నాగ్ కు ఇప్పుడు రెండు సవాళ్లు ముందు కనిపిస్తున్నాయి. ఒకటి మనం సినిమాను హిట్ చేయడం, రెండవది మా టీవీలో మీలో ఎవరు కోటీశ్వరులు షోను సక్సెస్ చేసుకోవడం. ఇందుకోసం నాగ్ చాలా ప్లాన్డ్ గా వెళ్తున్నాడు. మనం సినిమా ప్రచారాన్ని కొత్త తరహాలో నిర్వహిస్తున్నాడు. పాటలు విడుదల కానీ, ప్రోమోలు, మేకింగ్ విడియోలు చాలా ప్లాన్డ్ గా వెళుతున్నాడు.
మనం ప్రచారానికి సంబంధించి ఓ ఆంగ్ల దినపత్రికతొ ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు వినికిడి. అంతవరకు బాగానే వుంది. కానీ మా టీవీ షో దగ్గరకు వచ్చేసరి మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాడట. జాతీయ స్థాయిలో కాబట్టి అమితాబ్ షోకు ఆదరణ వచ్చింది. కానీ ఒక్క తెలుగులో, రాష్ట్ర స్థాయిలో ఆ షో విజయవంతం అందుతుందా అన్నది పెద్ద అనుమానంగా వుందని వినికిడి.
తొలుత షోకి ఎంట్రీలు ఆహ్వనించినపుడు కూడా రెస్పాన్స్ కాస్త డల్ గా వుందట. దాంతో మళ్లీ ప్రకటనలు గుప్పించి కిందా మీదా పడ్డారు. నిత్యం ప్రశ్నలు, జవాబుల కార్యక్రమాన్ని టీవీలు ఎక్కువగా వీక్షించే మహిళలు చూస్తారా అన్నది మాటీవీకి పెద్ద బెంగగా వుందని టాక్.
అలా అని సెలబ్రిటీలను పిలిచి నిర్వహిస్తే షో ఔన్నత్యం దెబ్బతింటుంది. అందువల్ల వారానికి ఒకసారి అయినా సెలబ్రిటీలతో, మిగిలినవి మామూలుగా నిర్వహించాలని సూచనలు వినవస్తున్నాయట. నాగార్జున తొలిసారి చిన్న తెరపై చేస్తున్న కార్యక్రమం సక్సెస్ కాకుంటే పరువు తక్కువ. అందుకే దీని విషయమై చాలా కిందా మీదా అవుతున్నట్లు సమాచారం.