తెలంగాణలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో కచ్చితంగా చెప్పటం లేదు. తెరాసకు అవకాశాలు ఎక్కువున్నాయంటున్నారు కానీ సొంతంగా చేస్తుందా, వేరే ఎవరి మద్దతైనా తీసుకుంటుందా అన్నది తేలలేదు. మోదీని సన్నాసి అన్నాక బిజెపి మద్దతు తీసుకోకపోవచ్చు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే గతంలో చేసినట్లు వాళ్లు తెరాసను చీలుస్తారేమోనన్న భయం వుంది. అందువలన మజ్లిస్ అయితే మంచిదని అనుకుంటున్నారట. మజ్లిస్ వద్ద కాంగ్రెస్ ఆల్‌రెడీ క్యూ కట్టి వుంది. స్నేహపూర్వకమైన పోటీ అంటూనే మజ్లిస్ తమకు ద్రోహం చేసిందని టి-కాంగ్రెస్ నాయకులు మొత్తుకున్నా పొన్నాల గతం మర్చిపోయి మజ్లిస్‌తో పొత్తు పెట్టుకుందాం అంటున్నారు. మజ్లిస్ ఎటూ తేల్చటం లేదు. ఒవైసీ కృష్ణుడిలా నిద్ర నటిస్తూ వుంటే దుర్యోధన, అర్జునుళ్లా కాంగ్రెస్, తెరాస ఒకళ్లు తల దగ్గర, మరొకళ్లు కాళ్ల దగ్గర వేచి వున్నారు. మే 16 తర్వాత గానీ శ్రీవారు నిద్ర లేవరట. లేచి ఎవరో ఒకరికి తల వూపవచ్చు. రాబోయే తెలంగాణ ప్రభుత్వంలో మజ్లిస్ ప్రముఖపాత్ర వహిస్తుందని సులభంగా వూహించవచ్చు. అదే జరిగితే ఉర్దూ ప్రాముఖ్యత పెంచాలని, తెలుగుతో సమానహోదా కల్పించాలని యిలాటి డిమాండ్లు తప్పక వస్తాయి. ఒవైసీ సీమాంధ్రులను లింగ్విస్టిక్ మైనారిటీలుగా గుర్తించాలని కూడా ఓ థలో డిమాండ్ చేశారు. నాకైతే దానిలో లాజిక్ అర్థం కాలేదు. సీమాంధ్రులు తెలుగు కాక వేరే భాష మాట్లాడతారా? భాష గురించి సరేగానీ, నిజాం నవాబుకి మహర్దశ పడుతుందని అనిపిస్తోంది నాకు. టాంక్‌బండ్‌పై కొన్ని విగ్రహాలకు స్థానచలనం తప్పదని కూడా…!
నన్నయ, తిక్కన, త్యాగయ్య వరకు సహిస్తారేమో, సంఘసంస్కర్తలైన రఘుపతి వెంకటరత్నం నాయుడు, గురజాడ వామపక్షీయుడైన శ్రీశ్రీ వాళ్లని స్పేర్ చేయవచ్చు. 'సి ఆర్ రెడ్డి, బళ్లారి రాఘవ, త్రిపురనేని రామస్వామి చౌదరి, ముట్నూరి కృష్ణారావు వంటి వారి కార్యక్షేత్రం ఆంధ్రయే కదా, వాళ్ల విగ్రహాలు వాళ్లని పట్టుకుని పొమ్మనమందాం, విగ్రహాలు పెట్టవలసిన మనవాళ్లు చాలామంది వున్నారు, వారికి యిక్కడ చోటు చాలవద్దా?' అని ఎవరైనా వాదించవచ్చు. కెబియార్ పార్కు పేరు మారుస్తామని కెసియార్ ప్రతిజ్ఞ చేశారు కదా, యిలాటివి పెద్ద విషయం కాదు. ఇప్పుడున్న విగ్రహాలకు తోడుగా కానీ, వారి స్థానంలో గాని వచ్చి చేరే విగ్రహాలలో