తెలంగాణ పోరాటంపై సినిమా చేయాలనుకున్నా-సుకుమార్

ఇది లాక్ డౌన్ టైమ్…కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో…

ఇది లాక్ డౌన్ టైమ్…కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే..

ఆర్య..నాన్నకు ప్రేమతో..రంగస్థలం ఇలా ఒకదానికి ఒకటి పొంతనలేని సినిమాలు. తనకంటూ ఒక స్టయిల్ వుందని, పదే పదే చాటుకోవడానికి ఒకే రకమైన సినిమాలు తీసే దర్శకుడు కాదాయన. ఏ సినిమాకు ఆ సినిమానే.  ప్రతి సినిమాతో కొత్తగా కనిపిస్తాడు. ఇదీ ఆయన టేకింగ్ అని చటుక్కున పట్టేసుకోవడానికి దొరికేయడు. ఆయన పేరే సుకుమార్. 

-హలో సుకుమార్ గారూ నమస్కారం

ఏమండీ బాగున్నారా?

-ఎలా వున్నారు సర్..కరోనా టైమ్ ఎలా గడుస్తోంది?

ఏముంది..అందరిలాగే..బాగా సఫ్ కేషన్ లా వుంది. మూవీస్ చూడడం, స్క్రిప్ట్ ఫైన్ ట్యూనింగ్

-ఏం మూవీస్ చూసారు. వెబ్ సిరీస్ లుచూసారు

చాలా చూసానండీ..గుర్తువుండడం లేదు. ఏవో చూసేస్తున్నా అంతే. ప్రయిమ్ లో పంచాయత్ చూసాను.

-ఈమధ్య ఇంటి పనుల విడియో పెట్టారు..చేస్తున్నారా?

అంతేం లేదండీ. ఏదో రాజమౌళి కోసం పెట్టా. ఆయన నన్నేదో ట్యాగ్ చేసారు. సరే అని ట్విట్టర్ లో పెట్టా. నిజానికి ఆ అక్కౌంట్ ను నేను పెద్దగా వాడను. ఎప్పుడో ఓసారి అంతే. అది ఏడేళ్ల క్రితం అక్కౌంట్. దాదాపు మరిచిపోయాను. సినిమాలకే టైమ్ సరిపోదు.

-మీరు సోషల్ మీడియాకు, ఫోన్ లకు బాగా దూరంగా వుంటారని.

సోషల్ మీడియా కా…కొంచెం దూరమే. ఫోన్ లు అంటే వాడతాను కానీ, మరీ ఎక్కువ కాదు. కొద్దిమందితోనే కాస్త టచ్ లో వుంటాను.

-ఎందుకలా?

ఎక్కువ చనువు పెంచేసుకుంటే ఇబ్బందులు వస్తాయేమో అని జంకుతాను. ఎక్కడయినా వెళ్తాను. ఇక్కడి దాకా వచ్చారు కదా రండి అంటారు.  వెళ్లలేను. ఫీలవుతారు. అలాగే రకరకాల సందర్బాలు వస్తాయి. అటెండ్ కాలేను. ఇబ్బందులు. అందుకే వీలయినంత వరకు కాస్త తక్కువగా కలివిడిగా వుంటాను. వాళ్లను బాధపెట్టి, మనం బాధపడడం అన్నది తప్ప వేరు కాదు. రిలేషన్ షిప్ లు మెయింటెయిన్ చేయడం కష్టం. సినిమాలు చేస్తూ. బ్యాలన్స్ చేయడం కష్టం. ఒక్కరోజు పలకరించకపోయినా ఫీలవుతారు. ఇండస్ట్రీ అనే కాదు బయట కూడా.

-మీరు సహజంగానే ఐసోలేషన్ లో వున్నట్లు వుంటారేమో?

అలా అని లేదా కాదని చెప్పలేను. అంతే ఏమిటో?

-అసలు ఏం చేస్తుంటారు డైలీ..చదవడం, చూడడం, రాయడం ఇదేనా?

ఆ..చదవడం తగ్గిపోయింది. చూడడం. రాయడం. ఒకప్పుడు బాగా చదివాను. ఇప్పుడు ఈ చూడడం అలవాటైపోయి, చదవడం తగ్గిపోయింది. కానీ ఆ మధ్య మాత్రం కొంచెం ఎక్కువ చదివాను. రంగస్థలం తరువాత తెలంగాణ సాయుధ పోరాటం మీద విపరీతంగా చదివాను. దాదాపు ఆ విషయం మీద చాలా పుస్తకాలు కొన్నాను. చదివాను. 

-ఎందుకు దృష్టి అటు మళ్లింది?

అంటే అదే సినిమా తీద్దాం అనుకున్నాను, రంగస్థలం తరువాత. అందుకే విషయ సేకరణ కోసం విపరీతంగా చదివాను. కథ కూడా రెడీ చేసాను. కానీ ఆ స్క్రిప్ట్ ను పక్కన పెట్టి వేరేది స్టార్ట్ చేసాను. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. చదవడం, చూడడం ఏదైనా కానీండి. స్వార్థంతో చేస్తున్నాం. మనకేమన్నా ఉపయోగపడుతుందా? అన్న పాయింట్ అండర్ కరెంట్ గా పెట్టుకునే చేస్తున్నాం ఏపని అయినా, చదవాలి, చూడాలి అని కాదు, ఇది మనకు ఎక్కడన్నా పనికి వస్తుందా అనే స్వార్థమే ఎక్కువ అయింది. గతంలో ఫీలింగ్ కోసం చదవేవాళ్ల అన్నది పోయింది. దేన్నయినా ఉపయోగించుకోవాలన్న తపన ఎక్కువ అయింది.

