గోడ్సే వాదన – కాంగ్రెసు నాయకులందరూ జైల్లో వుండగా కేంద్ర శాసనసభలోని కాంగ్రెసు పక్షానికి నాయకుడుగా వున్న బూలాభాయ్ దేశాయ్, ముస్లిం లీగు నాయకుడు లియాకత్ ఆలీఖాన్‌తో కలిసి సిమ్లాలో 1945లో సమావేశం జరిపారు. వైస్రాయి ఎగ్జిక్యూటివ్‌లో చెరి 5 గురు హిందూ, ముస్లిము సభ్యులు వుండాలని, మైనారిటీలకోసం మరో యిద్దరు సభ్యులుండాలన్న ప్రతిపాదనకు దేశాయ్ సరేనన్నారు. జనాభాలో 25% మాత్రమే వున్న ముస్లిములకు కమిటీలో హిందువులతో సమాన ప్రాతినిథ్యం యివ్వడానికి గాంధీ సమ్మతించడం చేతనే యిది జరిగింది.
(ఈ ప్రతిపాదన వాస్తవమే కానీ యిది ఆచరణలోకి రాలేదు. ముస్లిం లీగు ద్వారా కాంగ్రెసును కట్టడి చేయడానికి, యిద్దరు మైనారిటీ సభ్యుల ద్వారా డామినేట్ చేయడానికి బ్రిటన్ యీ ప్రతిపాదన చేసింది. గతిలేక కాంగ్రెసు సరేనంది. ముస్లింల తరఫున వుండే సభ్యుల్లో ముస్లిం లీగు పార్టీకి చెందనివారు కూడా వుంటారని ఆశపడింది. కానీ జిన్నా ఒక మెలిక పెట్టారు. ఆ ఐదుగురు ముస్లిం సభ్యులు తను చెప్పిన వారే ఉండాలన్నాడు. జిన్నా నాయకుడిగా ఉన్న ముస్లిం లీగ్ సింధ్, బెంగాల్, వాయువ్య ప్రాంతాలతో బాటు హిందువులు ఎక్కువగా ఉన్న అస్సాంలో కూడా గణనీయమైన పార్టీగా ఉన్నమాట నిజమే. కానీ పెద్ద రాష్ట్రమైన పంజాబ్‌లో అధికారంలో ఉన్నది ముస్లిం యూనియనిస్ట్ పార్టీ అనే వేరొక ముస్లిం పార్టీ! వారిని తీసుకోకూడదని జిన్నా పట్టుదల. వాళ్లను విస్మరించి జిన్నా షరతును అంగీకరించడం వేవెల్ వల్ల కాలేదు. క్రిప్స్ ప్రతిపాదనను అంగీకరించడం వల్ల జిన్నాకు బ్రిటన్‌లో సానుభూతిపరులు చాలామంది ఏర్పడ్డారు. అందువల్ల ఆయనను తోసిరాజనడమూ సాధ్యం కాదు. ఏతావాతా సిమ్లా సమావేశం విఫలమైంది. ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే ఉంది – వ్యా.)
ఈ విధంగా భారత స్వాతంత్య్ర సమస్య ఎన్నాళ్లు నడిచేదో కానీ ఇంగ్లండులో ఒక చమత్కారం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండుకు విజయాన్ని సంపాదించి పెట్టిన చర్చిలే జులై 1945లో జరిగే ఎన్నికలలో గెలుస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఇంగ్లండు ప్రజలు లేబరు పార్టీకి పట్టం కట్టారు. భారతదేశానికి స్వాతంత్య్రం యివ్వాలని భావించే అట్లీ 1945 జులైలో ప్రధానమంత్రి అయ్యారు. స్టేటు సెక్రటరీ పెథిక్ లారెన్సు యిండియాకు వచ్చి స్వాతంత్య్రం గురించి చర్చించారు. ముస్లిములకు ప్రత్యేక దేశం ఉండాలని సమ్మతించారాయన. ఆయన ప్రతిపాదనలను జిన్నా హర్షించారు కానీ కాంగ్రెసు సమ్మతించలేదు. ఇండియన్ కేంద్ర, ప్రాంతీయ కౌన్సిళ్లకు ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీకి బలముందో తేలిపోయి, ఎవరి మాట మన్నించాలో తెలుస్తుందని బ్రిటన్ అనుకుంది. 1946లో ఎన్నికలు జరిపితే జనరల్ సీట్లలో కాంగ్రెసు గెలిచింది, ముస్లిము సీట్లలో ముస్లిం లీగు గెలిచింది. అంటే యిద్దరితోనూ సంప్రదించి తీరాలని అర్థమై, 1946 మార్చిలో ముగ్గురు కాబినెట్ మంత్రులతో బ్రిటిషు కాబినెట్ మిషన్ ఇండియాకు వచ్చి రెండు పార్టీలతో చర్చించి మేలో తమ ప్రతిపాదన వెల్లడించారు.
