Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: వివేకా కేసు తేలేనా?

ఎమ్బీయస్‍: వివేకా కేసు తేలేనా?

నేను ఏ వ్యాసం రాసినా, కొందరు పాఠకులు వివేకానంద హత్య కేసు గురించి రాయగలవా అంటూ ఛాలెంజ్‌లు విసురుతున్నారు. అక్కడికి నేను రాయకపోతే కొంప మునిగిపోతుందన్నట్లు, రాస్తే మిన్ను విరిగి మీద పడుతుందన్నట్లు! పేపర్లలో, టీవీల్లో వివేకా గురించి వార్తలు వినివిని విసుగు రావటం లేదా? పోనీ నాకేమైనా అంతర్గత రహస్యాలు తెలుసా, బయటపెడుతూంటే వివేకా హంతకులు వచ్చి నా నోరు శాశ్వతంగా మూయించేస్తారని భయపడడానికి? రెండేళ్ల క్రితం ‘వివేకా హంతకుడు వెక్కిరిస్తున్నాడు’ పేర ఓ వ్యాసం రాశాను. అప్పటికి ఏడాది క్రితం 2020 మార్చిలో సిబిఐ చేతికి కేసు వెళ్లింది. నా వ్యాసం తర్వాత ఏడు నెలలకు నవంబరులో నిందితుడు షేక్ దస్తగిరి ఎప్రూవర్‌గా మారాడు. ఇంకేముంది, కేసు తేలిపోతుందిలే అనుకుంటే యిప్పటికైనా తేల్చారా? అప్పటికీ, యిప్పటికీ కొత్తగా సమాచారం ఏదైనా బయటకు వచ్చిందా? పాతదాన్నే తిప్పితిప్పి కొడుతున్నారు.

ఎంతసేపూ అవినాశ్ రెడ్డిని సిబిఐ పిలుస్తోందా? పిలిస్తే యీయన వెళుతున్నాడా? అరెస్టు చేస్తారా? ముందస్తు బెయిలు అడగడం తప్పా? రైటా? ఏవిటీ సోది! జగన్ కేసుల విషయంలో కూడా అప్పుడు రన్నింగ్ కామెంటరీ యిచ్చి యిలాగే చంపారు. పదేళ్లు దాటింది. ఇప్పటిదాకా కేసుల అతీగతీ తేలలేదు. జగన్ దోషియో, కాదో తేల్చలేదు. వివేకా హత్యపై రాయమని నన్ను అడిగేవాళ్లకు యివన్నీ తెలుసు. జగన్ వాళ్ల బాబాయిని గొడ్డలితో పరపరా నరికాడని నేను రాయాలని వాళ్ల కోరిక. లేదు ‘నారాసురుడే’ చంపించేసి జగన్ మీద నెట్టేశాడని రాయాలని మరి కొందరి కోరిక. ఏదైనా ఆధారముంటే కామన్‌సెన్స్‌తో అలా కావచ్చు, యిలా కావచ్చు అని రాయవచ్చు. మనమే ఏదో ఊహించేసుకుని, దానికి తగినట్లుగా ఉన్న విషయాలు తీసుకుని, అడ్డు వచ్చేవి పక్కన పడేసి, ఊహాగానాలతో కథ అల్లడమెందుకు?

హత్య జరిగి నాలుగేళ్లు దాటినా, సిబిఐ చేతికి వచ్చి మూడేళ్లయినా, విచారణ పూర్తి కాలేదు. చార్జిషీట్లు మార్చిమార్చి వేస్తోంది. కోర్టు ఏప్రిల్ 30 వరకు గడువిస్తే, కుదరదండీ అంటూ జూన్ 30 వరకు పొడిగించుకున్నారు. మొన్ననే వివేకా అల్లుడితో రెండోసారి మాట్లాడాక సిబిఐ వారు వివేకా యింటి పరిసరాలను పరీక్షించారని చదివాను. ఇప్పుడా? నాలుగేళ్ల తర్వాత ఆధారాలేమైనా మిగులుతాయా? ఈ పాటికి ఆ యింటి మ్యాప్ అంతా సిబిఐ అధికారుల మెదడులో పాతుకుపోయి ఉండాలి కదా! వాళ్ల పరిశోధన అంత లక్షణంగా ఉంది. సునీతను మొన్న మొదటిసారి పిలిపించారట. ఈ బాలారిష్టాలు దాటి పూర్తి చార్జిషీటు ఎప్పుడొస్తుందో ఏమో! అసలు సిబిఐ కథనమంటూ బయటకు వస్తే దాని మీద మనం మిడిమిడి జ్ఞానంతోనైనా వ్యాఖ్యానించవచ్చు.

