీకరణమే యిప్పుడు అక్కరకు వస్తుందన్న నమ్మకం లేదు. అప్పుడు తోడుగా ఉన్న బిజెపి యిప్పుడు లేదు. పవన్‌ను చూసి కాపులందరూ టిడిపికి వేశారనుకుంటే, యిప్పుడూ అలా వేస్తారా అన్నది సందేహమే. ఎందుకంటే 2014-2019 మధ్య తమకు ఒరిగిందేమీ లేదని, రాష్ట్రంలో కమ్మ డామినేషన్‌ ఎక్కువై పోతోందని భగ్గుమనే వర్గాల్లో కాపులు ముందువరుసలో ఉన్నారు. పైగా కాపు కార్పోరేషన్‌ అని యిస్తానన్న నిధులివ్వక, రిజర్వేషన్‌ అని నడిపిన ఉత్తుత్తి భాగోతాలు వాళ్లకు నచ్చలేదు. కాపులను బిసిల్లో చేరుస్తామంటూ బిసిలతో వైరం తెచ్చిపెట్టి, అంతలోనే వాళ్లు అగ్రవర్ణాలంటూ వాళ్ల రిజర్వేషన్‌లో సగం యిచ్చేసి, తక్కిన అగ్రవర్ణాలతో వైరం తెచ్చిపెట్టిన బాబు అంటే కాపులకు ఎందుకు నచ్చుతుంది? ఇలాటి మనస్థితిలో ఉన్న కాపులు టిడిపి-జనసేన పొత్తును హర్షించక, కమ్మ ప్రాబల్యాన్ని అరికట్టడానికంటూ వైసిపి వైపు మళ్లితే మొదటికి మోసం వస్తుంది.

అందువలన బాహాటంగా పొత్తు పెట్టుకోవడం ప్రయోజనకరం కాదు. పైగా ప్రతిపక్ష పార్టీగా ఉంటే ప్రభుత్వవ్యతిరేక ఓట్లను చీల్చడానికి జనసేన పనికి వస్తుంది. ఆ చీలిక కారణంగా అంతిమంగా అధికార పార్టీ లాభపడుతుంది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే జనసేన నాయకులకు మంత్రి పదవులు, కార్పోరేషన్‌ చైర్మన్‌గిరీలు వంటివి యిచ్చి సంతృప్తి పరచవచ్చు. అలా క్రమంగా నిలదొక్కుకుని, రాబోయే ఐదేళ్లలో బలమైన పార్టీగా ఎదగవచ్చని జనసేనను ఒప్పించవచ్చు. 2009 ఎన్నికలప్పుడు ప్రజారాజ్యం రంగంలోకి వచ్చినపుడు వైయస్‌ యిలాటి లెక్కలే వేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది కదాని చిరంజీవిని చాటుగా ప్రోత్సహించారంటారు. అదే సమయంలో టిడిపి కూటమి మరో లెక్క వేసింది. తమకున్న కమ్మ, బిసిల మద్దతు చెక్కు చెదరదని, అప్పటివరకు రెడ్లకు మద్దతుగా నిలిచిన కాపులు చిరంజీవిని చూసి ప్రజారాజ్యానికి ఓట్లేసి, కాంగ్రెసు ఓటమికి కారకులవుతారని అనుకుంది. చివరకు చూస్తే చిరంజీవి రెండు పార్టీల నుండి కాస్తకాస్త ఓట్లు కొల్లగొట్టినట్లు రుజువైంది. ఎన్నికల తర్వాత కాంగ్రెసు, టిడిపి రెండూ ప్రజారాజ్యాన్ని తిట్టుకున్నాయి.

