గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలను పదును పెడుతున్నాయి. వలసలపై గులాబీ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. టీడీపీ-బీజేపీతో కలిసి జెండా పాతాలని ఉవ్విళ్లూరుతోంది. ఒంటరిపోరుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. సమీప భవిష్యత్తులో జరగే గ్రేటర్ ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో దృష్టి సారించాయి. ఆ మేరకు వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. సభ్యత్వాలపై బిజీగా ఉన్న నేతలు పనిలో పనిగా గ్రేటర్ నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నాయి.
మరోపక్క హస్తం నేతలతో ఎంఐఎం పొత్తుకు ఆసక్తి చూపించడం లేదు. పైగా టీఆర్ఎస్తో దోస్తీకి దాదాపు సిద్దమైంది. ఆ మేరకు సంకేతాలు కూడా ఉన్నాయి. దీంతో ఒంటరిపోరుకు కాంగ్రెస్ రెడీ కావక తప్పడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో వర్గ విబేధాలు ఎంతగా ఉన్నాయో.. అంతకంటే రెట్టింపు గ్రూపు రాజకీయాలు నగర పార్టీని వెంటాడుతున్నాయి. నిన్నటికి నిన్న జరిగిన సమావేశంలో మరోసారి నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. నాయకత్వంపై నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. దానం నాగేందర్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇవన్నీ సాధారణమేనని.. పదవుల కోసం ఆరాటమని పెద్దలు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు ఇతర పార్టీల నుంచి వలసలు.. ఎంఐఎంతో దోస్తీతో విజయంపై ధీమాగా ఉన్న టీఆర్ ఎస్ కారుకు బ్రేకులు వేయడానికి టీడీపీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీతో పొత్తు దానికి కొత్త ఆశలు కల్పిస్తోంది. మోడీ చరిష్మా అండగా ఆంధ్రలో పాగా వేసిన మాదిరిగా, తెలంగాణ రాజధానిలో కూడా హవా కొనసాగిస్తూ టీఆర్ఎస్కు గ్రేటర్ ఎన్నికల్లో చెక్ పెట్టాలనుకుంటోంది. గత వారం చంద్రబాబు సమక్షంలో చర్చలు జరిపిన తెలంగాణ టీడీపీ-బీజేపీ నేతలు మరోసారి ఎర్రబెల్లి నివాసంలో సమావేశమయ్యారు. నిజానికి ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఇరు పార్టీల నడుమ ఎక్కడా పెద్దగా సమన్వయం కనిపించలేదు.
కీలక అంశాల్లో చర్చపై ఒకరికి ఒకరు అండగా నిలబడినట్టు కనిపించలేదు. మరి గ్రేటర్ ఎన్నికల్లో ఎంతవరకూ కలిసి సాగుతారనేది అనుమానమే? పైగా ఇటీవల తెలంగాణలో తామే ప్రత్యామ్నాయ శక్తి అని బీజేపీ అగ్రనేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. తామే ప్రత్యామ్నాయం అని, 2019 అధికారం మాదే అని టీడీపీ అంటోంది. ఇలా ఎవరికి వారు సొంత వ్యూహాలతో వెళుతూనే పొత్తుకు మాత్రం తహతహలాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సమన్వయం సాద్యమవుతుందా? అనేది సందేహంగా కనిపిస్తోంది.
దిగుమతి నేతలపైనే ఆశ
ఒక పక్క వీలయినంత వెనక్కు ఎన్నికలను నెడుతూనే మరో పక్క సొంత బలం కంటే దిగుమతి నేతలనే టీఆర్ఎస్ నమ్ముకుంటోంది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో దూకుడు పెంచాలని నిర్ణయించింది. గతంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తులను మాత్రమే వలసలను ప్రోత్సహించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కిందిస్థాయి క్యాడర్‌పై కన్నేశారు. కిందిస్థాయిలో పట్టున్న నేతలను వార్డుల వారీగా గుర్తించి ఆపరేషన్ ఆకర్శ్ కొనసాగించాలనకుంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ వలసలపై దృష్టి పెట్టింది. తమకు పట్టు వచ్చే వరకూ ఎన్నికలు జరగకుండా చూడాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
మరో పక్క గ్రేటర్ కు వీలయినన్ని వరాలు, మురికివాడలకు మరిన్ని తాయిలాలు, రహదారుల మరమ్మతు వంటి కార్యక్రమాలు చకచకా చేసేస్తోంది. ఆ విధంగా గ్రేటర్ జనాల మనసు చూరకొనాలని ప్రయత్నం.
అయితే టీఆర్ఎస్ భాషలో సెటిలర్లు అనే ఇతర ప్రాంతాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో వుండడం, గుజరాత్, రాజస్థాన్ తదితర ఉత్తరప్రాంతాలకు చెందిన జనాలు భాజపా పట్ల ఆకర్షితులై వుండడం అన్నది టీఆర్ఎస్ కు కాస్త ఇబ్బందే. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు బస్తీల్లో వుండే జనాలే అండ. ఎందుకంటే వారి వల్లనే ఓటింగ్ శాతం కచ్చితంగా వుంటుంది. వారిని ఆకట్టకోవాలంటే, వరాలు, బస్తీ నాయకులు శరణ్యం. అందుకే ఇప్పుడు వారిపై కన్నేసింది.
మొత్తానికి రాజకీయపార్టీలకు మాత్రం గ్రేటర్ సెగ తగులుతోంది. ఇంతకీ ఎన్నికలు జరుగుతాయన్నది మాత్రం ఇంకా తేలడం లేదు. దీనిపై స్పష్టత వస్తే మాత్రం ఈ సెగ మరింత పెరుగుతుంది.