భారత బ్యాడ్మింటన్‌లో మరో కలికితురాయి ప్రకాశిస్తోంది. షటిల్ ఆటకు చిరునామాగా మారిన హైదరాబాద్ నగరం నుంచి మరొక తార ఉద్భవించింది. వరుసగా మూడు ఇంటర్నేషనల్ ఓపెన్ ఛాంపియన్ షిప్‌ల ఫైనల్స్ చేరుకోవడమే కాకుండా అందులో రెండు టైటిళ్లు సొంతం చేసుకుని ఈ సీజన్‌లో అంతర్జాతీయ వేదికపై తిరుగులేని బ్యాడ్మింటన్ ఆడగాడిగా శ్రీకాంత్ అవతరించాడు.
కెరీర్‌లో రెండు గ్రాండ్ టైటిల్స్ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుల కెక్కాడు. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి ఈ ఫీట్ అందుకున్నాడు కిదాంబి. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ విజేత చైనాకు చెందిన చెన్ లాంగ్‌ను 22 – 20, 21 – 16 పాయింట్లతో వరుస సెట్లలో చిత్తు చేసి సంచలనం క్రియేట్ చేశాడు.
బ్యాడ్మింటన్ ద్రోణాచార్యుడు పుల్లెల గోపీచంద్ స్కూలు నుంచి వచ్చిన కిదాంబి శ్రీకాంత్ 2014లో బ్యాడ్మింటన్ వెటరన్, అప్పటి నెంబర్ వన్ లిన్ డాన్‌ను వరుస సెట్లలో ఓడించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
2015లో ఇండియా ఓపెన్ గెలుపొందాడు. గతేడాది ప్రతిష్టాత్మక మలేషియా మాస్టర్స్‌లో సెమీఫైనల్ చేరాడు. గత ఒలింపిక్స్‌లో పతకం ఆశించక సెమీఫైనల్‌లో లిన్‌డాన్ చేతిలో ఓడి నిరాశ పరిచాడు.
ప్రస్తుతం కెరీర్‌లోనే బెస్ట్ ఫాంలో కనిపిస్తున్న కిదాంబి రెండు నెలల వ్యవధిలో జరిగిన మూడు అంతర్జాతీయ ఓపెన్‌లలో ఫైనల్ చేరడమే కాకుండా అందులో రెండు టైటిళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
ఏప్రిల్ లో జరిగిన సింగపూర్ ఓపెన్‌లో మన దేశానికే చెందిన సహచర ఆటగాడు సాయి ప్రణీత్ చేతిలో 17-21, 21-17, 21-12 తేడాతో ఓడిపోయాడు. అనంతరం గత వారంలో జరిగిన ఇండోనేసియా ఓపెన్‌లో జపాన్‌కు చెందిన కజుమసా సకాయ్ ను 21 – 11, 21 – 19 వరుస సెట్లలో చిత్తుచేసి కెరీర్లో తొలి అంతర్జాతీయ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
వారం తిరక్కుండానే ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి భారతదేశం, తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేశాడు. శ్రీకాంత్ విజయ పరంపరపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.