ఏడో నిజాంది వుండవచ్చని నా అనుమానం. ఎందుకంటే మజ్లిస్ వాళ్ల కంటె ఎక్కువగా కెసియార్ నిజాంను కీర్తించారు. కెసియార్ పాటనే చాలామంది తెలంగాణ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో వినిపించారు. మామూలుగా అయితే చరిత్ర గురించి ఎవరూ పట్టించుకోరు. తెలంగాణ తీర్మానంపై చర్చ ధర్మమాని ఏడో నిజాం మంచిచెడ్డల గురించి శాసనసభ్యులు వాదోపవాదాలు చేసుకున్నారు. ఆయన ఉస్మానియా యూనివర్శిటీ, ఉస్మానియా ఆసుపత్రి కట్టించి విద్య, వైద్యం ప్రోత్సహించాడని ఒకరంటే, అంత మంచివాడైతే ఆయనకు వ్యతిరేకంగా సాయుధపోరాటం ఎందుకు చేశారట? అని మరొకరు అడిగారు. భగవద్గీత అనువాదానికి డబ్బిచ్చి, తిరుపతి గుడికి డబ్బులు పంపి, హిందువుల పట్ల ఆదరం చూపాడంటే ఒకరంటే, హిందువుల పట్ల వివక్షత చూపి ఇస్లాంలోకి మతమార్పిడులు ప్రోత్సహించాడని మరొకరు అన్నారు. ఇంతకీ ఆయన ఎలాటివాడు? ఎవరు నిజం చెపుతున్నారు? నిజాంల పాలన గురించి నేను వెబ్‌సైట్లో రాస్తున్న ''నిజాం కథలు'' సీరియల్‌లో అనేక వివరాలు యిస్తున్నాను. అవి చదివే ఓపిక లేనివారికి ఆయన గురించిన వాస్తవాలు క్లుప్తంగా యీ వ్యాసంలో యిస్తున్నాను.
సాయుధపోరాటం జరిపినది, పోలీసు చర్య ద్వారా పటేల్ గద్దె దింపినదీ ఏడో నిజాం ఉస్మాన్ ఆలీ ఖాన్‌ని. అతని తండ్రి, ఆరో నిజాం అయిన మహబూబ్ ఆలీ ఖాన్ (ఆయన విగ్రహం ప్రస్తుతం టాంక్‌బండ్‌పై వుంది) ఉదారుడు, నిదానస్తుడు, కుట్రలకు, కుతంత్రాలకు పోయేవాడు కాదు. రోజువారీ పనులను దివాన్లకు అప్పగించి విలాసంగా జీవితం గడిపేవాడు. హంగూ ఆర్భాటంతో ఆర్థికవ్యవస్థను కుప్పకూలే స్థితికి తెచ్చాడు. అతని వారసుడు ఉస్మాన్ నిరాడంబరుడు, నిర్మొహమాటి, సంశయజీవి. గోప్యత ఎక్కువ, కుట్రలు ప్రోత్సహించేవాడు. తన మాటే చెల్లాలన్న మంకుపట్టుంది. దివాన్లను నమ్మకుండా తరచుగా మార్చేవాడు. 1911లో తండ్రి మరణానంతరం ఉస్మాన్ రాజ్యానికి వచ్చాడు. 1949లో భారతసైన్యం చేతిలో ఓడిపోయి సింహాసనం వదిలిపెట్టాడు. ఈ 38 ఏళ్ల పాలనను రెండు భాగాలుగా విడగొట్టవచ్చు. తొలి 20 ఏళ్లు అతడు సంస్కరణలు చేసి, ప్రాజెక్టులు కట్టి కొన్ని మంచిపనులు చేశాడు. తనకు 45 వచ్చేసరికి అంటే 1931 నాటికి అతనిలో మార్పు వచ్చింది. సంస్కరణలు వెనకబడ్డాయి. తర్వాతి కాలంలో పెడదారి పట్టాడు. పరిపాలనలో ఆఖరి పుష్కరకాలం అధ్వాన్నంగానే నడిచిందని చెప్పాలి.