-రంగస్థలం సినిమా మీ ఆలోచనావిధానాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. 

అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణమే అలాంటిది. స్కూలుకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు మట్టి రోడ్డులో నడిచివెళ్లాలి. వర్షం వస్తే కాళ్లకు మట్టి బూట్లు తయారయ్యేవి. సమాజంలో వ్యవహారాలు అలాగే వుండేవి. ఇవన్నీ చూసి పెరిగాను. సినిమాల్లోకి వచ్చాక అనుకునేవాడిని. ఏ కథా లేకపోయినపుడు, మన ప్రాంత కథ రెడీగా వుంటుంది, అదే ట్రంప్ కార్డ్ అని. అదే రంగస్థలంగా మారింది. ముందే వాడేసాను.

-ఈ భూస్వామ్య వ్యవస్థల్లాంటివి మీరు చూసారా?

చూసాను కానీ తక్కువ. మా అన్నలు చూసింది ఎక్కువ. నిజానికి సినిమాలో చూపించింది తక్కువ. అయితే తెలంగాణలో మరీ ఎక్కువ. 80వ దశకంలో అంతా మారింది.

-మీరు మీలో మీరే ఎక్కువ ఆలోచనల్లో వున్నట్లు కనిపిస్తుంటారు?

లేదు.. ఏదో ఒక విషయం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తుంటాను. అందువల్ల అలా అనిపిస్తోందేమో? పైగా చిన్నప్పటి పెంపకం తీరు కూడా. ఆరుగురు వుండేవాళ్లం..నేను ఆఖరివాడిని. చిన్నవాడిని అని ఏపనీ చెప్పేవారు కాదు. దాంతో టైమ్ డిసిప్లిన్ లేకుండా పోయింది. బద్దకం అలవాటైపోయింది. అదే మీకు అలా అనిపిస్తోందేమో? ఒక పని చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తూనే వుంటాను. ఓ థాట్ వచ్చినా దాన్ని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటా..కానీ బద్దకిస్తా.  నిజానికి నాలాంటి వాడికి ఎక్కువ టైమ్ ఇవ్వకూడదు. ఎంత తక్కువ టైమ్ ఇచ్చి, తరిమితే అంత బెటర్. ఆర్నెల్ల తరువాత అంటే ఇక నాకు బద్దకం వచ్చేస్తుంది,. అదే మూడేళ్లు అంటే అలా జరుగుతూనే వుంటుంది. మరోపక్క నాకు భయం ఎక్కువ. ఓ పని ఒప్పుకుంటే, అయ్యో పని ఒప్పుకున్నా, పూర్తి చేయగలనా? లేదా? ఎప్పటికి పూర్తి చేస్తాను? ఇలా నిత్యం భయం వుంచుకునే పనిచేస్తుంటాను.

-అంటే మీకు అస్సలు టైమ్ ఇవ్వకూడదు అన్నమాట.

అవును. నిజంగానే టైమ్ ఇవ్వకూడదు. ఇదే చెబుతుంటా నేను అందరికీ.

-కానీ మీరు ఓ పక్క స్టోరీలు ఇస్తుంటారు. ఓ పక్క కొత్త స్క్రిప్ట్ లు తయారుచేస్తుంటారు. సినిమా నిర్మాణాలు చేపడుతుంటారు.

ఇక్కడ చిన్న ట్విస్ట్ వుంది. పక్కవాళ్ల కథ అనుకోండి. లేదా పక్కవాళ్ల విషయం అనుకోండి. త్వరగా తేల్చేస్తాను.  అదే నా కథ, నా స్క్రిప్ట్ అనుకోండి. చాలా టైమ్ తీసుకుంటాను. నాన్నకు ప్రేమతో సినిమాకు అస్సలు టైమ్ ఇవ్వలేదు. ఫాస్ట్ గా చేసాను. 100 % లవ్ కు బన్నీ వాస్ అస్సలు టైమ్ ఇవ్వలేదు. అలాగే ఆర్యకు కూడా. ఏదైనా నాపైన ఎవరైనా కాస్త కొరడా ఝలిపిస్తే నేను ముందుకు వెళ్తాను. లేదూ అంటే ఆగిపోతాను. దీనికి కూడా రీజన్ నా చిన్నతనమే. నా మీద అందరూ  పెత్తనమే. ఇది తిను..అది చేయి అని. అందువల్ల నాది బాస్ మెంటాలిటీ కాదు. ఎవరో ఒకరు మన మీద పెత్తనం చేయాల్సిందే. డైరక్టర్ అయిపోయాను కాబట్టి నటించాల్సి వస్తోంది కానీ నేను బాస్ ను కాదు. 

-సడెన్ గా పుష్ప సినిమాకు బ్రేక్ వచ్చింది

అవును, షూటింగ్ కు వెళ్లిపోతున్నాం అనుకున్నాం. చటుక్కున బ్రేక్ పడిపోయింది. కానీ కొంత హోమ్ వర్క్ చేస్తున్నాం. పాత్రల గెటప్ లు, కాస్ట్యూమ్ లు, సినిమా ఫైన్ ట్యూనింగ్ ఇలా చాలా విషయాలు చూసుకుంటున్నాం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు టైమ్ దొరికింది కదా? దీన్ని వాడుకుని ప్రొడక్షన్ టైమ్ ను సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. 

-థాంక్యూ వీలయినంత త్వరగా మీరు పుష్ప సినిమా జనాలకు చూపించాలని కోరుకుంటున్నాం.

తప్పకుండా, వన్స్ ఈ కరోనా హఢావుడి ముగిసిపోతే..

-విఎస్ఎన్ మూర్తి