ఫెడరల్ ప్రభుత్వం వుండాలని, దేశాన్ని మూడు భాగాలుగా పాలించాలని, ఒక దానిలో పంజాబ్, సింధ్ వగైరాలు, మరో దానిలో బెంగాల్, అసాం, మూడో దానిలో తక్కిన ప్రాంతాలన్నీ వుంటాయని అన్నారు. ఎవరి రాజ్యాంగం వారు ఏర్పరచుకోవచ్చని, అధికార మార్పిడి జరిగేవరకు వివిధ పక్షాల సభ్యులతో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడాలని చెప్పారు. పాకిస్తాన్ లక్ష్యం వదిలిపెట్టకుండానే యీ లోపుగా మధ్యంతర ప్రభుత్వంలో చేరతానన్నాడు జిన్నా. కాంగ్రెసు రాజ్యాంగ నిర్మాణంలో పాలు పంచుకుంటాను కానీ ప్రభుత్వంలో చేరనంది. కాంగ్రెసు చేరకపోయినా వైస్రాయి తాననుకున్న ప్రభుత్వం ఏర్పరచాలని జిన్నా కోరాడు. వాళ్లు చేరకపోతే ప్రభుత్వం ఏర్పరచనన్నాడు వైస్రాయి. 'అయితే నేను యింతకు ముందు యిచ్చిన సమ్మతిని వాపస్ తీసుకుంటున్నాను' అన్నాడు జిన్నా. దాంతో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పరచి దానిలో ముస్లిం లీగు సభ్యులకు చోటు లేకుండా చేశాడు. కాంగ్రెసు వల్లనే యిలా జరిగిందని ఆగ్రహించిన జిన్నా వారికి బుద్ధి చెప్పడానికి హింసామార్గం పట్టాడు. 1946 ఆగస్టు 16ను 'ప్రత్యక్ష చర్య' దినంగా ప్రకటించాడు. ఆ రోజు దేశమంతా ముస్లిములు స్వైర విహారం చేసారు. అల్లర్లు, దోపిడీలు, రక్తపాతం జరిగాయి. హిందువులు, ముస్లిములు ఒకరినొకరు చంపుకున్నారు. నరుకుకున్నారు. వైస్రాయ్ వీటిని అదుపు చేయలేదు. తాము వెళ్లిపోతే ఇండియా యీ విధంగా కుక్కలు చింపిన విస్తరిలా అయిపోతుందని ప్రపంచానికి చూపదలచిన బ్రిటిషు అధికారులు యీ కాండను జరగనిచ్చారు. ఇంత జరిగాక జిన్నా ఇచ్చిన ప్రకటన ఏమిటంటే – 'భారతదేశాన్ని నిలువునా చీలుస్తాం, వీలుకాకపోతే నాశనం చేస్తాం'.
దీనిపై గోడ్సే వాదన – 'నిజానికి కాంగ్రెసు ఐక్యభారతదేశం వైపే వుండింది, కాన అది తన నమ్మకంపై నిష్కర్షగా వుండలేదు. దానికి దృఢనిశ్చయం లోపించింది. అవతల జిన్నా విభజన కోరుతున్నాడు. పరస్పరవిరుద్ధమైన యీ రెండు కోర్కెలకు నడుమ ఏకాభిప్రాయం చేకూర్చడం అసంభవమని కాబినెట్ మిషన్ అభిప్రాయపడింది. రెండుపక్షాలతో నామ్‌కేవాస్తే చర్చలు జరిపి చివరకు ఒక ప్రతిపాదన చేసి దేశ ఐక్యతను బలపరుస్తూనే పాకిస్తాన్‌ను పెరటిదోవ ద్వారా ప్రవేశపెట్టింది. కాంగ్రెసు ఆ పథకాన్ని అంగీకరించింది కానీ ప్రభుత్వంలో చేరడానికి అంగీకరించలేదు. బ్రిటిషు ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని నిందించి జిన్నా రక్తకాండకు దిగాడు. బ్రిటిషు వారు ఏర్పరచిన మిశ్రమ ప్రభుత్వం పనిచేయకుండా వుండడానికి, దొంగ దెబ్బ కొట్టడానికి 50% ప్రాతినిథ్యం కల ముస్లిం లీగు తన చేయగలిగినదంతా చేసింది. తర్వాతి సంవత్సరంలో కత్తి మెడమీద పెట్టి బెదిరించినందున కాంగ్రెసు జిన్నాకు పూర్తిగా లొంగిపోయి పాకిస్తాన్‌కు అంగీకరించింది. ఇదీ 30 సంవత్సరాలు అడ్డులేని నియంతృత్వంతో గాంధీ సాధించినది!
