Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: షమీమ్ కోణం మాటేమిటి?

ఎమ్బీయస్‍: షమీమ్ కోణం మాటేమిటి?

ఈ వ్యాసం ప్రారంభించబోయే ముందు రెండు మాటలు – వివేకా హత్య గురించి వినవస్తున్న కథనాలపై  నేను ప్రశ్నలు సంధిస్తూంటే, కొందరు పాఠకులు నాకు ప్రశ్నలు సంధిస్తున్నారు. నా దగ్గర పూర్తి సమాచారం, ఆధారాలు ఉంటాయా ఏమన్నానా? సిబిఐ ఫైనల్ చార్జిషీటు ఫైలు చేయాలి, కోర్టులో వాదోపవాదాలు జరగాలి, అంతా విన్నాక కోర్టు తీర్పు యివ్వాలి, అప్పుడే మనకు జరిగినది క్షుణ్ణంగా తెలుస్తుంది. తీర్పుపై పైకోర్టుకి అపీల్‌కు వెళితే అప్పుడు యింకా బాగా తెలుస్తుంది. ఈ లోపున మనకు తెలిసేదంతా పేపర్లలో వచ్చే కథనాల ద్వారానే! ఇవి సిబిఐ కోర్టులో చేసే వాదనల ఆధారంగా, లీకుల ఆధారంగా తయారవుతున్నాయి. అవి పట్టుకుని కొందరు సర్వజ్ఞ సింగభూపాలురు ఫలానా వాడు హంతకుడు, ఫలానావాడు వెనక్కాల ఉన్నాడు అని తీర్పులు యిచ్చేస్తున్నారు. కాదేమో ఆలోచించి చూడండి అని సూచించినందుకు శాపనార్థాలు పెడుతున్నారు.

నేను చేస్తున్నదేమిటి? అలాటి తీర్పుల్లో, వాదనల్లో తర్కరహితంగా ఉన్నవి ఎత్తి చూపుతున్నాను. కేసును సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఫలానాఫలానా విషయాలు కూడా పరిగణించాలి కదా అని సూచిస్తున్నాను. ఈ సమాచారంతో, యీ తర్కంతో ఎవరికి వారే ఏం జరిగిందో ఊహించుకోవచ్చు. అది నిజం కావాలనీ లేదు, కాకూడదనీ లేదు. అవినాశ్ విషయానికి వస్తే అతను నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడని నేను అనలేదు. ఏ వ్యక్తి విషయంలోనైనా అంతకు ముందు 99 హత్యలు చేసి ఉన్నా, యీ హత్య చేశాడా లేదా అనేది, చేసి ఉంటే చేసినట్లు రుజువు చేయగలమా అన్నదే ప్రశ్న. అదే అవినాశ్‌కూ వర్తిస్తుంది.

ఇక జవాబులు చెప్పవలసినది – తెలిసీ మౌనంగా ఉన్నవారినీ, స్టేటుమెంట్స్ మార్చేవారినీ, సాక్ష్యాలను చెరిపేసేవారిని, విచారణ జరగకుండా చూసేవారినీ.. యీ లిస్టులో వివేకా బంధువులందరూ - జగన్, శర్మిల, సునీత, అవినాశ్, బావమరదులు వగైరాలతో సహా అందరూ వస్తారు. వారితో పాటు తక్కినవారూనూ! అరకొర సమాచారం ఉన్న మీరూనేనూ కాదు. నేను హత్య ఎలా జరిగిందో కూడా రాయబోవటం లేదు. కక్ష, కోపం ప్రస్ఫుటంగా కనబడుతున్న యీ హత్య జరగడానికి గల మోటివ్‌లు ఏమేమి ఉన్నాయి అన్నదాని గురించి మాత్రమే రాస్తున్నాను. రాజకీయపరమైనవి బలంగా కనబడటం లేదు అని క్రితం వ్యాసంలో రాశాను. అనేక హత్య కేసుల్లో ముఖ్యకారణాలైన కాంతాకనకాల గురించి దీనిలో రాస్తాను. దీనిలో రెండూ ముడిపడి ఉన్నాయి.

