కరోనా వైరస్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలపై ఈ దేశ పాలకులకు ఎంతటి ప్రేమాభిమానాలో ఉన్నాయో చూపడానికి కారణమైంది కాబట్టి. దేశం ఆకలితో అలమటిస్తున్నా, ఇతరత్రా అవసరాలతో అల్లాడుతున్నా ఏ మాత్రం కరుణించని దేశ పాలకుల నిజ స్వరూపాన్ని కరోనా వైరస్ కళ్లకు కడుతోంది. ఇప్పటి వరకు నాలుగుసార్లు ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ల్లో తమకు ఆర్థిక సాయం అందించాలని అర్థించినా ప్రధాని మోడీ మనసు ఏ మాత్రం కరగలేదు.
అసలు రాష్ట్రాలకు ఏదైనా ఆర్థిక సాయం అందించాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు లేదు. కేవలం మాటలతో సరిపెడుతున్నారు. ఆరు వారాలుగా ప్రధాని వ్యవహార తీరును పరిశీలిద్దాం. ఇప్పటి వరకు నాలుగు దఫాలు సీఎంలతోనూ, సర్పంచులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి సమావేశంలో ఏం మాట్లాడారో, నాలుగో సమావేశంలోనూ అవే మాటలు, అదే కర్తవ్య బోధ. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయండి…కరోనా కట్టడికి సోషల్ డిస్టెన్స్ పాటించండి…ప్రధాని నుంచి దేశ ప్రజలు ఆశించేది ఈ మాటలేనా? జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం అంటే టాస్క్‌లు ఇవ్వడమా?
ప్రధాని మోడీ మొట్ట మొదటిసారిగా మార్చి 20న సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్థిక సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు కొవిడ్-19 ఆర్థిక టాస్క్‌ఫోర్స్ సూచనలు చేస్తుందని మోడీ చెప్పారు. మొదటి సమావేశంలోనే ఆర్థిక విషయాల గురించి మాట్లాడ్డంతో ప్రధాని ముందు చూపునకు సీఎంలు ఆనందించారు. కేంద్రం ఆర్థిక సాయంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 2న సీఎంలతో ప్రధాని రెండో సమావేశం నిర్వహించారు. ఆర్థికంశాలకు సంబంధించి కనీస ప్రస్తావన కూడా చేయలేదు.
మళ్లీ ముచ్చటగా మూడోసారి ప్రధాని సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్థిక సాయం ప్రకటించకపోగా…దేశం స్వయం శక్తితో అభివృద్ధి సాధించేందుకు ప్రస్తుత కరోనా పరిస్థితులు ఓ అవకాశాన్ని కల్పించాయన్నారు. మళ్లీ ఆయన నాల్గోసారి ఈ నెల 27న సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అబ్బే…సీఎంల ఆర్థిక ఇబ్బందులను చెవికెక్కించుకుంటే ఒట్టు. కేవలం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించడం వరకే తన బాధ్యత అన్నట్టు ప్రధాని వ్యవహరించారు.
కరోనా కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ప్యాకేజీలు ప్రకటించి ఆర్థికంగా అండగా నిలవాల్సిన కేంద్రం…ఆ ఒక్క పని మాత్రం చేయనంటోంది. ప్రధాని నాల్గోసారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ డుమ్మా కొట్టడం గమనార్హం. కేవలం ముచ్చట్లు చెప్పుకోడానికి ఎవరు మాత్రం ఆసక్తికనబరుస్తారు? ఇక పశ్చిమబెంగాల్ విషయానికి వస్తే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో కేంద్రానికి ఆలోచనే లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిరసన వ్యక్తం చేశారు.
మాటలతో ప్రజల్ని వశపరచుకోవడంలో ప్రధాని మోడీ దిట్ట. అయితే కడుపు కాలుతుంటే మాటలు వినేపరిస్థితి ఉండదు. రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకోవడం మాని, కేవలం మాటల గారడీ చేస్తామంటే అన్ని వేళలా కుదరదు. ఇప్పటికైనా మాటలతో కడుపు నిండదనే వాస్తవాన్ని కేంద్రం తెలుసుకోవాలి. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టే పనికి శ్రీకారం చుడితే మంచింది.
-సొదుం