ఒక పక్కన ప్రజల చిరకాల వాంఛ, ఇంకొక ప్రక్కన సమైక్య నాదంతో అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజించి ఒక ప్రాంతానికి అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. రక రకాల కమిటీలు వేసి తెలంగాణా ఇచ్చిన తరువాత పార్లమెంటు లో కేంద్ర ప్రభుత్వం ఒక పనికిమాలిన ప్రకటన చేస్తూ ఆంధ్ర నష్టాన్ని పుడ్చుతాం అని ప్రతిన బూనింది, ఇప్పుడు ప్రభుత్వం లోనికి వచ్చిన పెద్దలు కనీసం 10 సంవత్సరాలైనా ప్రత్యెక హోదా కల్పించాలని ఎలుగెత్తడం చూసాం. ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక ఆదాయం రమారమి 66 వేల కోట్ల రూపాయలు కాగ, మనకున్న అప్పుల మీద వడ్డీలు, ఉద్యోగస్తుల జీతాలు, ప్రజలకు సంక్షేమ పథకాలు జరగడానికి ఇంకా లోటు ఏర్పడుతుందని, దానిని పుడ్చుతామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఒక సంవత్సరం గడిచింది, ఇంతకీ మన లోటు పూడిందా? లేక వివిధ పథకాలకు నిధులు మళ్లింపు చూపించి, కేంద్రం మనకు జెల్ల కొట్టిందా?
విభజించండి అని చెప్పి, అప్పటి ప్రభుత్వానికి లేఖలు, సవాళ్లు విసిరి, న్యాయమైన వాటా కోరలేక సతమతమైన పార్టీలు ఒక వైపు, ప్రజలకోసం పరితపిస్తున్నట్టు పార్లమెంటు సాక్షిగా పోరాటం రక్తికట్టించడం చూసాము. అనుభవం వుందని గద్దెనెక్కిన నాయకులు, ప్రశ్నించడానికి నేనున్నా అని భరోసా ఇచ్చిన నాయకులు, మన రాష్ట్రం నుండి చక్రం తిప్పుతున్న పెద్దలు ఇంత అన్యాయం జరుగుతూవుంటే ఎందుకీ మౌనం? అన్ని విధాల ఆదుకుంటాం అన్న కేంద్రం ఇప్పుడు బీహార్, ఒరిస్సాలకు లింకు పెట్టడం సమంజసమా? ఆ రాష్ట్రాలేమైనా మన లాగ నష్ట పొయాయ! సుసంపన్నమైన రాష్ట్రాన్ని చిందరవందర చేసి చోద్యం చూడడం గర్హనీయం.
మన ఆర్ధిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా వుంటే ధనిక రాష్ట్రాలతో పొట్టే పడి ఫిట్మెంటులు, ప్రత్యెక విమానాలలో విదేశీ పర్యటనలు, మన లక్షల కోట్ల రాజధాని మ్యాపులు, ప్లానింగులు చూసి ఎందుకు లే వీళ్ళకు ప్రత్యెక హోదా అని ప్రధానమంత్రి కాని, కేంద్ర మంత్రులు కాని ఆ ఊసే మరచిపోయారు. ఊకదంపుడు పరిశీలనలు, ఉత్తుత్తి హామీలు అంతే, ఏ విధంగాను ఆదుకోలేదు. లోటు బడ్జెట్టు పూడ్చడం కాని, ప్రత్యెక రైల్ జోన్ కాని, రాజధానికి ఆర్థిక సాయం కాని ఒక్క్కటంటే ఒక్కటీ లేదు. అలాంటప్పుడు ఆ ప్రభుత్వం లో ఎందుకు వుండాలి? వుంటే వొత్తిడి పెట్టి సాధించాలి.
దేనికైనా సంకల్పం కావాలి, సాధించుకోవడానికి ఉపాయం, నిర్వహించే సత్తా కావాలి, ఇక్కడే మన అనుభవం ఉపయోగపడాలి, ఈ పదవులు అక్కర్లేదని బయటకు వచ్చి, అఖిల పక్ష మీటింగు పెట్టి మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి మిగతా పక్షాలను కలుపుకొని అసెంబ్లీ లో తీర్మానం చేసి, ప్రజా చైతన్యానికి నడుంబిగించాలి. ప్రజలు కూడా దూర దృష్టితో జరుగుతున్న అన్యాయానికి పరిష్కారం దొరికేంత వరకు విశ్రమించమని ముందు కదలాలి. ఉద్యోగస్తులు కలిసి రావాలి, సాంస్కృతిక, సాంఘిక, మేధావి, విద్యార్ధి లోకాలన్నీ ఒక్కటై ముందు రావాలి. ప్రజలు ఉద్యమాన్ని రాజకీయ నాయకులు నిర్మించాలి, అప్పుడు కాని మనకు న్యాయం జరుగదు. మా పదవులు మాకు కావాలి, వూరికే లిప్ సర్వీస్ కోసమని అడగడం కాదు, ప్రజలను భాగస్వామ్యం చేసి, ఉద్యమ నిర్మాణం చేయాలి. నిద్రపోతున్న, నిద్ర నటిస్తున్న నాయకులారా సమయం ఆసన్నమైంది, మేలుకోండి.
–రంగ