వివేకా ద్వితీయ వివాహం, దానిపై కుటుంబం ఆగ్రహం, వివేకాకు డబ్బు సరఫరా ఆగడం, డబ్బు సంపాదించడం కోసం వివేకా సెటిల్‌మెంట్లకు దిగడం, వాటిలో బెంగుళూరు సెటిల్‌మెంటు వ్యవహారం, ఆ డబ్బు పంచుకోవడం విషయంలో వాటాల పేచీ, అనుచరుల ఆగ్రహం.. అనే సీక్వెన్స్‌లో ఆలోచిస్తే కొంత దారి కనబడుతుంది. వివేకా సెటిల్‌మెంట్లు చేసే వ్యక్తా? ఆయన లేటు వయసులో మరో మహిళను పెళ్లాడాడా? అని ఆశ్చర్యపడితే పడండి. చిత్రమేమిటంటే, ఆయన హత్య జరగగానే సాక్షి ఆ విషయాలేవీ మాట్లాడలేదు. సౌమ్యుడు, పెద్దమనిషి.. అంటూ పొగిడింది. ఆంధ్రజ్యోతి అవన్నీ రాసింది. ఇప్పుడు సాక్షి అవన్నీ వివరంగా చెపుతోంది. ఆంధ్రజ్యోతి వాటి గురించి మౌనంగా ఉంటూ, యీ వివరాలన్నీ వ్యక్తిత్వహననంగా వర్ణిస్తోంది. ఇవాళ్టి ‘‘కొత్త పలుకు’’లో రాధాకృష్ణ కూడా వాపోయారు. కడప ఎంపీ సీటును వదినకో, అన్న కూతురికో యిప్పించాలని జగన్‌తో పేచీ పెట్టుకున్న త్యాగరాజుగా కూడా వివేకను చిత్రీకరిస్తున్నారు.

శర్మిల యిప్పుడు తన స్టేటుమెంటులో చిన్నాన్న అందరికీ సాయపడే వ్యక్తి అని, ఆయన గురించి ఏమేమో రాస్తున్నారని బాధపడింది. సాయపడే కోణం ఉన్నంత మాత్రాన చీకటి కోణాలు ఉండవని చెప్పలేము. హత్య జరగగానే నేను రాసిన వ్యాసంలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఆధారంగా ‘పరమేశ్వరరెడ్డి వివేకా తరఫున బెంగుళూరులో సెటిల్‌మెంట్లు చేయిస్తూంటారని, రూ.125 కోట్ల సెంటిల్‌మెంటుతో ముడిపడిన భూమిలో కొంత భాగాన్ని వివేకాకు తెలియకుండా గంగిరెడ్డి అనే అనుచరుడు అమ్ముకోవడంతో వివేకాకు కోపం వచ్చిందని, అనుచరులైన గంగిరెడ్డి, పరమేశ్వర రెడ్డి యిద్దరూ కలిసి వివేకాను హతమార్చి ఉంటారని కథనం వచ్చింది.’ అని రాశాను. 125 కోట్లు కాదు, 80 కోట్లు అని యిప్పుడు వార్త వచ్చింది. https://telugu.greatandhra.com/articles/mbs/what-ys-viveka-murder-conveys-97998.html

ఆ వ్యాసంలోనే ‘షమీన్ లేదా సమీరా అనే ముస్లింను వివేకా 2010లో వివాహం చేసుకున్నారని, ఆమె ద్వారా ఒక కొడుకు ఉన్నాడనీ, వారి తరఫు వాళ్లు యీయనపై దాడి చేశారనీ కథనం. (దీన్ని పరమేశ్వర రెడ్డి ఖండించాడు). సమీరా నుంచి యీయన సెల్‌ఫోన్‌కు నాలుగు మెసేజులు వచ్చాయని, వాటిని యీయన డిలీట్ చేశాడని కూడా ఆంధ్రజ్యోతి అంటోంది. అర్ధరాత్రి 1.30కు వచ్చిన మొదటి మెసేజిలో ‘‘నీ కూతురు వలన మేం నాశనమయ్యాం. ఇందుకు తగిన శిక్ష అనుభవిస్తావు. దేవుడు ఉన్నాడు.’’ అని ఉందట... షమీన్ ఫోన్ నుంచి కడప వైసిపి నేత అఫ్జల్ ఖాన్‌కు కాల్స్ వెళ్లాయని కూడా జ్యోతి అంటోంది.’ అని రాశాను. షమీమ్ సిబిఐకు 12 పేజీల స్టేటుమెంటు యిచ్చినా, సిబిఐ తన అఫిడవిట్‌లో రెండో పెళ్లి గురించి ప్రస్తావించినా ఇప్పుడు యీ కోణం గురించి మాట్లాడడానికి ఆంధ్రజ్యోతి యిష్టపడటం లేదు. ఆ బరువుబాధ్యతలు సాక్షి తనపై వేసుకుంది.

వివేకా తన ఆస్తులు ఎక్కడ షమీమ్‌కు రాసేస్తాడో అన్న భయం చేత సునీత భర్త రాజశేఖర రెడ్డి వివేకాను చంపించి ఉంటాడు, భర్తను కాపాడుకోవడానికి సునీత అవినాశ్‌ను యిరికిస్తోంది అనే లైనును సాక్షి ప్రమోట్ చేస్తోంది. సిబిఐ ఆ కోణంలో ఎందుకు ఆలోచించటం లేదు అని ప్రశ్నిస్తోంది. దానికి సమాధానంగా శర్మిల షమీమ్ ఉనికిని గుర్తించకుండా ‘వివేకా పేర ఆస్తులేవీ లేవు. ఆయన అన్నీ సునీత పేరే కొన్నారు. ఆయన పేర ఒకటీ అరా ఉన్నా, వారసులుగా సునీత పిల్లల పేర విల్లు రాశారు. ఆస్తుల కోసం చంపాలంటే, సునీతను చంపాలి.’ అని ప్రకటించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో వివేకా తన ఆస్తుల విలువ రూ.42 కోట్లు అని తెలిపారట. మొన్ననే ఓ వాట్సాప్ వచ్చింది, 4 చోట్ల కలిపి మొత్తం 89.83 ఎకరాలు వివేకా పేర ఉన్నవి 2023 జనవరి నెలలో ఆయన భార్య, కూతురి పేర మారాయి అని. 42 కోట్లు అంటే యిలాటివి కలిపి అయివుండవచ్చు.