మొదటగా గమనించవలసినదేమిటంటే – నిజాం హైదరాబాదును తప్పించి తక్కిన ప్రాంతాలను పట్టించుకోలేదు. నీటి సౌకర్యం కోసం ప్రాజెక్టులు కట్టాడు తప్ప, పట్టణాలలో, గ్రామాల్లో నివాస సౌకర్యాలు వుండేవి కావు. అందుకని డబ్బున్నవాళ్లందరూ గ్రామాల్లో భూములున్నా హైదరాబాదులోనే కాపురం వుండేవారు. జిల్లాలలో చాలా పట్టణాలకు విద్యుత్ సౌకర్యం కూడా వుండేది కాదు. ఇక గ్రామీణ ప్రాంతాల మాట చెప్పనే అక్కరలేదు. నిజాంలు తమ కోసం, తన బంధువుల కోసం హైదరాబాదులో భవంతులు కట్టుకుంటే, ఆ నగరానికి డ్రైనేజి సౌకర్యం ఏర్పాటు చేస్తే, చెరువులు తవ్విస్తే వాటిని చూపి అభివృద్ధి అనుకోమంటారు కొందరు. దేశంలోని నగరాల్లో ఐదో స్థానంలో రాజధాని వుండి, అధమస్థానంలో తక్కిన వూళ్లు వుంటే అదేం గొప్ప? పాలన ఎలా వుందో తెలుసుకోవాలంటే తలసరి ఆదాయం ఎలా వుందో, రాజ్యం మొత్తంమీద విద్య, వైద్య సౌకర్యాలు ఎలా వున్నాయో, శాంతిభద్రతలు ఎలా వున్నాయో, ప్రజల హక్కులు ఏ మేరకు కాపాడబడ్డాయో, అధికారుల దాష్టీకంపై నియంత్రణ ఎలా వుందో… యిలాటివి చూసి అప్పుడు అంచనా వేయాలి. ఆ విధంగా చూస్తే పాలకుడిగా నిజాంకు చాలా తక్కువ మార్కులు పడతాయి. 1914లో నిజాం రాజ్యంలో అక్షరాస్యత 2.8% ! చదువుకున్నవాళ్లు తనకు ఎదురు తిరుగుతారన్న భయం కొద్దీ నగరంలో తప్ప వేరెక్కడా కాలేజీలు, హైస్కూళ్లు లేకుండా చేశాడు. గ్రామాలో బళ్లు వుండేవి కావు. పట్టణాలలో వున్నవి కూడా స్థానికుల మాతృభాషలో కాదు, ఉర్దూ మీడియంలో! 1956 నాటికి తెలంగాణలో వున్న మొత్తం స్కూళ్ల సంఖ్య ఒక్క గుంటూరు జిల్లాలోని స్కూళ్ల సంఖ్యకు సమానం కాదు. ఇక నిజాం రాజ్యం ఏ విధంగా గొప్పదనుకోవాలి?
పదవి చేపట్టగానే ఉస్మాన్ వెట్టి చాకిరీని, దేవదాసీ వ్యవస్థను నిషేధించాడు. సంపన్నులు ఆడే కోడిపందాలు, ఎడ్లపోటీలను కట్టడి చేశాడు. ప్రభుత్వోద్యోగుల కోసం జమీందారులు ఏర్పరచే గానాబజానాలను నిషేధించాడు. కోర్టు గదుల్లో పొగతాగడం నిషేధించి డ్రస్ కోడ్ విధించాడు. ఈ నిషేధాలన్నీ ప్రజలకోసమే. తను మాత్రం వ్యక్తిగత స్థాయిలో ఏ సుఖాన్నీ వదులుకోలేదు. అజంఠా, ఎల్లోరా గుహల్లోని చిత్రాలు కాపాడడానికి చర్యలు తీసుకున్నాడు. హైదరాబాదులో హైకోర్టు కట్టించాడు. మూసీనది పొడవునా కరకట్టలు పటిష్టపరిచాడు. మూసీపై డ్యామ్‌ను నిర్మించాడు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తవ్వించాడు. వీధులు విస్తరించాడు. సిమెంటు రోడ్లు వేశాడు. 1000 కెవి థర్మల్ స్టేషన్ నెలకొల్పారు. నగర అభివృద్ధికోసం ట్రస్టును ఏర్పరచాడు. తన రాజ్యాన్ని సముద్రం అవతలికి విస్తరించాలంటే సముద్రతీరానికి మార్గం వుండాలని యోచించిన నిజాం మడగావ్ రేవుకు చేరడానికై హైదరాబాదు నుండి గదగ్‌కు రైల్వే లైను వేయించాడు. 