(గోడ్సే కాంగ్రెసు నిస్సహాయత స్థితిని తన మాటల్లోనే చెపుతూనే గాంధీని తప్పుపడుతున్నాడు. అదీ తమాషా! బెంగాల్, పంజాబ్‌లలో జరిగిన హింసాకాండ చూసాక గాంధీ తప్ప ఇతర నాయకులందరికీ విభజన అనివార్యమని అర్థమైపోయింది. జిన్నాతో కలిసి వుండడం ఎంత కష్టమో కాంగ్రెసు నాయకులకు ప్రత్యక్షానుభవమైంది. కాంగ్రెసు, లీగ్ కలిసి ఉన్న చట్టసభపై బ్రిటీషు అజమాయిషీ గురించి జూలై 1946లో ఎవరో తనని అడిగినపుడు నెహ్రూ, 'కాంగ్రెస్, లీగ్‌లకు దేనిలోనూ సామ్యం లేదని, చట్టసభలో కూర్చోడంలో మాత్రమే ఏకీభవించాయని' అన్నాడు. నెహ్రూ వ్యాఖ్యలను జిన్నా తప్పుబట్టి, ఆ సాకుచూపి చట్టసభ నుండి వైదొలగాడు. ఇలా 1946-47లలో కేంద్రంలో నడిచిన మధ్యంతర ప్రభుత్వం కాంగ్రెసు, లీగ్ కలిసి మెలసి ఉండలేవన్న సత్యాన్ని చాటిచెప్పింది. లీగ్ అడిగిన పాకిస్తాన్ ఇచ్చిపడేస్తే మిగిలిన దానినైనా మనకిష్టమైన రీతిలో పాలించుకోవచ్చనే ఆలోచన కాంగ్రెసు వారికి కలిగింది. లీగ్ చేపట్టిన 'ప్రత్యక్ష చర్య' కారణంగా 1946లో మతకలహాలు చెలరేగినప్పుడు ప్రభుత్వం నిస్సహాయురాలై పోయింది. ఇండియా కర్మానికి ఇండియాను వదిలేసి ఒకదాని తర్వాత మరొక ప్రాంతాన్ని ఖాళీ చేసుకుంటూ వెళిపోతే మంచిదని వైస్రాయి లండన్‌కు సలహా ఇచ్చేడు. అది మంచిది కాదని జూన్ 1948 నాటికి మొత్తమంతా ఒకేసారి ఒప్పచెప్పి వెళిపోదామని అట్లీ అన్నారు. మౌంట్‌బాటెన్‌ను పంపారు. కాంగ్రెసు ముందున్న సమస్య – విభజనా? వినాశనమా? పాకిస్తాన్‌కు అంగీకరించకపోతే దేశంలో అగ్ని చల్లారదని జిన్నా ఓ పక్క చెప్తున్నారు. రాజాజీ వంటి నాయకులు పాకిస్తాన్ ఇవ్వడమే మంచిదంటున్నారు. డా||ఆంబేడ్కర్ కూడా విభజన చేయమంటున్నారు. ఎందుకంటే కాంగ్రెసు పక్షపాతి అయిన జమైత్ ఉలేమా-ఇ-హింద్ విభజన వద్దంటోంది కానీ దానికి బదులుగా హిందువులతో సమానంగా చట్టసభలలో, మంత్రివర్గంలో, ఉద్యోగాలలో ప్రాతినిథ్యం ఉండేటట్లు రిజర్వేషను చేయమంటోంది. అదే జరిగితే షెడ్యూల్డ్ కులాలకు రావలసిన సౌకర్యాలన్నీ ముస్లిములు పట్టుకుపోతారని ఆయన భయం.
ఈ సమస్యపై కాంగ్రెసు ఓటింగు పెడితే 157 మంది విభజనను సమర్థించారు, 15 మంది వ్యతిరేకంగా ఓటు వేసారు. హిందూ-ముస్లిం కొట్లాటల వలన అంతర్యుద్ధం చెలరేగుతోందన్న భయంతో విభజనకు అంగీకరించడం తప్పని గాంధీ వాదించేరు. ఇలా అంగీకరిస్తే భవిష్యత్తులో తన కోరిక తీర్చుకుందామనుకున్న ప్రతీవాడు హింస జరిపితే చాలు, తన పని జరిగిపోతుందన్న భావానికి వస్తాడని ఆయన వాదం. ఎన్నో తరాలుగా ఉన్న హిందూ-ముస్లిము సహజీవనంలో 1946-47 ఒక తాత్కాలిక వెల్లువ అని ఆయన నచ్చచెప్పబోయాడు. 'ముందు శాంతి నెలకొననీయండి, తర్వాత పాకిస్తాన్ గురించి మాట్లాడదాం' అన్న గాంధీ సూచన లీగ్‌కు నచ్చలేదు. లీగ్‌కు కోపం తెప్పించే ధైర్యం ఇంగ్లీషు వారికి లేదు. విభజనను గాంధీ బహిరంగంగా వ్యతిరేకిస్తున్నా ఆయన వాయిస్ ఎవరూ వినలేదు. కాంగ్రెసు సమావేశంలో ఆయన వాదానికి 10% మందే మద్దతు పలికారని గమనించండి. దేశం విభజిస్తున్నామని ప్రకటిస్తే చాలు, గొడవలు వాటంతట అవే చల్లారతాయి అనుకున్నారు బ్రిటిషువారూ, తక్కిన భారతీయ నాయకులూ. అక్కడే అందరూ పొరబడ్డారు. ఇది వినాశనానికి దారి తీస్తుందని హెచ్చరించిన గాంధీని దారుణమారణకాండకు బాధ్యుణ్ని చేయడం గోడ్సే పొరబాటు. – వ్యా.) (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)