ఆస్ట్రేలియా: ఐసిస్‌ తీవ్రవాది చెరలో ఆంధ్రుడు.!

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గల ఓ కేఫ్‌లో ఐసిస్‌ తీవ్రవాది పలువురిని బంధీగా వుంచుకున్న విషయం విదితమే. కేఫ్‌ చుట్టూ ఆస్ట్రేలియా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. మొత్తం పన్నెండుమంది తీవ్రవాది చెరలో వున్నట్లు ఇప్పటిదాకా అధికారికంగా…

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గల ఓ కేఫ్‌లో ఐసిస్‌ తీవ్రవాది పలువురిని బంధీగా వుంచుకున్న విషయం విదితమే. కేఫ్‌ చుట్టూ ఆస్ట్రేలియా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. మొత్తం పన్నెండుమంది తీవ్రవాది చెరలో వున్నట్లు ఇప్పటిదాకా అధికారికంగా వెల్లడయ్యింది. అయితే యాభై మంది వరకు తీవ్రవాది చెరలో బందీలుగా వున్నారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

కాగా, ఐసిస్‌ తీవ్రవాది చెరలో ఓ ఆంధ్రుడు వున్నట్లు అధికారికంగా సమాచారం అందుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన విశ్వకాంత్‌రెడ్డి ఏడేళ్ళుగా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. అతను ఇప్పుడు ఐసిస్‌ తీవ్రవాది చెరలో వున్నట్లు తెలుస్తోంది. విశ్వకాంత్‌రెడ్డి విషయమై ఏపీ డీజీపీ జేవీ రాముడు కేంద్ర హోంశాఖను సంప్రదించి వివరాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ప్రాధమిక విద్యనభ్యసించిన విశ్వకాంత్‌రెడ్డి, ఆ తర్వాత బిట్స్‌ పిలానీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం విశ్వకాంత్‌రెడ్డి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఐసిస్‌ తీవ్రవాది చెరలో తమ ఉద్యోగి విశ్వకాంత్‌రెడ్డి ఇరుక్కుపోయినట్లు ఇన్ఫోసిస్‌ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా వుంటే, ప్రపంచానికి పెనుముప్పుగా తయారైన ఐసిస్‌, వివిధ దేశాలకు సవాల్‌ విసురుతోంది. ఇటీవలే బెంగళూరులో ఐసిస్‌ తీవ్రవాది ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తూ, ఐసిస్‌ వైపు మొగ్గుచూపాడా వ్యక్తి. అతని అరెస్ట్‌తో ఐసిస్‌, భారత్‌కీ హెచ్చరికలు జారీ చేసింది. బెంగళూరులో రేపు విధ్వంసం సృష్టిస్తామని ఐసిస్‌ హెచ్చరించగా, ఐసిస్‌ హెచ్చరికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామంటున్నారు బెంగళూరు పోలీసులు.