ఈ లోపున ఏం రాస్తాంలే అని తెలుగు మీడియా ఊరుకోవడం లేదు. కొబ్బరికాయ దొరికింది కదాని ఊరికే పీచు లాగుతోంది. ‘సిబిఐ నుంచి అవినాశ్‌కు పిలుపు వస్తోందని తెలిసి, దాని నుంచి దృష్టి మరల్చడానికి జగన్ ఫలానా పథకం రెండో విడత నిధులు విడుదల చేశాడు. అవినాశ్‌ను సిబిఐ పిలవకుండా చూడమని అడగడానికి జగన్ దిల్లీ వెళ్లాడు...’ యిలా రోజుకో వంటకం వండి వారుస్తున్నారు. దృష్టి మరల్చుదామని ఏం చేసినా మీరు వేరే వైపు దృష్టి తిప్పుకోరని అతనికి తెలియదా? పైగా సిబిఐ ఆఫీసుకి పిల్చి అడిగినంత మాత్రాన అక్కణ్నుంచి అటే ఉరికంబానికి తీసుకెళ్లి పోతారా? ఎవర్నయినా పిలుస్తారు, అడుగుతారు. కస్టడీలోకి తీసుకుంటారు, చార్జిషీటులో పేరు పెడతారు. ఫైనల్‌గా కేసు నిలవాలి కదా! దానికి తగ్గ ఆధారాలు చూపించాలి కదా!

ఈ లోపున సిబిఐ ఆఫీసు నుంచి కొరియర్ బాయ్ కదిలాడు, బైక్ మీద వేగంగా వెళుతున్నాడు.. దగ్గర్నుంచి అవినాశ్ సిబిఐ ఆఫీసుకి వెళ్లడానికి కారు దగ్గరకు వచ్చాడు, డ్రైవర్ కారు తలుపు తీశాడు,... సిబిఐ ఆఫీసులో 8 గంటల పాటు విచారణ చేశారు, అవినాశ్ గ్లాసెడు నీళ్లు తాగి, వాటినే నమిలాడు.. యిలాటి డైలీ సీరియల్ టీవీలు నడిపిస్తే నడిపించవచ్చు గాక, నా బోటి వాడికి విసుగ్గా ఉంటుంది. నేను ఏ డైలీ సీరియలూ చూడను, యిదీ చూడటం లేదు. పేపర్లో కూడా పైపైనే చూస్తున్నాను. బోల్డు రెడ్డి పేర్లు తారసిల్లడంతో మైండ్‌లో పిక్చర్ కలగాపులగం అయిపోయింది. అందువలన యీ సబ్జక్టుపై నేను రాయబోయే 3 వ్యాసాలలో పొరపాట్లు దొర్లవచ్చు. తప్పులుంటే ఎత్తి చూపండి. సరిదిద్దుకుంటాను. కావాలని విషయాన్ని మరుగు పరిచే ఉద్దేశం ఏమీ లేదు.

అవినాశ్‌కు అరెస్టు, ముందస్తు బెయిలు, తర్వాతి బెయిలు విషయం కూడా మీడియా పదేపదే ప్రస్తావించడం అనవసరం. బెయిలు వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. జగన్ చక్రం అడ్డువేసి అరెస్టు ఆపేయడానికి చూస్తున్నాడని కూడా నేను నమ్మను. నేనే వెళ్లి 16 నెలలు లోపల కూర్చుని వచ్చాను. నువ్వెళ్లి ఓ రెండు వారాలు కూర్చుంటే ఏమౌతుంది? అనవచ్చు. అవినాశ్ తండ్రి భాస్కరరెడ్డి అరెస్టయ్యారు. తెలంగాణలో శర్మిలకు 14 రోజుల జుడిషియల్ కస్టడీ అన్నారు. రాజకీయ నాయకులన్నాక కృష్ణజన్మస్థాన సందర్శన తప్పదు. అదే పెద్ద న్యూస్‌గా ఊదరగొడితే ఎలా? హైకోర్టు స్టే యిచ్చింది, దానిపై సుప్రీం కోర్టు స్టే యిచ్చింది. హియరింగ్ సందర్భంగా న్యాయమూర్తి నిట్టూర్చారు, వకీలు వగచాడు.. యివన్నీ న్యూస్ హైలైట్సా?

