ఏ సమస్యా అందరికీ ఒకేలా గోచరం కాదు. మనస్తత్వాలు, నేపథ్యాలు, ఆలోచనా విధానాలననుసరించి ఆయా వ్యక్తులు ఒకే సమస్యను విభిన్న రూపాల్లో చూస్తారు, అర్థం చేసుకుంటారు, విశ్లేషిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే అందరి దృష్టికోణం ఒకేలా ఉండదు. ఇందుకు ఓ ఉదాహరణ చెప్పి, తర్వాత అసలు విషయంలోకి వస్తాను.
దేశంలోని గోదాముల్లో దండిగా నిల్వ ఉన్న ధాన్యపురాశులను చూపి.. మనదగ్గర లక్షల టన్నుల్లో మిగులు ధాన్యాలు (బఫర్ స్టాక్స్) ఉన్నాయని కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు ఘనంగా చాటుకొంటాయి. అయితే, చాలా ఏళ్ల క్రితమే నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఆ వాదనను తప్పుపట్టారు.
“అవి మిగులు ధాన్యాలు కాదురా నాయనా.. అవి ఆకలి ధాన్యాలు (స్టార్వేషన్ గ్రెయిన్స్). దేశంలో ప్రతిరోజూ 50% మంది ప్రజలు రెండుపూటలా తినలేక ఆర్థాకలితో మునగదీసుకొని పడుకుంటున్నారు. ఆ కారణంగానే.. తిండి గింజలు పూర్తిస్థాయిలో వినిమయం కావడం లేదు. వాటిని మిగులు ధాన్యాలుగా పిలవడం సముచితం కాదు. దేశ ప్రజలందరూ రెండు పూటలా.. కడుపునిండా తిన్న తర్వాత మిగిలే తిండిగింజల్ని మాత్రమే బఫర్‌స్టాక్స్ గా పిలవాలి” అని స్పష్టం చేశారు.
అమర్త్యసేన్ దృష్టికోణంలో.. దేశంలో మిగులు ధాన్యాలుగా పిలవబడేవి నిజానికి ఆకలి ధాన్యాలే. ఈ సత్యాన్ని ఆవిష్కరించిన తర్వాతే గోదాముల్లో మూలుగుతున్న తిండిగింజల్ని పేదల కడుపు నింపడానికి పనికి ఆహారపథకం' రూపుదిద్దుకొంది. 'సోకాల్డ్ బఫర్ స్టాక్స్' పేదల చెంతకు చేరడం మొదలైంది.
సరే.. అది వేరే సంగతి. అసలు విషయంలోకి వద్దాం!
దేశంలో కరోనా కల్లోలం మొదలై కేంద్రం లాక్ డవున్ ప్రకటించిన తర్వాత సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్న నేపథ్యంలో.. తెలుగు సినీ హీరోలు వెంటనే స్పందించారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, వెంకటేష్, బాలకృష్ణ, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా, నితిన్.. ఇలా ప్రముఖ హీరోలు, దర్శక నిర్మాతలు చాలా మంది తమకు తోచిన రీతిలో ప్రధానమంత్రి సహాయనిధికి, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతి సందర్భంలోనూ ఇతర రంగాలకంటే ముందుగా తెలుగు సినీరంగం స్పందిస్తుందని అందరికీ తెలుసు. ప్రజలు కూడా విపత్తు సమయాల్లో ఏ హీరో ఎంత సాయం చేశారనే విషయంలో కుతూహలం ప్రదర్శిస్తుంటారు.
కాగా, తెలుగు సినీ పరిశ్రమ అనగానే ముందుగా గుర్తొచ్చే హీరో 'మెగాస్టార్ చిరంజీవి'. ఆయన ఒకింత ఆలస్యంగా, అంటే.. చాలామంది హీరోలు కరోనా విరాళాలు ప్రకటించిన దాదాపు 24 గంటల తర్వాత స్పందించారు.
మిగతా హీరోలకు భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఒకరకంగా చిరంజీవి నిర్ణయం సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదిపిందని అనుకోవచ్చు. కారణం – ఆయన ప్రత్యేకించి సినీ కార్మికుల సంక్షేమానికి విరాళం అందించడం. చిరంజీవి తీసుకున్న నిర్ణయం సముచితమైనదని అందరికీ అర్థమైంది. ఎందుకంటే, కరోనా వల్ల షూటింగ్లకు బ్రేక్ పడటంతో తక్షణం ఉపాధి కోల్పోయినవారు సినీ కార్మికులు. 24 క్రాఫ్ట్ కు సంబంధించి వందలాదిమంది సినీ కార్మికులకు పని లేకుండా పోయింది. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సినీరంగానిదేనని చిరంజీవి చెప్పకనే చెప్పినట్లయింది.