పవన్‌ మరో కుమారస్వామి అవుతారనే ఆశ కాపుల కుందా? - ప్రజారాజ్యానికి అనేక వర్గాల నుంచి మద్దతు లభించినా, చిరంజీవిని చూసి తొలి కాపు ముఖ్యమంత్రి అవుతారని ముచ్చటపడి కాపులు యితరుల కంటె ఎక్కువ శాతంలో మద్దతిచ్చారని పరిశీలకులు అన్నారు. అసెంబ్లీ వరకు ప్రజారాజ్యానికి వేసి, పార్లమెంటు విషయంలో తమ కాండిడేటు ప్రధాని అయ్యే ఛాన్సు లేదు కాబట్టి మన్‌మోహన్‌ వేశారని, అందుకే కాంగ్రెసుకు అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంటుకు ఎక్కువ సీట్లు వచ్చాయని వాదన ఉంది. ఆ లాజిక్‌ యిప్పుడు పనిచేస్తే, కుమారస్వామి తరహాలో పవన్‌ ముఖ్యమంత్రి అవుతాడు అనే ప్రచారాన్ని నమ్మితే, అసెంబ్లీ వరకు జనసేనకు కాపుల ఓట్లు పడవచ్చు అనాలి. అయితే చూస్తూచూస్తూ బాబు పవన్‌ను ముఖ్యమంత్రి అవనిస్తారా అనే సందేహం వస్తే మాత్రం ఓట్లు పడవు. కుమారస్వామి రాజకీయాల్లో 22 ఏళ్లగా ఉన్నవాడు. కర్ణాటక రాజకీయాల్లో కాకలు తీరిన దేవెగౌడ మార్గదర్శకత్వంలో తర్ఫీదు ఐనవాడు. ఇక పవన్‌ తనకు ఆవేశమే తప్ప, రాజకీయ పరిపక్వత ఉన్నట్లు చూపుకోవటం లేదు. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే అవకాశాలెన్నో జారవిడుచుకున్నాడు.

ఏది ఏమైనా ప్రభుత్వవ్యతిరేక ఓటు చీల్చి తనకు సాయపడి, తనకు రక్షకుడిగా నిలుస్తాడనే అంచనాతో బాబు పవన్‌కు దోహదపడుతున్నారని, కనీసం సానుకూలంగా ఉన్నారనీ అనుకోవాలి. అందుకే పవన్‌ చేత కూడా జగన్‌ను తిట్టిస్తున్నారు. దాంతో వ్యవహారం వింతగా తయారైంది. ఏ విషయంలో నైనా అధికారంలో, పదవిలో ఉన్నవారినే అందరూ తప్పుపడతారు. పదవి దక్కనివారిని కాదు. సినిమా ఫెయిలయితే హీరోని తిడతారు తప్ప, హీరో వేషం దక్కక విలన్‌గా వేసిన వాణ్ని తిట్టరు. ప్రత్యేక హోదా దక్కకపోవడానికి కారణం జగన్‌ అంటూ ఉంటే నవ్వు వస్తోంది. జగన్‌ ముఖ్యమంత్రి అవుదామని ఆశ పడ్డారట, అది తప్పా? సినిమాల్లోకి వచ్చేవాడు హీరో వేషం కోసమే వస్తాడు తప్ప జూనియర్‌ ఆర్టిస్టుగా, లైట్‌బోయ్‌గా ఉందామని రాడు కదా! ఇక జగన్‌లో పవన్‌ పట్టే పెద్ద తప్పేమిటంటే అసెంబ్లీకి వెళ్లటం లేదని. నిజమే, అసెంబ్లీ బహిష్కరణ పొరబాటని నేనూ అనుకుంటాను.