1935 నాటికి ఉస్మాన్‌కి తన రాజ్యంపై పూర్తి పట్టు లభించింది. రాజ్యపు ఆర్థికపరిస్థితి చాలా బావుంది. అనేక నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. నిజాం కట్టించిన ప్రాజెక్టుల్లో తలమానికమైన నిజామాబాద్‌లో నిజాం సాగర్, మహబూబ్‌నగర్‌లో కోయిల్ సాగర్, ఖమ్మంలో వైరా, పాలేరు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మద్రాసు రాష్ట్రంతో తుంగభద్ర జలాల పంపిణీపై 80 ఏళ్లగా నానుతున్న సమస్య ఒక కొలిక్కి వచ్చి సామరస్యంగా పరిష్కారమైంది. మరిన్ని ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఇలా రావడంతో వ్యవసాయంలో మార్గదర్శకం వహించాలని కోరుతూ కోస్తా ప్రజలను నిజాం ఆహ్వానించాడు. వారు వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ప్రజాధనాన్ని బ్రిటిషువారికి సమర్పించి, నిజాం పెద్ద పెద్ద బిరుదులు పొందాడు. వారి నుండి అమితమైన అధికారాలు పొంది పోనుపోను నియంతగా మారిపోయాడు. పన్నులపై వచ్చే ఆదాయంలో ఎంతభాగం నిజాం తీసుకోవచ్చు అనేదానిపై ఆంగ్లేయుల నియంత్రణ వుండేది. వారిని ఖుషామత్తు చేసి తన రాజభరణాన్ని 50 లక్షల రూపాయలకు పెంచుకున్నాడు నిజాం. అంతేకాదు, నజరానాల రూపంలో పదవులు ఆశించే జమీందార్ల నుండి, ఉద్యోగార్థుల నుండి బోల్డంత డబ్బు, కానుకలు వసూలు చేసేవాడు. నజరానా చెల్లించినవారు అసమర్థులైనా, అవినీతిపరులైనా సరే పదవులు యిచ్చేసేవాడు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తొలినాళ్లలో రాజ్యంలో పర్యటనలు చేసిన నిజాం తర్వాతి రోజుల్లో కానుకలు వసూలు చేసుకోవడానికి మాత్రం వెళ్లేవాడు. ఉస్మానియా యూనివర్శిటీ పెట్టాడు కానీ దానిలో బోధనా భాష ఏది? జనాభాలో 14% మాట్లాడే ఉర్దూ! తెలుగు (48%), మరాఠీ(26%) , కన్నడ (12%) భాషలకు దానిలో చోటు లేదు. ప్రజల్లో 85% మంది హిందువులు, 12% మంది ముస్లిములు వుంటే ఉద్యోగులలో అధికశాతం ముస్లిములే. వారు కూడా యితర ప్రాంతాల నుండి వచ్చినవారు. సిద్దిక్ దీన్‌దార్ అనే వ్యక్తి మతమార్పిడులను ప్రోత్సహిస్తూ ఉద్యమం నడిపాడు. సిద్దిక్ చర్యలకు తమకు సంబంధం లేదని ప్రభుత్వం ప్రకటించింది కానీ హిందువులు నమ్మలేదు. ఈ వివక్షతకు, మతమార్పిడికి వ్యతిరేకంగా ఆర్యసమాజ్ 1937 నుండి పోరాడసాగింది. అంతకుముందే 1926లో మజ్లిస్ ఏర్పడింది. నిజాం రాజ్యంలో స్థానిక ముస్లింల దుస్థితి బాపడానికి సంస్కరణవాదంతో ప్రారంభమైంది. కానీ దేశంలోని యితర ప్రాంతాల్లో ఎదుగుతున్న ముస్లిం లీగ్‌తో కలిసి పనిచేయసాగింది. ఇది కాక కాంగ్రెస్ కూడా యిక్కడ శాఖ ప్రారంభించింది. సివిల్ లిబర్టీస్ వారు కూడా పోరాడేవారు.