ఇవన్నీ చదివితే మనకు కేసు గురించి ఏమైనా అవగాహన వస్తుందా? అసలీ కేసు ఎప్పటికైనా తేలి, దోషులకు శిక్ష పడుతుందన్న ఆశ మీకుందా? నాకైతే లేదు. పెద్దవాళ్ల యిళ్లల్లో కేసులు లాజికల్ కన్‌క్లూజన్‌కు రావు. కొన్నేళ్ల క్రితం నితిన్ గడ్కరీ యింట్లో డ్రైవరు చచ్చిపోయాడన్న వార్త వచ్చింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌటాలా కోడలు, మాజీ కేంద్ర మంత్రి నట్వర్‌లాల్ కోడలు అనుమానాస్పదంగా మరణించారన్న వార్తలు వచ్చాయి కొన్నేళ్ల క్రితం. తర్వాత వాటంతట అవే సమసిపోయాయి. అంతెందుకు, ఎన్టీయార్ శతజయంతి యింత ఘనంగా జరుగుతోంది కదా, ఆయన మరణం ఎలా సంభవించింది అన్నదానిపై యితమిత్థంగా ఎవరైనా చెప్పగలరా?

పార్టీ నిధులను బాబు ఫ్రీజ్ చేయించడంతో గుండె పగిలి మరణించారని లక్ష్మీపార్వతి అంటారు. అబ్బే, లక్ష్మీపార్వతిని చూడకూడని పరిస్థితుల్లో చూశారు కాబట్టి గుండె బద్దలైంది అని టిడిపి అనుకూల రచయితలు కొందరు రాశారు. లక్ష్మీపార్వతి, ఆమె తాలూకు మనిషి బీరువా తాళాల కోసం ఎన్టీయార్ గుండెల మీద కూర్చున్నారు. పెనుగులాడుతూ ఆయన పోయాడు అనే వార్తలు కొందరు వ్యాప్తిలోకి తెచ్చారు. ఇదే జరిగి ఉంటే హత్య కిందకు వస్తుంది కాబట్టి విచారణ చేయించి సందేహనివృత్తి చేయించాలి కదా! జరిగినది సహజమరణం, అయినా దాన్ని రాజకీయ ప్రయోజనం కోసం యిరు పక్షాలూ వాడుకున్నాయి. అలాటప్పుడు వివేకా దారుణహత్యకు గురైతే దాన్ని వాడుకోరా? వాడుకున్నారు, వాడుకుంటున్నారు.

చంద్రబాబు హయాంలో హత్య జరిగింది కాబట్టి, దాన్ని టిడిపిపై నెట్టే ప్రయత్నం చేశాడు జగన్. నారాసుర రక్తచరిత్ర అని ‘‘సాక్షి’’లో పతాకశీర్షిక పెట్టి రాశారు. మాలో మేమే చంపుకున్నామంటున్నారు, ఒక కన్ను మరో కన్నుని పొడుచుకుంటుందా? అంటూ అసెంబ్లీలో జగన్ స్పీచొకటి! అన్నదమ్ముల్లో, భార్యాభర్తల్లో హత్యలు జరగవా? శుబ్భరంగా జరుగుతాయి. కోడికత్తి విషయంలో కూడా సాక్షి విపరీతంగా ప్రచారం చేసింది. వైజాగ్ ఎయిర్‌పోర్టులోని కాంటీన్ నడిపే అతను టిడిపి అభిమాని అని, లోకేశ్‌కు ఆప్తుడని, మరోటని తెగ రాశారు. విచారణ ఎన్‌ఐఏకు అప్పగించారు. చివరకు ఏం తేల్చారు? ఎవరి ప్రమేయమూ లేదన్నారు. అంటే ఏ ఆధారాలూ లేకుండా ఆరోపించినట్లేగా! పింక్ డైమండ్ విషయమూ అంతే, తిరుమలలో లంకెబిందెల కోసం వంటగది తవ్వించేశారని గగ్గోలు పెట్టేశారు. అధికారంలోకి వచ్చాక రికార్డులన్నీ వాళ్ల చేతిలోకి వచ్చాక, కిమ్మనటం లేదు. ప్రతిపక్షంలో ఉండగా బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేసినట్లేగా!