రేపు జనసేన ఫిరాయింపులకు బలి ఐతే...? - కానీ దానికి వైసిపి చెప్పే వివరణ కూడా విని, జవాబు చెప్పగలగాలి. పార్టీ ఫిరాయింపులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, స్పీకరును అడ్డు పెట్టుకుని అధికారపక్షం ఆటలాడుతోందని, అనేక విధాలుగా ప్రయత్నించి విఫలమై చివరకు యీ బాట పట్టామని చెప్తోంది. అలాటి సమస్యకు పరిష్కారం తమ వద్ద ఉంటే పవన్‌ చెప్పాలి. రేపు ఆయన కూడా 10, 15 ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వస్తే, టిడిపి కానీ, వైసిపి కానీ ఓ పక్క పొత్తు గురించి చర్చలు జరుపుతూనే, మరో పక్క ఆ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు గుంజేసుకుంటే పవన్‌ ఏం చేస్తారు? తాట తీస్తా, చర్మం ఒలుస్తా, పంచెలూడగొడతా, ప్రజల్లోకి వెళితే చైతన్యవంతుల్ని చేస్తా వంటి సినిమా డైలాగులు  పరిస్థితిని చక్కదిద్దవు. ఆ మాట కొస్తే వైసిపికి ఉన్న క్యాడర్‌ కూడా తక్కువేమీ కాదు. వీధుల్లో ఎన్నయినా ప్రదర్శనలు చేయవచ్చు. అయినా స్పీకరు అవేమీ పట్టించుకోడు. కోర్టులు కూడా స్పీకరు జోలికి రాలేకపోతున్నాయి.

వీటితో బాటు అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వకుండా టిడిపి సభ్యులు గోలగోల చేస్తున్నారని వైసిపి అంది. అది నిజమేనని అసెంబ్లీ ప్రత్యక్షప్రసారాలు చెపుతున్నాయి. జగన్‌ మైకు తీసుకోగానే లక్ష కోట్లు అని అరిచినట్లు, రోజా మైకు తీసుకోగానే జబర్దస్త్‌ అంటూ గోల చేసినట్లు, రేపు పవన్‌ మాట్లాడడం మొదలుపెట్టగానే గబ్బర్‌సింగ్‌, గబ్బర్‌సింగ్‌, 'నాకు తిక్కుంది' అని అధికార బెంచీల్లో అరుపులు వినబడితే ఆయన ఏం చేస్తాడు? ఇలాటి ఫ్రస్ట్రేషన్‌లో వైసిపి అసెంబ్లీని బహిష్కరించింది. దాన్ని సమర్థించలేం కానీ, అలాటి పరిస్థితి రాకుండా నివారించడానికి జనసేన వద్ద ఉపాయం ఉంటే అది చెప్పి జగన్‌ను నిందించాలి.

ఇదేనా ప్రత్యామ్నాయ రాజకీయం? - ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ రంగంలోకి వచ్చిన పవన్‌ గతంలో ప్రజారాజ్యం, లోకసత్తా చేసిన తప్పులే చేస్తున్నారు. ఎంత మేధావులైనా పార్టీలో చేరిన మర్నాడే టిక్కెట్లు యివ్వడం, బంధువులకు టిక్కెట్లివ్వడం వంటివి విమర్శకు గురయ్యేవేే. పవనే ఒకసారి అన్నారు - 'ప్రజారాజ్యం టైములో నాకు టిక్కెట్టిస్తానంటే అసహ్యంగా ఉంటుంది వద్దన్నాను, అన్నగారు అధ్యక్షుడు, తమ్ముడు అభ్యర్థి అంటే ఏం బాగుంటుందన్నాను.' అని. ఇప్పుడు తను నాగబాబుకి పిల్చి యిచ్చారు. నేను కులాన్ని పరిగణించను అంటూనే కులప్రాతిపదికపై ఏర్పడిన బియస్పీతో పొత్తు పెట్టుకుని వాళ్లకు కమ్యూనిస్టుల కంటె పెద్ద పీట వేయడం స్వవచోఘాతమే. ఆయన అభ్యర్థుల్లో గట్టివాళ్లెంత మంది ఉన్నారో తెలియటం లేదు. జెడి లక్ష్మీనారాయణ మేధావి కావచ్చు కానీ గెలవగలరా? తోట చంద్రశేఖరరావు కూడా ఐఏఎస్సే, కానీ రెండుసార్లు ఓడిపోయారు. టిడిపి సహకారం లేనిదే వీళ్లెవరూ గట్టెక్కే పరిస్థితి లేదని అనిపిస్తోంది.

