ఏదో ఒకటి మాట్లాడేశాం.. మీడియాలో ప్లేస్ కొట్టేశాం.. అన్న కక్కుర్తి రాజకీయ నాయకుల్లో ఎక్కువైపోయింది. పబ్లిసిటీ కోసం ఏ గడ్డి తినడానికైనా రెడీ.. అంటున్నారు కొందరు రాజకీయ నాయకులు. అందరూ కాకపోయినా, పబ్లిసిటీనే రాజకీయాల్లో పరమార్ధం.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు చాలామంది.
పిల్లల్ని కనడంపైనా, మహిళల వస్త్రధారణపైనా, రేప్లపైనా.. ఎవరికి తోచిన రీతిలో వారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియా అటెన్షన్‌ని సంపాదిస్తున్నారు. ఇలాంటివారిని మీడియా పట్టించుకోవడం మానేస్తే తప్ప, పబ్లిసిటీ పిచ్చోళ్ళ సంఖ్య తగ్గదేమో రాజకీయాల్లో.
అసలు విషయానికొస్తే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. అదీ మదర్ థెరీసా గురించి. ఎక్కడో విదేశాల్లో పుట్టి, సేవా మార్గంలో పయనించి, భారతదేశంలోని కోల్‌కతాలో స్థిరపడి, అనారోగ్యంతో బాధపడ్తున్నవారిని చేరదీసి, సేవలు చేసిన ‘తల్లి’ థెరీసా. అలాంటి థెరీసా, మత మార్పిడులను ప్రోత్సహించారనీ, ఆ దృష్టితోనే ఆమె సేవా రంగాన్ని ఎంచుకున్నారని మోహన్ భగవత్ ఎద్దేవా చేశారు. మత మార్పిడుల అంశం పక్కన పెడితే, ఆమె చేసిన సేవ మాత్రం ప్రశంసించదగ్గదని అంటున్నారాయన.
మదర్ థెరీసా ఎవరికి సేవలు చేశారు.? అన్న విషయం ఒక్కసారి ఆలోచించుకుని వుంటే మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేసి వుండేవారు కాదు. రాయడానికి వీల్లేనంత దయనీయ స్థితిలో రోగంతో బాధపడ్తున్నవారిని అక్కునచేర్చుకున్న ‘దేవత’ మదర్ థెరీసా. పట్టుకుంటే ఆ రోగం తమకెక్కడ అంటుకుంటుందోనని కుటుంబ సభ్యులు రోడ్డున పడేసిన అభాగ్యులు, మదర్ థెరీసా పుణ్యమా అని కోలుకున్నారు. ఇక బతికే అవకాశం లేదని తెలిసీ, చివరి రోజుల్లో మదర్ థెరీసా సపర్యలతో బాధల్ని మర్చిపోయారు కొందరు అభాగ్యులు.
ప్రపంచానికే ‘సేవ’కు అర్థం ఏంటో చాటి చెప్పిన మదర్ థెరీసాని విమర్శించాలనే ఆలోచనే జుగుప్సాకరంగా అన్పిస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చింది గనుక, తామేం మాట్లాడినా చెల్లిపోతుందని ఆర్ఎస్ఎస్ అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. బీజేపీ తక్షణం ఈ విషయమై స్పందిస్తే మంచిది.