టిడిపి వారు కోడికత్తి విషయంలో జగనే తనపై చేయించుకున్నా డన్నారు. కోడికత్తి జగన్ అంటూ బాబు దగ్గర్నుంచి వెకసెక్కాలాడారు. ఏదీ? ఆధారం ఏది? టిడిపి అనుకూల మీడియా వివేకా హత్య కేసులో యిప్పుడు అవినాశే చేయించాడని, అతను జగన్ ఆత్మీయుడు కాబట్టి తద్వారా జగనే బాధ్యుడని, తీర్మానించేసి, తీర్పులిచ్చేసి, ఆ తీర్పు ప్రకారం కోర్టులో, సిబిఐలో పనులు జరగటం లేదని కోపగించు కుంటున్నారు. అవినాశ్ పాత్రపై వేరే వ్యాసంలో రాస్తాను. ప్రస్తుతానికి నొక్కి చెప్పదలచు కున్నదేమిటంటే ఒక దారుణ హత్యను అందరూ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించు కుంటున్నారు తప్ప సత్యాన్ని శోధించాలన్న ఉద్దేశం లేదెవరికీ.

జగన్ ఎందుకు చేయించాడు? మోటివ్ ఏమిటి అని అడిగితే ‘సింపతీ కోసం..’ అనేస్తున్నారు సింపుల్‌గా. ఈ సింపతీ వల్లే జగన్ నెగ్గాడని కొత్త పల్లవి అందుకున్నారు. మొన్నటిదాకా ‘ఒక్క ఛాన్స్..’ అంటూ ప్రాధేయపడడం వలన జనం కరుణించారని, యిప్పుడు నాలుక కరుచుకుంటున్నారనీ చెప్తూ వచ్చారు. తమ అధ్వాన్న పరిపాలనే జగన్‌ను గద్దెపై కూర్చోబెట్టిందని మాత్రం ఛస్తే ఒప్పుకోరు. ఇలా తడవకో కారణం వెతుకుతారు. అయినా సింపతీ రావడానికి వివేకా ఏమైనా పెద్ద లీడరా? చావుకి రెండేళ్ల ముందు ఎమ్మెల్సీగా పోటీ చేసి కూడా ఓడిపోయాడు. జగన్‌తో విభేదించి కాంగ్రెసులో ఉండిపోయినప్పుడు తెలుగు మీడియా ఆయన సౌజన్యమూర్తి, లక్ష్మణుడు.. అంటూ ఏమేమో రాసేసింది కానీ ఆయన గ్రంథసాంగుడని, సెటిల్‌మెంట్ గ్యాంగ్ లీడరని తాజా వార్తలు చెపుతున్నాయి.

ఇవి దూరంగా ఉన్న మనకు తెలియకపోవచ్చు కానీ లోకల్ వాళ్లకి తెలుసు కదా! పోనీ ఆయన పోతే ఆ అసెంబ్లీ స్థానంలో వాళ్లమ్మాయి సునీత నిలబడితే నెగ్గేదేమో! మధ్యలో జగన్‌కు ఎందుకు వస్తుంది సింపతీ? వైయస్ పోయాక ఆ కుటుంబానికి వివేకాకు పొసగకనే కదా, వివేకా వదినగారిపై పోటీ చేసినది! పైగా జగన్, శర్మిల బాబాయి మీద ఎగిరెగిరి పడ్డారని, జగన్ చెంపదెబ్బ కూడా కొట్టాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో వివేకా పోతే జగన్‌కు ఓట్లెందుకు పడతాయి? సత్యశోధన చేయాలి అని రాశాను కానీ పేరున్న కుటుంబాలలో యిలాటివి జరిగితే నిజాలు బయటకు రావు. డబ్బున్నవాళ్లమ్మాయి లేచిపోతే చదువుల కోసం విదేశాలకు వెళ్లిందంటారు. కొడుకు తాగేసి కారుని ఎవరికో గుద్దేసి చంపేస్తే, డ్రైవరు ముందుకు వచ్చి తప్పు ఒప్పుకుంటాడు.