ఏది ఏమైనా జనసేనకు యువతీయువకుల్లో కొందరు ఓటేసినా, కాపులు యీ పరిస్థితిని ఎలా అర్థం చేసుకుంటున్నారనే దానిపై మొత్తం ఆధారపడి ఉంది. కాపులని ప్రత్యేకంగా ఎత్తిచూపడం దేనికంటే గతంలో ప్రజారాజ్యం లాగ జనసేనా కాపులచేత, కాపులకోసం నడిపే పార్టీగా పేరు పడిపోతోంది. ప్రజారాజ్యంలో యితరులు కూడా వున్నారు, దీనిలో మాగ్జిమమ్‌ కాపులే కనబడుతున్నారు. అందుకే కాపులపై ఫోకస్‌. తమకు సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా, తమ నాయకులకు రాజకీయ చాకచక్యం లేకపోవడం చేతనే, వారి అమాయకత్వం వలననే యిన్ని దశాబ్దాలుగా తమ కులానికి చెందిన ముఖ్యమంత్రి ఒక్కరూ లేరనే వేదన వాళ్ల కుంది. అందుకే చిరంజీవి రంగంపైకి వచ్చినపుడు కాస్త ఉత్సాహపడ్డారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ స్వతంత్రంగా ఎదగగలడా, బాబు చేతిలో కీలుబొమ్మగా మారతాడా అనేదే వాళ్లకు బెంగ. ఎందుకంటే బాబుతో పొత్తు పెట్టుకున్న బిజెపి గతి ఆంధ్రలో ఏమైందో చూశారు.

తనకు కావలసినవాళ్లనే బాబు బిజెపిలోకి పంపి దాని అభ్యర్థులుగా నిలిపారు. వాళ్లకే మంత్రి పదవులిచ్చారు. వాళ్లు పేరుకే బిజెపి వారు, కానీ అంతరంగంలో టిడిపి వారే. టిడిపితో పొత్తు పెట్టుకుంటే, మనం ఎన్నటికీ ఎదగలేము అని వాదించేవారందరినీ పక్కకు నెట్టేట్లు చేయగలిగారు. తన తప్పులు కూడా బిజెపిపై నెట్టేసి, దాన్ని ప్రజల దృష్టిలో విలన్‌ని చేసి, 2014లో కాంగ్రెసు స్థానానికి 2019లో బిజెపిని దింపారు. నాలుగేళ్లు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయి వుండి కూడా బిజెపి యీనాడు రాష్ట్రంలో సరైన నాయకత్వం లేక అల్లాడుతోందంటే బాబుతో చెలిమే కారణం. ఇప్పుడు జనసేనలో కూడా తన అభ్యర్థులనే పంపి దాన్ని టిడిపి-బి టీముగా మార్చేస్తున్నారని హోరెత్తిపోతోంది.

బాబు తన ధృతరాష్ట్ర కౌగిలిలో నలిపేద్దామని చూస్తే నిలవరించగల శక్తి పవన్‌కు ఉందా? ఉందని కాపులకు తోస్తే బాబుకు పవన్‌ రక్షకుడు అవుతాడు. లేకపోతే బాబు పాలిట తక్షకుడే అవుతాడు. ఎందుకంటే 2014లో వైసిపికి కాపులు ఓట్లు పెద్దగా పడలేదు. ఇప్పుడు పవన్‌ను బాబు మానిప్యులేట్‌ చేస్తాడన్న భయంతో కొంతమంది కాపులు వైసిపి వైపు మళ్లినా దాని ఓటింగు శాతం పెరిగి, టిడిపిని దాటుకుపోతుంది. పవన్‌తో చెలిమి బాబు పాలిట శాపమౌతుంది.

(సమాప్తం)- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2019)
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌: రక్షకుడో? తక్షకుడో? - 1/2

 


×