సరసిజ థియేటర్స్ అందించిన నాల్గవ రంగస్థల ప్రదర్శన, ద్రౌపది నాటకం.. డాలస్ తెలుగు నాటకాభిమానులని ఉర్రూతలూగించింది. Oct 6న అర్వింగ్ ఆర్ట్స్ సెంటర్లోని కార్పెంటర్ థియేటర్ లో మధ్యాహ్నం 4:30కి, మహర్నవమి పండుగ రోజున కన్నుల పండువగా రంగస్థలం మీద ద్రౌపదిని ఒక శక్తి స్వరూపిణిగా ఆవిష్కరించారు. రెండున్నర గంటల పాటూ సాగిన ఈ నాటక ప్రదర్శన, హాజరైన దాదాపు 700 మంది తెలుగు నాటకాభిమానులని మంత్రముగ్ధులని చేసి, ఆద్యంతమూ రక్తి కట్టించింది. ఈ నాటకం ద్వారా సరసిజ, “హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ” అన్న స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా, అనాథ పిల్లలకి తోడ్పాటుగా నిధుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని అర్వింగ్ నగర మేయర్ స్టాఫెర్ ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని, టెక్సాస్ హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్ కార్యాలయం నుంచి మ్యాట్ షహీన్ ప్రశంసాపత్రాన్ని సరసిజ థియేటర్స్ కి అందించి, భారత-అమెరికా దేశాల సాంస్కృతిక వారధి నిలుపుతున్నందుకు అభినందించారు.
ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి చిత్రా బెనర్జీ దివాకరుని గారు రాసిన సుప్రసిద్ధ ఆంగ్ల నవల Palace of Illusions ఆధారంగా ప్రముఖ తెలుగు రచయిత్రి, శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు నాటకానువాదం చేసిన పౌరాణిక నాటకం ద్రౌపది. మహాభారత కథని ద్రౌపది ఆత్మకథగా, తన అంతరంగ రణరంగ సంఘర్షణల సారంగా, తన మనసులో ఉన్న ఎన్నో దువిధలకి, సమాధానం లేని, చరిత్ర ఎప్పటికీ జవాబు చెప్పలేని ప్రశ్నలని నిక్కచ్చిగా అడిగి, ప్రేక్షకులందరికీ తెలిసిన భారతమైనా ద్రౌపది కథనం ఎలా సాగుతుంది అన్న ఉత్కంఠని రగిలించే రీతిలో, శ్రీకృష్ణ-కృష్ణాల మధ్యనున్న ఆత్మీయబంధం, కృష్ణ పరమాత్మలోని స్తీత్వానికి ప్రతిరూపంగా ద్రౌపదిని మలిచి, ఇంతకు మునుపెన్నడూ చూడని, ఎవరూ చూపించని కోణాలలో, ద్రౌపది జననం నుంచి స్వర్గారోహణం దాకా ఈ నాటకం సాగింది. ఆకర్షణీయమైన వేదికాలంకరణ,వస్త్రాభరణాలు, వేష ధారణ, అత్యంత మనోహరమైన మాటలతో, ఉద్వేగ భరితమైన సన్నివేశాలతో ఈ ద్రౌపది నాటకం, మునుపెన్నడూ చూడని దృశ్యకావ్యంలా వెలిసింది.
అగ్ని సంభూత అయిన ద్రౌపది జననం నుంచి మొదలు పెట్టి, ద్రోణ-ద్రుపద వైరం, ధృష్టద్యుమ్న-ద్రౌపదిల మధ్య అన్నా-చెల్లెల్ల అనుబంధం, ద్రౌపది జీవితంలో వ్యాస-భీష్ముల భూమిక, ద్రౌపది కళ్యాణం తద్వారా తనకెదురయ్యే ప్రశ్నలు, రాజసూయ-మయసభ దృశ్యాలు, దుష్టచతుష్టయాల కుట్రలు, ద్రౌపది వస్త్రాపహరణం, ధర్మ బద్ధమైన పాండవుల నిస్సహాయత, కీచక వధ,రాయబారం, కురుక్షేత్రంలో ఉపపాండవ మరణం ద్రౌపది కంఠ శోష, శ్రీకృష్ణ నిర్యాణం-ద్రౌపది నిర్వేదం, స్వర్గారోహణంలో ద్రౌపది శ్రీకృష్ణునిలో ఆత్మ స్వరూపయై కలిసిపోవడం – ఈ ఘట్టాలతో తెలుగు ప్రేక్షకులు ఇంతకు మునుపెన్నడూ ఏ కళారూపాలలో చూడని అంశాలని చూపింది.