అది శర్మిల దృష్టిలో ఒకటీ అరా కావచ్చు! కూతురి పేర కొన్నవి కొనగా తన పేర కొంత ఉంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆయన మరణానంతరం అవి సునీత పిల్లలకు డైరక్టుగా ఎలా వెళ్లిపోతాయి? మధ్యలో వివేకా భార్య ఉన్నారుగా! ఆవిడకు ఏ హక్కూ ఉండదా? అయినా జీవితకాలంలో విల్లును ఎన్నిసార్లు కావలిస్తే అన్ని సార్లు మార్చవచ్చని శర్మిలకు తెలియదా? ఆస్తుల కోసం చంపాలంటే రాజశేఖర రెడ్డి సునీతను చంపాలి అన్న లాజిక్ కొంతవరకే పనికి వస్తుంది. ఎందుకంటే ఆమె తదనంతరం పిల్లలకు వాటా వెళుతుంది కదా! అయినా యిక్కడ సునీత, ఆమె భర్తకు ఉన్న ఆస్తి సరిపోక కాదు, వివేకా తన పేర ఉన్న ఆస్తిని రెండో భార్య పేర రాసేస్తాడేమో, అది ఎలా ఆపాలి అన్న ఆరాటంతోనే యీ ఘాతుకానికి పాల్పడ్డారు అనేది ఆరోపణ. ఇది ఎంతవరకు బలమైనది అని విచారిస్తే తప్ప తెలియదు.

కేసును కేసుగానే చూడాలి తప్ప సునీత మాట రాగానే ‘ప్రాణాలు పోసే వృత్తిలో ఉన్న వ్యక్తి ప్రాణాలు తీస్తారా?’ అని రాధాకృష్ణ వాపోయినట్లు వాపోకూడదు. హంతకులైన డాక్టర్ల కథలెన్నో ఉన్నాయి. డా. కోడెల శివప్రసాద్ గారిపై ఉన్న ఆరోపణల సంగతేమిటి? అయినా కక్ష, డబ్బు దగ్గరకు వచ్చేసరికి అందరూ ఒక్కటే. ఆవిడకు హత్యలో పాత్ర ఉంటుందని నేనూ అనుకోవటం లేదు. అంతమాత్రం చేత సెంటిమెంటు కబుర్లు చెప్పను. తండ్రిపై కోపం మాత్రం ఉంటుందని కచ్చితంగా అనుకోవచ్చు. లేటు వయసులో రెండో పెళ్లి చేసుకున్న ఎన్టీయార్ పట్ల ఆయన కుటుంబం కక్ష కట్టలేదా? ఎంతో సంస్కారి, విద్యావంతురాలుగా పేరుబడిన ఎన్టీయార్ కూతురు తనను ...డా అని తిట్టిందని లక్ష్మీపార్వతి చెప్పుకున్నారు. అయితే కావచ్చు. బహిరంగంగా పెళ్లాడిన ఆ కేసులోనే అలా ఉంటే రహస్యంగా పెళ్లి చేసుకున్న యీ కేసులో కుటుంబం ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుంది!

2010లో వివేకా, షమీమ్ పెళ్లి జరిగింది అంటే అంతకు ముందే కొన్నేళ్లగా వాళ్ల మధ్య వ్యవహారం ఉండి ఉండవచ్చు. ఎరేంజ్డ్ మారేజి అయితే పెళ్లి చూపులైన ఆర్నెల్లలోగా పెళ్లయిందనుకోవచ్చు. ఇలాటివి ఎఫయిర్లగా మొదలై, కొంతకాలానికి బంధం బలపడి, చివరకు ఆమె గర్భవతి అయితే, యిక తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని ఉండవచ్చు. ఆ పిల్లవాడు వయసు తెలిస్తే ఎఫయిర్ ఎప్పుడు మొదలైందో ఒక ఐడియా వస్తుంది. ఇటువంటివి కుటుంబం చీదరించుకునే వ్యవహారాలే. ఎఫయిర్‌తో అయితే సర్దుకుని ఊరుకునేవారేమో, పెళ్లిదాకా వెళ్లడంతో భార్యా, కూతురు, అల్లుడు. పెద్ద బావమరిది అసహ్యించుకోవడంలో, అవతలివ్యక్తిని బెదిరించడంలో ఆశ్చర్యం లేదు. అంతమాత్రం చేత చంపించారని అనడం సబబు కాదు.