రాజకీయ కుటుంబాలలో కేసైతే సిబిఐ లేదా పోలీసులు లేదా కావాలని తప్పులు చేస్తారు. ఆధారాలు సేకరించరు. సేకరించిన వాటిని కోర్టులో ప్రవేశపెట్టరు. డిఫెన్స్ వాళ్లు రంధ్రాన్వేషణ చేయడానికి అవకాశం కల్పిస్తారు. కోర్టుని కన్విన్స్ చేయలేరు, రేదర్ చేయరు. కోర్టు కేసు కొట్టేస్తుంది. ఆధారాలు చాలవంటుంది. విచారణ మళ్లీ చేయండంటుంది. ఆ పాటికి ప్రజల ఆసక్తి చచ్చుబడి ఉంటుంది. సిబిఐ కొత్త కేసులు చూస్తున్నాం, పాతవాటికి టైము, సిబ్బంది లేదంటుంది. మరీ కొట్టవచ్చినట్టున్న కేసుంటే, ఏ కోన్‌కిస్కాయికో డబ్బిచ్చి నేరం ఒప్పేసుకోమంటారు. రెండేళ్లు పోయాక రిపబ్లిక్ దినోత్సవం నాడు వదిలేస్తారు. బిహార్‌లో చూడండి, తెలుగు ఐఏఎస్ అధికారిని ఘోరంగా చంపించినవాణ్ని నిన్ననే ‘నీతీ’శ్ ప్రభుత్వం జైలు రూల్సు మార్చి మరీ వదిలేసింది!

ఇప్పుడు వివేకా యింట్లో ఏం జరిగిందో తెలుసుకుందామని ఉబలాట పడేవారు, నాడు బాలకృష్ణ యింట్లో ఏం జరిగిందో తెలుసుకోగలిగారా? తుపాకీ గుండు తిన్నవాడే ‘అబ్బే, మేం దొంగాపోలీసు ఆటాడుకున్నాం’ అంటే పోలీసులేం చేయగలుగుతారు? చేతులెత్తి మొక్కాల్సిన వ్యక్తిత్వం గల పేరు మోసిన డాక్టర్లే అనుమానితుడి చిత్తస్వాస్థ్యత గురించి అనుకూలమైన సర్టిఫికెట్లు యిచ్చేస్తే కేసు ముందుకెలా నడుస్తుంది? కేసు కోర్టు దాకా వెళ్లేసరికి వాచ్‌మన్ కుటుంబాన్ని ప్రలోభపెట్టో, బెదిరించో సాక్ష్యం చెప్పనీయకుండా చేయవచ్చు. కుటుంబాన్నే వేరే రాష్ట్రానికో, దేశానికో తరలించేయవచ్చు. నిజం బయటకు వచ్చి, శిక్ష పడడమనేది జరగనే జరగదు.

ఇవన్నీ వైయస్‌కు తెలుసు. ఆయన ఎన్టీయార్ కుటుంబీకుల అభ్యర్థన మేరకు బాలకృష్ణను కాపాడేడు అనేది ఔదార్యమో, చట్టం తన పని చేసుకోకుండా అడ్డం పడడమో కాదు. ఆయన ప్రాక్టికల్‌గా ఆలోచించాడు.  ఈ కేసు కోర్టులో ఎలాగూ నిలబడదు. కేసు నడిపినంతకాలం ‘కక్ష సాధిస్తున్నాడు’ అనే మాట పడాలి, దానివలన చెడ్డపేరు తప్ప ప్రయోజనం ఆవగింజంతైనా లేదు. అందుకే లైట్ తీస్కోండి అని పోలీసులకు చెప్పి ఉండవచ్చు. కేసు ఎలా ముగిసిందో నాతో సహా చాలా మందికి గుర్తు లేదు. ఇప్పుడీ కేసులో జగన్‌కు నిజాలు బయటకు రావడం యిష్టం లేదని మాత్రం మనం నమ్మవచ్చు. ముఖ్యమంత్రి హోదా వచ్చాక కూడా కేసును నీరుగార్చిన విధానం చూశాం. దానికి కారణం ఏమిటి అనేది అతనే చెప్పాలి. తనే చంపించాడు కాబట్టి అంటే దానికి తగ్గ కారణాలు కనబడటం లేదు.

పోనీ అవినాశ్ చంపాడు కాబట్టి రక్షించడానికి చూస్తున్నాడు అందామన్నా.. ఒక్క ఎంపీ గురించి, తన ప్రతిష్ఠను, యిమేజిని పాడు చేసుకుంటాడా? ఎంతైనా రాజకీయజీవి కదా! ఇప్పటిదాకా బయటకు వచ్చిన సంగతుల బట్టి చూసినా అవినాశ్‌పై కేసు ఎలాగూ నిలబడేట్లు లేదు. క్రిమినల్ కేసులో బెనిఫిట్ ఆఫ్ డౌట్ నిందితుడి పక్షాన ఉంటుంది. పోలీసులు ప్రత్యామ్నాయాలన్నిటిన్నీ పరామర్శించి, అంటే యితను కాక వేరెవరు చేసి ఉంటారు అనే కోణంలో తరచి చూసి, ఫలానా వాళ్లకు మోటివ్ లేదు, ఫలానావాళ్లకు అవకాశం లేదు, ఫలానావాళ్లు బెనిఫిషియరీ కాదు.. యిలా నేతినేతి అంటూ అందర్నీ కొట్టేసి, యితనికే అవన్నీ ఉన్నాయి అని నిర్ద్వంద్వంగా, సంశయరహితంగా, ఆధారాలతో రుజువు చేయగలగాలి. ఈ కేసు విషయంలో అది జరిగే కనబడటం లేదు. ఇక అలాటప్పుడు కొన్నాళ్లు కేసు నడిస్తే మాత్రం జగన్‌కు వచ్చే ప్రమాదం ఏముంది?

