ఇన్ఫోసిస్.. అంటే ఒకప్పుడు దేశంలోని అగ్రగామిగా వెలుగొందుతోన్న ఐటీ సంస్థల్లో ఒకటి. అయితే ప్రస్తుతం ఇన్పోసిస్ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. ఇటీవలి కాలంలో చూసుకుంటే ఏ సంస్థలోనూ లేని విధంగా ఇన్ఫోసిస్ నుంచి పెద్దయెత్తున ‘మేనేజ్‌మెంట్’ విభాగం నుంచి ప్రముఖులు బయటకు వెళుతున్నారు. ఎందుకిలా.? అసలేం జరుగుతోంది.? ఇన్ఫోసిస్ తిరోగమనానికి కారణమేంటి.? అన్నదానిపై రకరకాల విశ్లేషణలు, వివిధ రకాలైన చర్చలు మీడియా, ఐటీ రంగాల్లో జరుగుతున్నాయి. కంపెనీ నుంచి బయటకి వస్తున్నవారు చెబుతోన్న విషయం ఒక్కటే.. మునుపటిలా ఇన్ఫోసిస్‌లో ఎదుగుదల చోటు చేసుకునే అవకాశం లేదని.
1981లో కేవలం ఏడుగురితో ప్రారంభమైన ఇన్ఫోసిస్ అంచెలంచెలుగా ఎదిగింది. దేశంలోనే ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటిగా అతి తక్కువ కాలంలో ఎదిగిన ఇన్ఫోసిస్, ఇప్పుడు కష్ట కాలంలో వుంది. పోటీ ప్రపంచంలో మిగతా సంస్థలకు ధీటుగా స్పందించకపోవడం, ఐటీ ఎగుమతుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం.. ఇవన్నీ ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ వేగాన్ని తగ్గించేస్తున్నాయి. అదే సమయంలో ప్రత్యర్థి కంపెనీలు దూసుకుపోతున్నాయి. సంస్థ తిరోగమనం నేపథ్యంలో ఇన్నాళ్ళూ కంపెనీని నమ్ముకున్న ఉద్యోగులూ వేరే కంపెనీల వైపు తొంగిచూస్తున్నారు.
‘ఇది క్లిష్టమైన సమయం.. అయినా తేరుకుంటాం.. పోటీ ప్రపంచంలో దూసుకుపోతాం..’ అని ఇన్ఫోసెస్ ప్రతినిథులు చెబుతున్నప్పటికీ, మారిన ట్రెండ్‌కి అనుగుణంగా తమను తాము మార్చుకోవడంలో ఇన్ఫోసిస్ వెనుకబడిపోయిందన్న వాదనలే ఎక్కువగా విన్పిస్తున్నాయి. ట్రెయినింగ్ విభాగం పటిష్టంగా వున్నా, కొత్తగా తమ సంస్థలో ట్రెయిన్ అయినవారిని సమర్థవంతంగా వినియోగించుకునే విషయంలో మేనేజ్‌మెంట్ ప్రదర్శిస్తున్న అలసత్వం కారణంగా ఇన్ఫోసిస్, ఐటీ రంగంలో దూసుకుపోతున్న మిగతా సంస్థలకు పోటీ ఇవ్వలేకపోతోందని ఇన్ఫోసిస్‌లో ఆరేళ్ళు పనిచేసిన ఓ వ్యక్తి (పేరు చెప్పడానికి ఇష్టపడటంలేదు) అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా అప్లికేషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాలపై ప్రత్యేకమైన దృష్టి పెడితే తప్ప ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇన్ఫోసిస్ మనుగడ సాధించలేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నా, ఆ దిశగా లోపాల్ని సరిదిద్దుకునేందుకు ఇన్ఫోసిస్ ప్రయత్నించడంలేదన్న అపవాదు వుంది.
‘‘పెద్ద సంఖ్యలో సీనియర్లు ఇన్ఫోసిస్‌ని వీడుతున్నారంటే ఆ సంస్థను మునిగిపోతున్న నావగానే పరిగణించాల్సి వస్తుంది. అదే సమయంలో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళితో ఆ లోటును పూడ్చుకోవచ్చు. ఆ పని చేయలేకపోతున్నందున మునిగిపోయే నావలో వుండటానికి ఎవరు ఇష్టపడ్తారు.?’’ ఇదీ ఇటీవలే ఆ సంస్థ నుంచి బయటకు వచ్చిన ఓ ఉద్యోగి వాదన.
ఇన్ఫోసిస్‌లో తాజా పరిణామాల కారణంగా, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన ‘వేతన పెంపు’ వ్యవహారంలోనూ లోటు కన్పిస్తోంది. మిగతా సంస్థలు తమ ఉత్పత్తుల్ని పెంచుకుంటూ, ఉద్యోగాలకు ప్రోత్సాహకాలు ఇస్తోంటే.. ఇన్ఫోసిస్‌లో మాత్రం ఉద్యోగుల ప్రోత్సాహకాలు ఇటీవలికాలంలో బాగా తగ్గిపోయాయి. తద్వారా ఉద్యోగులు వేరే సంస్థల్లో ఉద్యోగం కోసం వెళిపోతున్న పరిస్థితి కన్పిస్తోంది. వెరసి ప్రస్తుతం ఇన్ఫోసిస్ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందన్న మార్కెట్ వర్గాల అంచనాల నేపథ్యంలో అయినా సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోన్న పరిస్థితులపై ఇన్పోసిస్ యాజమాన్యం దృష్టిపెడితే మంచిదేమో.