సాక్షి కథనం ప్రకారం – ‘2012లో రోడ్డు ప్రమాదానికి గురైన వివేకాను చూడ్డానికి వెళ్లిన షమీమ్‌ను పెద్ద బావమరిది శివప్రకాశ్ రెడ్డి యింట్లోకి రానీయలేదు. ఆయన హెచ్చరించడంతో షమీమ్ అన్నయ్య, వదిన కుటుంబం పులివెందుల విడిచిపెట్టి వెళ్లిపోయింది. బావమరుదుల భయంతోనే షమీమ్ హైదరాబాదులో తన చిరునామా తెలియకుండా గోప్యంగా ఉంచింది. వివేకా షమీమ్‌కు యిచ్చిన ఒక యింటి పత్రాలను సునీత, ఆమె భర్త, బావగార్లు షమీమ్ యింటికి వెళ్లి, గొడవ పెట్టుకుని లాక్కున్నారు. షమీమ్, సునీతల మధ్య వాట్సాప్‌లో వాదోపవాదాలు జరిగాయి.’

2013 నుంచి వివేకాకు, సునీతకు మాటలు లేవని అవినాశ్ చెప్పాడు. భార్య కూడా వివేకాను విడిచి కూతురితో ఉంటున్నారు. 2017లో రూ.42 కోట్ల ఆస్తి వివేకా పేర ఉంటే, అప్పటికే సునీతతో గొడవలు వచ్చాయి కాబట్టి ఆమె పేర రాసే ప్రశ్న లేదు. వాటిని షమీమ్ పేర రాస్తానని వివేకా అంటే భార్య, కూతురు ఒప్పుకుంటారా? తమకు ఎంత ఆస్తులున్నా ఎన్టీయార్ కుటుంబం ఆయన లక్ష్మీపార్వతి పేర యిల్లు రాస్తానంటే ఒప్పుకునేవారా? ఎన్టీయార్ ఎలాగూ రాయలేదు. అంతిమంగా లక్ష్మీపార్వతికి యిల్లు లేకుండా పోయింది కదా! తన పేర ఏదైనా ఉంటే షమీమ్ పేర రాస్తాడనే భయంతో వివేకా చేతికి డబ్బు రాకుండా చేశారని, డాక్యుమెంట్లు ఆయనకు అందుబాటులో లేకుండా చేశారని అనుకోవచ్చు. వివేకా డైరక్టరుగా ఉన్న కుటుంబసంస్థ పేర 200 ఎకరాలున్నాయని పిఏ కృష్ణారెడ్డి అంటున్నాడు. కుటుంబ వ్యాపార సంస్థలకు సంబంధించి ఆయన చెక్ పవర్ విత్‌డ్రా చేశారని షమీమ్ అంటోంది. అందుకే ఆయన సెటిల్‌మెంట్లు చేసి డబ్బు సంపాదిద్దామనే ప్లాను వేసి ఉంటాడు.

షమీమ్ అనే వ్యక్తి లేదన్నట్లు శర్మిల, వివేకా కూతురు, అల్లుడు మాట్లాడినా, అవినాశ్ వాళ్ల గురించి మాట్లాడేశాడు. అతని వీడియో ప్రకారం – ‘వివేకా 2010లో ఇస్లాం మతం స్వీకరించి మహమ్మద్ అక్బర్‌గా పేరు మార్చుకుని షమీమ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వాళ్లకి షెహన్‌షా అనే అబ్బాయి ఉన్నాడు. షమీమ్‌కు ఒక విల్లా కొనుగోలు చేసి యిచ్చి, అబ్బాయిని హైదరాబాదు పబ్లిక్ స్కూలులో చదివించాలని, ఫిక్సెడ్ డిపాజిట్ చేసి వారి జీవనానికి ఎలాటి యిబ్బందులు లేకుండా చేయాలని అనుకున్నాడు. బెంగుళూరు డీల్ రూ. 8 కోట్లు వస్తే దాన్ని వాళ్లకు యిద్దామని అనుకున్నాడు. అది రాకపోవడంతో తన వాటా ఆస్తిగా వచ్చే 25శాతం భాగాన్ని షమీమ్ కుటుంబానికి చెందేలా విల్లు రాశారు....’ ఆస్తిలో 25శాతం అంటే అది పిత్రార్జితం అనుకోవాలా? స్వార్జితం అయితే 100శాతం ఆయన యిష్టమొచ్చినట్లు రాయవచ్చు.