ఉదయగిరి రాజేశ్వరి గారు దర్శకత్వ బాధ్యతలతో బాటూ, నాటక కార్యనిర్వహణని చేపట్టి, కీలకమైన ద్రౌపది పాత్ర పోషించారు. కార్యక్రమ ప్రణాళిక రచన, ఆర్థిక వనరుల సేకరణలో పోనంగి గోపాల్, రాయవరం విజయ భాస్కర్ సహకరించారు. ఈ నాటక ప్రదర్శనలో దాదాపు యాభై మంది కలిసి పనిచేశారు. ఔత్సాహిక నటీనటులు, సాంకేతిక నిపుణులు, సంగీత సాహిత్య కళాకారులు, అటు అమెరికాలోని పలుపట్టణాల నుంచి వచ్చి కలిసి పని చెయ్యడంతో బాటూ, తెలుగు రాష్ట్రాలనుంచి కూడా ఈ నాటకానికి కావలసిన అన్ని హంగులూ కుదర్చడానికి జట్టుగా పని చేశారు. నారుమంచి చంద్ర సహదర్శకత్వం, కూచి సాయి శంకర్ గారు చిత్రలేఖనం, ప్రభల శ్రీనివాస్ సంగీతం, ప్రశాంతి వేదికాలంకరణ (set design),వెన్నెలకంటి సాహిత్యం, విష్ణుభొట్ల శ్రీకృష్ణ గానం, ప్రముఖ కీబోర్డ్ నిపుణులు అయ్యప్ప గారు, వర్ధమాన సంగీత దర్శకురాలు గరికపాటి స్రవంతి నేపథ్య సంగీతం, నందుల శ్రీనివాస్ వేణుగానం, దీన దయాల్ సౌండ్ ఇంజనీర్, తూపురాని రవి, సుసర్ల ఫణీంద్ర సాంకేతిక సహకారంతో తెరవెనుక జట్టుగా నిలిచారు.
తెరముందు, శ్రీకృష్ణునిగా కర్రి బాల ముకుంద్, ద్రోణ-ధర్మరాజు పాత్రలలో శంకగిరి నారాయణ స్వామి, ద్రుపదుడిగా కరుణాకరం కృష్ణ, వేద వ్యాసునిగా గండికోట మధు, భీష్మునిగా చెరువు రామ్, విదురునిగా-పురోహితునిగా-ఆలేఖకునిగా కస్తూరి గౌతం, ధృష్టద్యుమ్నగా కామరాసు రవి, దుర్యోధనునిగా కవుతారపు రవి, దుశ్శాసనునిగా ఆదిభట్ల మహేష్, శకునిగా మామిడెన్న సందీప్, కర్ణునిగా మన్యాల ఆనంద్, అర్జునుడిగా జోస్యుల ప్రసాద్, భీమునిగా రాయవరం విజయ భాస్కర్, నకుల-సహదేవులుగా కోట కార్తీక్, నట్టువ పవన్, కుంతీ మాతగా జొన్నలగడ్డ భవాని, కీచకునిగా జలసూత్రం చంద్ర, రాజగురువు మరియు ప్రతీహారిగా బసాబత్తిన శ్రీనివాసులు (ఆర్.జే శ్రీ) నటించారు. ఇంకా యువకళాకారులు సాకేత్, యశస్విని, సంప్రీత్ బాల పాత్రలు ధరించారు. అంజన, మానస వస్త్రాలంకరణలో, వంశీ, వెంకటేశ్ వేదికాలంకరణలో చేతులు కలిపారు.
డాలస్ నగరంలోని తెలుగు ప్రేక్షకులకు ద్రౌపది నాటక ప్రదర్శన ఒక మరువ లేని, మరపురాని మధురానుభూతిని మిగిల్చింది. పలు పోషక దాతలు, దాతల సహకారంతో, సరసిజ వారి రంగస్థల నాటకం ద్రౌపది విజయవంతంగా ప్రదర్శన పూర్తి అయ్యింది అని, వారందరికీ సరసిజ అధ్యక్షురాలు ఉదయగిరి రాజేశ్వరి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.