నిజాం వీళ్లందరినీ అణిచివేయడానికి చూశాడు. ఎలాటి ఉద్యమకారులైనా సరే అంతిమంగా తన అధికారానికి ముప్పుగా తయారవుతారని అతని భయం. వీళ్లని జైల్లో పెట్టాడు. పత్రికలు పెట్టనిచ్చేవాడు కాడు. సభలు జరపనిచ్చేవాడు కాడు. జమీందార్ల ద్వారా ప్రజలను అణచివేసేవాడు. వారి స్వేచ్ఛను హరించాడు. రాజ్యంలో మూడోవంతు జాగీర్ల రూపంలో వుంది. రాజ్యం యొక్క మొత్తం ఆదాయం 8 కోట్ల రూపాయలుంటే దానిలో 70% ఆదాయం 19 మంది జాగీర్దార్లకు వచ్చేది. జాగీర్దార్లు తమ సొంత ప్రాంతాలలో ప్రభుత్వ ప్రాంతాలతో పోలిస్తే పది రెట్ల పన్నులు వసూలు చేసేవాళ్లు, ప్రజలను పీడించేవారు. వెట్టి చాకిరీ మళ్లీ వచ్చేసింది. నజరానాలు ముడుతున్నందున నిజాం నోరెత్తేవాడు కాడు. 1940ల నుండి నిజాం ప్రజల్లోకి రావడం మానేశాడు. నల్లమందుకి అలవాటు పడ్డాడు. ఏ దివాన్‌ను సవ్యంగా పాలించనివ్వలేదు. ఇంతలో రెండవ ప్రపంచయుద్ధం వచ్చింది. బ్రిటన్‌కు విపరీతంగా సహాయం చేసి వాళ్ల ఆదరాన్ని మరింతగా పొందాడు. భారతదేశం నుండి విడిచిపెట్టే రోజు వస్తే తన రాజ్యం తనకు అప్పగించి వెళతారని నమ్మాడు. కాంగ్రెసు అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం వస్తుందని, అది నిజాం రాజ్యం పొలిమేరల్లోకి రాకుండా వుండాలని మజ్లిస్, నిజాం కోరుకున్నారు. తన రాజరికం కొనసాగడానికి నిజాం మజ్లిస్ చెప్పినట్టు ఆడసాగాడు. 1947లో బ్రిటిషువాళ్లు వెళ్లిపోయారు. తన రాజ్యం నెలకొల్పడానికి యిదే అదను అనుకున్నాడు నిజాం. పూర్వం తన ఏలుబడిలో వున్న మచిలీపట్నం, బీరారు అన్నిటినీ మళ్లీ సంపాదించాలనుకున్నాడు.
దివాన్ సి.పి.రామస్వామి అయ్యర్ ప్రోద్బలంతో ట్రావన్‌కూర్ సంస్థానం తాము స్వతంత్ర రాజ్యమని 1947 మే 9న ప్రకటించుకుంది. నిజాంకు అది ఆదర్శప్రాయమైంది. జూన్ 6న ఆయనా ఒక ఫర్మాన్ విడుదల చేసారు – బ్రిటిషు పాలన అంతరించడంతో తన స్వతంత్య్రం తనకు తిరిగి వచ్చిందని ఆయన ప్రకటించుకున్నారు. 'ఆజాద్ హైదరాబాద్ జిందాబాద్ – అల్ హజ్రత్ పాయిందాబాద్' అనే నినాదాల మధ్య చార్మినార్‌పై అసఫ్ జాహీ పతాకం ఆవిష్కరించబడింది. నిజాంను ఎగదోసినది కాశీం రజ్వీ నాయకత్వాన రజాకార్లు. రజాకార్లు చేసిన దోపిడీలు, ఘాతుకాలు అన్నీ యిన్నీ కావు. నిజాం వాళ్లను ఏమీ అనలేదు. రజ్వీ బంగాళాఖాతం దాకా తన రాజ్యాన్ని విస్తరింపచేస్తాడని ఆశ పెట్టుకుని నిజాం అతని చేతిలో కీలుబొమ్మగా మారాడు. జాగీర్దార్లకు, రజాకార్లకు, కాంగ్రెసువారికి, కమ్యూనిస్టులకు మధ్య తన రాజ్యంలో అంతర్యుద్ధం జరిగినా పట్టించుకోలేదు. తను స్వతంత్ర రాజుగా వెలగాలి. భారత్‌తో కుదరకపోతే పాకిస్తాన్‌లో విలీనమవ్వాలి. తన రాష్ట్రంలో 85% మంది హిందువుల మనోభావాలు ఎలా వున్నా తనకు అనవసరం. ఈ స్వార్థబుద్ధే నిజాం కొంప ముంచింది. 1948లో పోలీసు చర్యతో సర్దార్ పటేల్ నిజాం ఆశలు అడుగంటించాడు.
ఇదీ చరిత్ర. 38 ఏళ్ల పాలనలో నిజాం కొన్ని ప్రజోపయోగమైన పనులు చేస్తే, హైదరాబాదును సుందరంగా తీర్చిదిద్దితే, సొంత ఖజానాలో కోట్లాది రూపాయలు పోగేసుకుంటే అది గొప్ప కాదు. అతని పాలనలో జమీందార్లు బాగుపడ్డారు. ప్రజలను పీడించారు. ప్రజలను బానిసత్వంలో వుంచి, వారి జీవితంలో చీకట్లు నింపిన న నిజాం మంచి పాలకుడు ఎప్పటికీ కానేరడు. 'మా నిజాం రాజు, తరతరాల బూజు' అని మహాకవి దాశరథి చెప్పినది అక్షరాలా సత్యం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2014)