ఇన్నాళ్లూ అజ్ఞాతంగా ఉన్న షమీమ్ బయటకు వచ్చి, ఔను మాకు పెళ్లయింది అంటోంది. ఫోటోలు చూపించింది. కొడుక్కి డిఎన్ఏ చేయించుకోండి అని చెప్తోంది. ఆస్తి విషయమై సునీత తనతో ఘర్షణ పడిందని చెప్తోంది. తమ మధ్య ఉన్న వైరం గురించి వివేకాతో జరిగిన వాట్సాప్ సంభాషణ బయటకు వచ్చింది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు వివేకా తనతో మాట్లాడాడని, బెంగుళూరు డీల్‌లో రూ. 2 కోట్ల డబ్బు వస్తుందనే ఆశతో ఉన్నాడనీ షమీమ్ చెప్తోంది. వివేకా ఫోన్‌లో సునీతా దంపతులు ఆ రికార్డు తుడిచేసి ఉంటే, సిబిఐ రిట్రీవ్ చేయవచ్చు. లేకపోతే షమీమ్‌ ఫోన్‌లో ఉంటుంది. దాన్ని డైయింగ్ డిక్లరేషన్‌గా తీసుకుంటారని, దానికి ప్రాధాన్యత ఉంటుందని ఒక లాయరు చెప్పిన వీడియో చూశాను. ప్రాణం పోతూ ఉండగా మేజిస్ట్రేటు ముందు చెప్పినదే డైయింగ్ డిక్లరేషన్ అనుకోకూడదని, దీన్ని కూడా కోర్టులో సాక్ష్యంగా తీసుకుంటారని ఆయన అన్నారు. దానిలో వివేకా తన వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే అది వాళ్లకు యిబ్బందికరమైన పరిస్థితే.

షమీమ్ మాట ఎలా ఉన్నా, తన ఖర్చులకూ డబ్బు కావాలి కదా. అన్ని విధాలుగా డబ్బుకి యిరకాటం రావడంతో వివేకా బెంగుళూరు సెటిల్‌మెంటు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. దాని సంగతేమిటంటే ఒకతను రూ. 80 కోట్ల విలువ చేసే ఒక స్థలం తాలూకు పవరాఫ్ ఎటార్నీ తన దగ్గర ఉందని చెప్పి, స్థలం తన పేర వచ్చేట్లుగా చేయమని వివేకా సాయం కోరాడు. వివేకా అతన్ని నమ్మి గట్టి ప్రయత్నం చేశారు. డబ్బు వస్తే ఎవరు ఎలా పంచుకోవాలో అనుకున్నారు. దానిలో వివేకా ఎక్కువ వాటా అడిగి తన అనుచరుల కోపాన్ని మూటకట్టుకున్నారు. ఎందుకంటే షమీమ్‌కు డబ్బివ్వడానికి ఆయన దగ్గర వేరే మార్గమేమీ లేదు. కుటుంబం యితర మార్గాలన్నీ మూసివేసింది. బెంగుళూరు డీల్ మీద ఎంతో ఆశ పెట్టుకున్నా, చివరకు అవి ఫేక్ డాక్యుమెంట్లు అని తెలిసి అందరూ ఆశాభంగం చెందారు. డబ్బు రాలేదు కానీ వివేకాకు అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డితో విభేదం వచ్చింది.

ఇంతవరకు మనకు తెలుసు. ఇకపై ఏం జరిగి ఉంటుందో ఊహించాల్సిందే. నేను ఊహిస్తున్నది యిది - గంగిరెడ్డికి మోటివ్ ఉంది. అతను సునీల్ యాదవ్, ఉమాశంకర రెడ్డి లను కలుపుకున్నాడు. వాళ్లకూ మోటివ్ ఉంది. సునీల్ గతంలో డైమండ్సంటూ రంగురాళ్లు అంటగట్టబోవడంతో వివేకా అతన్ని తిట్టి దూరం పెట్టాడట. పైగా సునీల్ తల్లితో, ఉమాశంకర్ భార్యతో కూడా వివేకా అక్రమసంబంధం పెట్టుకుని ఉన్నాడుట. ఆయనకు స్త్రీలోలత్వం బాగా ఉందనే వార్తలు ఉన్నాయి. గంగిరెడ్డి ఆయనకు వ్యభిచారులను సప్లయి చేసేవాడని, కారు డ్రైవరుగా దస్తగిరి ఆయనను వాళ్ల దగ్గరకు తీసుకెళ్లేవాడని అభియోగం. అందుకే వివేకా కుటుంబసభ్యులు దస్తగిరిని కారు డ్రైవరుగా తీసేశారట. అతనికి ఆ కోపం ఉంది. దాన్ని చంపేటంత కోపంగా మార్చడానికి, దస్తగిరికి ధైర్యం చెప్పడానికి గంగిరెడ్డి మన వెనక్కాల పెద్దవాళ్లున్నారని చెపితే చెప్పి ఉండవచ్చు. డబ్బు విషయానికి వస్తే వివేకా యింట్లో ఎంతో కొంత ఉంటుంది, దోచుకోవచ్చు అని అనుకుని ఉండవచ్చు. బీరువాలో డాక్యుమెంట్లు బయటకు తీశారనే కథనం ఒకటి ఉంది. అవి పెట్టుకుని తామే సెటిల్‌మెంట్ చేద్దామని అనుకోవచ్చు. సునీత, భర్త అవి కావాలని అడిగితే డబ్బు డిమాండ్ చేయవచ్చని భావించవచ్చు.