సిబిఐ పద్ధతి చూస్తే అదేదో సినిమా డైలాగులో ‘ఒక వైపే చూడు, మరో వైపు చూడకు..’ అని ఎవరో చెప్పినట్లు ప్రవర్తిస్తోంది. ఈ విషయం మనకే కనబడుతోంది. అవన్నీ ‘షమీమ్ కోణం..’ అనే ఆర్టికల్‌లో రాస్తాను. అన్ని కోణాల్లోంచి చూసేశాం, చివరకు యీ కన్‌క్లూజన్‌కి వచ్చాం అని డిఫెండ్ చేసుకోవలసిన పరిస్థితిలో ఉంది సిబిఐ. ఇవాళ అవినాశ్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ కొన్ని అంశాలు లేవనెత్తాడు. ఇవన్నీ యిప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు? దస్తగిరి అప్రూవర్‌గా మారడం నీకు అభ్యంతరమైతే సుప్రీం కోర్టుకి ఎందుకు చెప్పలేదు? అని టీవీ పానెలిస్టులు అడగగలరు. కానీ కోర్టు అడగదు. మన న్యాయప్రక్రియ అలాటిది. కేసును సాగదీయ దలచుకుంటే దశాబ్దాలు సాగదీయవచ్చు. ప్రతి చిన్నదానికి మీకు జ్యురిస్‌డిక్షన్ లేదు అంటూ కేసులు వేస్తూ, ముందస్తు బెయిల్ కావాలని, రెగ్యులర్ బెయిల్ కావాలనీ, దాన్ని పొడిగించాలని, ఆరోగ్యం బాగా లేదని, సిబిఐ మీద నమ్మకం లేదని.. యిలా కోర్టుకి వెళుతూనే ఉండవచ్చు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు చూడండి రామోజీ గారు దశాబ్దంన్నరగా సాగదీస్తున్నారు కదా.

ఈ కేసులో జగన్, అవినాశ్ బృందానికి కేసు తేలాలని లేదు. 2019 ఎన్నికలకు ముందు జగన్ చేయాల్సిన యాగీ చేసేసి, టిడిపికి బురద పూసేశాడు. దానివలన రాజకీయలాభం ఏ మేరకు పొందాడో స్పష్టంగా చెప్పలేం. హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేయించారో తెలిసే ఉంటుంది. వాళ్లను బయటపెట్టి బావుకునేది లేదనుకుంటూ విచారణను సాగదీశారు. సునీత కూడా మొదట్లో ఊరుకున్నారు కానీ తర్వాత పట్టుబట్టి కథను యింతదాకా తీసుకుని వచ్చారు. ఇప్పుడు కొన్ని కోణాల్లో సమాధానం చెప్పరావలసి వస్తే ఆవిడా రాబోయే రోజుల్లో సాఫ్ట్ పెడల్ చేయవచ్చు. తవ్విన కొద్దీ వివేకా వ్యక్తిత్వంలో కొత్త కోణాలు బయటకు రావడం మొదలెడితే వీళ్లందరూ యిబ్బందిపడి మొత్తం గప్‌చుప్ అయిపోవచ్చు. సిబిఐ అటకెక్కించే ఫైళ్లలో యిదీ ఒకటి కావచ్చు. ఇలాగే జరుగుతుందని నేను అనటం లేదు. ‘ఇలా అయితే మాత్రం ఆశ్చర్యపడకండి, మీ ఆసక్తి హరించే లోపున నిజాలు బయటకు వచ్చేస్తాయని ఆశ పెట్టుకోకండి’ అని సలహా యిస్తున్నానంతే! మరి కొన్ని విషయాలు ‘‘అవినాశ్ పాత్ర ఎంత?’’ అనే వ్యాసంలో చర్చిస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?