బీసీసీఐ ప్రక్షాళన జరగాల్సిందే: శ్రీశాంత్‌

క్రికెట్‌ నుంచి జీవిత కాల నిషేధాన్ని ఎదుర్కొంటోన్న కేరళ స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్‌, మళ్ళీ క్రికెట్‌లో అడుగుపెడ్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ విషయమై బీసీసీఐకి సుప్రీంకోర్టు తలంటుపోయడాన్ని సమర్థించాడతడు. బోర్డులో రాజకీయాలే తనను…

క్రికెట్‌ నుంచి జీవిత కాల నిషేధాన్ని ఎదుర్కొంటోన్న కేరళ స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్‌, మళ్ళీ క్రికెట్‌లో అడుగుపెడ్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ విషయమై బీసీసీఐకి సుప్రీంకోర్టు తలంటుపోయడాన్ని సమర్థించాడతడు. బోర్డులో రాజకీయాలే తనను ఈ దుస్థితికి తీసుకొచ్చాయని శ్రీశాంత్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం దరిమిలా, శ్రీశాంత్‌ క్రికెట్‌ నుంచి జీవిత కాల నిషేధానికి గురైన విషయం విదితమే. అయితే అప్పట్లో విచారణాధికారులు తనకు సరిగ్గా మాట్లాడే అవకాశం ఇవ్వలేదనీ, బీసీసీఐ పెద్దలు ‘అన్నీ మేం చూసుకుంటాం.. నువ్వే మాట్లాడొద్దు..’ అని చెప్పారనీ.. బోర్డు చెప్పినట్లు నడచుకోవడమే తాను చేసిన పెద్ద తప్పు అని శ్రీశాంత్‌ చెబుతున్నాడు.

బీసీసీఐ ప్రక్షాళన జరగాలని తానూ కోరుకుంటున్నాననీ, తాను తిరిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించినా, సంపాదించకున్నా.. క్రికెట్‌లో రాజకీయాలకు ఇక్కడితో ఫుల్‌స్టాప్‌ పడాలనే తాను ఆశిస్తున్నానన్నాడు శ్రీశాంత్‌.

క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. రాత్రికి రాత్రి ఓ క్రికెటర్‌ స్టార్‌ అయిపోతాడు.. అలాగే స్టార్‌ క్రికెటర్‌ కూడా అత్యంత గడ్డు పరిస్థితుల్ని అతి తక్కువ సమయంలోనే ఎదుర్కొంటాడు. కాస్త ఎగ్రెసివ్‌ అయిన క్రికెటర్లకు ఈ ముప్పు చాలా ఎక్కువ. అది శ్రీశాంత్‌ విషయంలో నిరూపితమైంది. క్రికెట్‌లో గాడ్‌ఫాదర్‌ వుండి వుంటే, తనకు ఇప్పుడీ పరిస్థితి వచ్చి వుండేది కాదన్నది శ్రీశాంత్‌ వాదన.