సరైన ప్లాను లేకుండా, అస్తవ్యస్తంగా గంగిరెడ్డి గ్యాంగ్ చంపారనే భావించవచ్చు. చంపినవారు ఎవరో కనిపెట్టలేని విధంగా ప్రొఫెషనల్‌గా కాకుండా, క్రూడ్‌గా, అస్తవ్యస్తంగా, కసితో చంపిపారేసినట్లు జరిగిందీ హత్య. సునీత లేదా ఆమె భర్త వివేకాను చంపించారని అనుకోలేము. తండ్రిని కట్టడి చేయడానికి చూస్తారు, షమీమ్‌ను చంపుతామని బెదిరిస్తారు తప్ప తండ్రిని చంపరు. మానసికంగా, ఆర్థికంగా చంపారు కదా. అది చాలనుకుంటారు. అలాగే అవినాశ్, భాస్కరరెడ్డిలకు కూడా చంపేటంత మోటివ్ లేదు. ఇక హత్య ఎలా జరిగిందో ఆ వివరాలన్నీ సాంకేతిక పరమైనవి. కోర్టు విచారణ సమయంలో నిర్ధారించ బడతాయి. లేఖ రాయించాలన్న ఐడియా ఎందుకు వచ్చిందో అవన్నీ కూడా అప్పుడే తేలతాయి. హత్య తర్వాత జరిగిన విషయాలే మనకు ఆసక్తికరం. ఇక్కడ నాకు ‘‘కానూన్’’ (1960) సినిమా గుర్తుకు వస్తుంది. దానిలో ఒక హత్య జరుగుతుంది. ఎవరు చేశారో తెలియదు. ఫలానా వాళ్లు చేశారేమో, వాళ్లను కాపాడాలి అనుకొని వాళ్లకు కావలసినవాళ్లు అబద్ధాలు చెప్తారు. ముద్దాయిని ప్రభావితం చేయబోతారు. దానితో కేసు మరింత కాంప్లికేట్ అయిపోతుంది. సినిమా చాలా బాగుంటుంది. వీలైతే చూడండి. https://www.youtube.com/watch?v=3ieQ7e_UnTc

వివేకా హత్యను హత్యగానే ముందుగానే కుటుంబ సభ్యులు చెప్పేసి ఉంటే మిస్టరీ త్వరగానే విడిపోయేది. కానీ యిక్కడ కుటుంబ ప్రతిష్ఠ, రాజకీయ అవసరాలు కేసును కాంప్లికేట్ చేశాయి. వివేకా స్త్రీలోలత్వం, సెటిల్‌మెంట్లు, డబ్బు పేచీలు అన్నీ బజార్న పడతాయి అని భయపడడం మొదటి కారణం. పోయినవాడు ఎలాగూ పోయాడు. కుటుంబానికి చెడ్డ పేరు తేవడం కంటె సహజమరణం అని చెప్పేస్తే పోతుంది కదా అనుకున్నారు. అది ఎన్నికల సమయం కావడమొకటి పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. వైయస్ రాజారెడ్డి ఫ్యామిలీ అంతా ఫ్యాక్షనిస్టు ఫ్యామిలీ అని. హింసలో పుట్టి, హింసలోనే చస్తారని టిడిపి విపరీతంగా ప్రచారం చేస్తోంది. రాయలసీమ సంస్కృతి, కడప కల్చర్, రాజారెడ్డి రాజ్యాంగం.. యిలాటి పదాలు యథేచ్ఛగా దొర్లుతున్నాయి. 2014 ఎన్నికలలో వైజాగ్ నుంచి విజయమ్మ నిలబడితే రాయలసీమ రౌడీలు వచ్చి వైజాగ్ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేస్తారని ప్రజలను హడలగొట్టి విజయమ్మను ఓడించారు.

అలాటిది సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వివేకా దారుణ హత్య, ఆయన సెటిల్‌మెంట్లు చేస్తాడనే విషయం, స్త్రీలోలత్వం యిలాటివన్నీ బయటకు వస్తే వైయస్ కుటుంబంపై ఉన్న హింసాత్మక ముద్ర బలంగా పడుతుంది. ఇవన్నీ వారించాలంటే వివేకాది సహజమరణం అని లోకానికి ప్రదర్శించాలి అని కుటుంబసభ్యులందరూ డిసైడ్ అయ్యారని నా ఊహ. అందుకే వివేకా భార్య, కూతురు, అల్లుడు, బావమరిది, అవినాశ్.. అందరూ కూడబలుక్కుని గప్‌చుప్‌గా ఉన్నారు. సాక్ష్యాలు చెరిపి వేయించారు. పిఏ, డాక్టర్ గంగిరెడ్డి యిత్యాదులు సహకరించారు. గుండెపోటు కథని ప్రచారంలోకి తెచ్చారు. ఎవరూ వేరే గొంతుతో మాట్లాడకుండా, హత్య అనే వాస్తవాన్ని ఎలాగోలా సమాధి చేసేద్దామనుకున్నారు. అయితే వీళ్ల కుటుంబం పరువు బయట పడేయడానికి నిశ్చయించుకున్న వారెవరో యిది హత్యే అనే నిజం బయటకు వచ్చేట్లు చేశారు. అది ఆదినారాయణ రెడ్డి కావచ్చు, బిటెక్ రవి కావచ్చు, ఎవరైనా కావచ్చు.

వెంటనే టిడిపి దాన్ని ఉపయోగించుకుంది. వీళ్ల కుటుంబమే యింత అంది. జగనే సింపతీ కోసం బాబాయిని చంపించాడని ఆరోపించింది. దీన్ని ఖండించిన వారిలో సునీత కూడా ఉన్నారు. ఆవిడ 2019 మార్చిలో వివేకా హత్య తర్వాత హైదరాబాదులో ప్రెస్‌మీట్ పెట్టి ‘మా కుటుంబం గురించి బాబుకి ఏం తెలుసు? ఒకరినొకరు చంపుకునే చరిత్ర మా కుటుంబానికి లేదు. జగన్ వ్యక్తిత్వ హననానికే టిడిపి యిలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోంది. బాబు అసలు ఆదినారాయణ రెడ్డిని ఎందుకు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రజలారా, బాబు ట్రాప్‌లో పడకండి.’ అన్నారు. ఎన్నికల సమయంలో టిడిపి యీ హత్యను ఏ విధంగా వాడుకుందో గ్రేట్ ఆంధ్రాలో యివాళ వచ్చిన యీ ఆర్టికల్ చెప్తోంది. https://telugu.greatandhra.com/politics/analysis/viveka-name-card-use-tdp-135570.html?utm_source=vuukle&utm_medium=talk_of_town

దీన్ని కౌంటర్ చేయడానికి వైసిపి టిడిపియే యీ హత్య చేయించింది అనే పల్లవి ఎత్తుకుంది. ఏ ఆధారమూ లేకుండా.. అని యిక్కడ నొక్కి చెప్పాలి. డిఫెన్స్‌లో పడడం కంటె అఫెన్సివ్‌గా వెళితేనే ఎన్నికలలో లబ్ధి పొందుతామనే లెక్కలో నారాసుర చరిత్ర అని తాటికాయలంత అక్షరాలతో సాక్షిలో కథనం వేయించింది. స్థానిక పోలీసుల సిట్‌పై నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వయిరీ కావాలని హడావుడి చేసింది. ఇప్పుడు అది పీకకు చుట్టుకుంది. జగన్ ప్రస్తుత కష్టాలన్నిటికి అదే కారణం. బాలకృష్ణ కేసులో కాంగ్రెసు హస్తం ఉందని ఆరోపణ చేసి ఉంటే కాంగ్రెసు దుంప తెంపేదేమో! అది జరగలేదు కాబట్టి కేసును కప్పెట్టేశారు. ఇక్కడ రాజకీయంగా ఉపయోగించ దలచుకున్నారు కాబట్టి యీ చిక్కుముళ్లు. టిడిపి హయాంలో విచారణ కుంటూకుంటూ నడిచింది సరే, తను వచ్చిన తర్వాతైనా సరైన విచారణ జరిపించలేదు. సిబిఐకు అప్పగించకుండా నానా ప్రయత్నాలూ చేశాడు. కేసు తేలకుండా ఏళ్లూ, పూళ్లూ గడిపేసి, అటకెక్కించేస్తే ప్రజలు మర్చిపోతారు అని ఆశ పెట్టుకున్నాడు. అప్పుడు తను తన అబద్ధపు ఆరోపణలపై ప్రజల ముందు సంజాయిషీ చెప్పవలసిన పని లేదు అని భావించాడు.

సునీతకు కూడా కావలసినది అదే. ఎందుకంటే హత్య కేసులో విచారణ జరిగితే తండ్రి గురించిన అసభ్య వివరాలన్నీ బయటకు వచ్చి పరువు పోతుంది. నిజానికి యిప్పుడు జరిగినది అదే కదా. వివేకా గురించి స్థానికులకు తెలిసేమో కానీ బయటివాళ్లకు సౌమ్యుడు, సౌజన్యమూర్తి, అందరికీ సహాయపడేవాడు.. వంటి యిమేజి మాత్రమే ఉంది. ఇప్పుడు చూడబోతే డబ్బు కోసం సెటిల్‌మెంట్లు చేసే రకమని తెలిసింది. సెటిల్‌మెంట్ అంటే గూండాగిరీయే కదా, నేను కుదిర్చిన రాజీకి ఒప్పుకోకపోతే చంపించి వేస్తాను అని బెదిరించడమే కదా! లేకపోతే వీళ్ల మాట అవతలివాడు ఎందుకు వింటాడు? పైగా ఆడపిచ్చి ఒకటి. వేశ్యల సంగతి సరే, ఓ అనుచరుడి తల్లితో, మరో అనుచరుడి భార్యతో వ్యవహారాలు! ఇవి కాక కూతురు వయసు అమ్మాయితో మరో పెళ్లి, అదీ రహస్యంగా!

ఇవన్నీ తెలిసి సునీత యీ మురికి గుడ్డను బయటకు లాగి పబ్లిగ్గా ఎందుకు ఉతుకుతున్నారు? మొదట్లో జగన్‌తో కలిసి, హత్యను కామాపు చేయడానికి ప్రయత్నించినామె తర్వాత అడ్డం ఎందుకు తిరిగారు అన్నదే ఎవరూ చెప్పలేరు. శర్మిలకు దీనిలో పాత్ర ఉందని నా అనుమానం. జగన్‌తో చెడిన తర్వాత ఆమె సునీత వద్దకు వెళ్లి రెచ్చగొట్టి ఉంటుంది. శర్మిలకు రాజకీయంగా చాలా ఆశలున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఆమె కడప ఎంపీ సీటు ఆశించి ఉండవచ్చు. సొంత చెల్లెలు తనను కాదని సెకండ్ కజిన్, తన భార్యకు ఫస్ట్ కజిన్ అయిన అవినాశ్‌కు సీటిచ్చాడనే కోపం ఉండవచ్చు. సునీత ద్వారా అవినాశ్‌ను, తద్వారా జగన్‌ను యిబ్బంది పెట్టాలనే ప్రణాళిక వేసి ఉంటుందని నా అభిప్రాయం. ఈమె చెప్పినంత మాత్రాన సునీత వినాలని లేదు. ఆవిడకూ ఏదో కారణం ఉండివుండవచ్చు. ఇంగ్లీషులో చెప్పాలంటే షీ మస్ట్ హేవ్ సమ్ ఏక్స్ టు గ్రైండ్. ఇది యిక్కడ ఫిగరిటివ్‌గా నప్పుతుంది.

‘‘మర్డర్ ఆన్ ద ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’’ అని అగాథా క్రిస్టీ నవల ఉంది. సినిమాగా కూడా వచ్చింది. దానిలో ఒక కిడ్నాపర్ ఒక గొప్పింటి పిల్లవాణ్ని దారుణంగా చంపుతాడు. ఆ కుటుంబంతో వేర్వేరు విధాలుగా సంబంధం ఉన్న 12 మంది కూడబలుక్కుని కొన్నేళ్ల తర్వాత ఆ కిడ్నాపర్‌ను ఒక ట్రెయిన్‌లో వెళుతూండగా తలా ఒక కత్తిపోటు వేసి చంపేస్తారు. డిటెక్టివ్ వచ్చి అడిగినప్పుడు ఒకళ్లకొకళ్లు ఎలిబయ్ యిచ్చుకుంటారు. దాంతో డిటెక్టివ్‌కు మతి పోతుంది. చివరకు కనిపెడతాడనుకోండి. వివేకా హత్య కేసులో కూడా కుటుంబం, బంధువులు అందరూ కూడబలుక్కుని సాక్ష్యాలు లేకుండా చేసేశారు. నవల్లో అయితే అందరూ చివరిదాకా కలిసికట్టుగా ఉన్నారు. ఇక్కడ మాత్రం జగన్ క్యాంపు, సునీత క్యాంపులుగా విడిపోయింది.

ఏది ఏమైతేనేం, సునీత, జగన్‌ల మధ్య వైరుధ్యం ధర్మమాని హత్య మళ్లీ చర్చలోకి వచ్చింది. చాలా విషయాలు బయటకు వచ్చాయి. హత్యలో చంద్రబాబు పాత్ర లేదని వైసిపి ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. సునీతను పావుగా ఉపయోగించు కుంటున్నారని మాత్రమే యిప్పుడు అనగలుగుతున్నారు. ప్రతిపక్ష శిబిరంలో వైరుధ్యం ఉన్నపుడు దాన్ని ఉపయోగించుకోవడంలో వింతేముంది? ఆధారాల్లేకుండా ఎదుటివాళ్లపై నిందలు వేస్తే ఏమవుతుందో యిప్పుడు తెలిసి వస్తోంది. కేసు విచారణకు వచ్చేసరికి అవినాశే కాదు, సునీత కూడా బోనులో నిలబడి చాలా వాటికే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సాక్ష్యాలు చెరిపేయడం గురించి ఆనాడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు దగ్గర్నుంచి అనేక ప్రశ్నలు అడుగుతుంది డిఫెన్స్. సిబిఐ పటిష్టంగా పెడితే తప్ప డిఫెన్స్ కేసును ఎగరగొట్టేయగలదు. అంతిమంగా కేసును లాజికల్ ఎండ్‌కు తీసుకు వస్తారన్న నమ్మకం నాకైతే లేదు. చెప్పానుగా, గొప్పింటి కేసుల గతి యింతే! (ఫోటో – గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి)

ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2023)

[email protected]

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?