పీఎం, సీఎంల సహాయ నిధికి విరాళాలు ఇవ్వడం ఆహ్వానించదగినదే అయినప్పటికీ.. రోజూవారీ బత్తెంపై పనిచేసే సినీ కార్మికుల్ని ఆదుకోవాలన్న ఆలోచన చిరంజీవికి కలగడం ఆయన ఆలోచనా విధానానికి, దృష్టికోణానికి అద్దం పడుతుంది. 'నిస్సహాయులను చూసినపుడు కర్తవ్యం నీకు బోధపడుతుంది' అని మహాత్మాగాంధీ చెప్పినట్లు చిరంజీవి కష్టసమయంలో సముచితమైన నిర్ణయం తీసుకున్నారు. ఆధారం కోల్పోయి నిస్సహాయులుగా మారిన సినీ కార్మికులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యంగా చిరంజీవి భావించారు. 'Charity should begin at home' అనే నానుడిని ఆయన ఆచరణలో పెట్టారు .
ఎప్పుడైతే.. చిరంజీవి సినీ కార్మికుల సంక్షేమం మన ధర్మం అని అన్యాపదేశంగా చెప్పారో.. సినీ పరిశ్రమలోని మిగతావారు కూడా సినీ కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. దాంతో 'కరోనా క్రైసిస్ చారిటీ (సిసిసి)' అనేది రూపుదిద్దుకొంది. పలువురు సినీ ప్రముఖులు అందులో భాగస్వాములై.. సినీ కార్మికుల ఇళ్ల వద్దకే నిత్యావసరాలు, ఇతర సరుకులు చేరవేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందనట్లుగా.. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఆలోచన.. బాలీవుడ్ మొదలుకొని తమిళం, కన్నడం, బెంగాలీ.. మొదలైన ప్రాంతీయ సినీ పరిశ్రమ వర్గాలను సైతం కదిలించాయి. సినీ కార్మికుల కోసం ఆయా చిత్ర పరిశ్రమ పెద్దలు నడుంబిగించి ఇక్కడి 'సిసిసి' మాదిరిగా ప్రత్యేకంగా నిధులు సేకరించి వారిని ఆదుకొంటున్నారు. చెప్పుకోదగిన అంశం ఏమిటంటే.. 'చిరంజీవి చూపిన మార్గం' ఒక్క సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదు. అనేక వ్యాపార సంస్థలు, కంపెనీలు.. ముందుగా తమ సంస్థల్లోని చిరుద్యోగుల్ని ఆదుకోవడం మొదలు పెట్టాయి. అనేక కాలనీల వాసులు, అపార్ట్ మెంట్లలో నివాసం ఉండేవారు.. తమతమ వద్ద పనిచేసే 'సర్వెంట్ మెయిడ్స్' కుటుంబాలను, వాచ్ మెన్లను, అలాగే నిరుపేదల్ని తమకు తోచిన రీతిలో సాయం అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
కొన్ని రోజులు క్రితం ఓ జర్నలిస్ట్ మిత్రుడు నాకు ఫోన్ చేశాడు. మాటల సందర్భంలో కరోనా వల్ల మీడియాలో పనిచేసేవారికి కూడా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లిందని, కొన్ని సంస్థలు నిర్దాక్ష్యణ్యంగా చాలామంది జర్నలిస్ట్లను తొలగిస్తున్నాయని చెప్పాడు. కష్టసమయంలో సొంతవారే ఆదుకోవాలి కదా! అంటూ “చిరంజీవిగారు భలే మంచిపనిచేశారు. తమ కార్మికులను ఆదుకోవడానికి చొరవ చూపారు. ఆయనలా అందరూ ఆలోచిస్తే బాగుంటుంది” అన్నాడు.
అతను చెప్పింది నిజమే. కష్టసమయంలో ప్రతి సంస్థ తమ ఉద్యోగులను కాపాడుకోవాలి, ఆదుకోవాలి. సినీ కార్మికుల కోసం 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఏర్పాటు కావడానికి కారణమైన చిరంజీవిని ఇందుకే అందరూ అభినందిస్తున్నారు. కొన్ని టీవీ చానెల్స్ ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాయి. 'బిగ్ బి' అమితాబ్ బచన్ కూడా ఫోన్ చేసి చిరంజీవిని అభినందించి తాము కూడా సినీ కార్మికులను ఆదుకుంటున్నట్లు తెలిపారు.
అయితే, చిరంజీవి కేవలం పేరు కోసమే ఈ పని చేయలేదు. అసలు పబ్లిసిటీ కోసం వెంపర్లాడే వ్యక్తి చిరంజీవి కాదు. ఆయన కొన్ని సమస్యల్ని తన దృష్టికోణం నుంచి పరిశీలిస్తారని, పరిష్కరిస్తారని నాకు తెలుసు. ఆర్థిక వ్యత్యాసాలు, కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఆకలి దప్పులు, ఇతర భావోద్వేగాలు సమానమే అనే స్పృహ చాలా కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. వారిలో ఒకరు చిరంజీవి. సాటి మనుషుల కష్టనష్టాల్లో అంతో ఇంతో పంచుకోవాలన్న తపన ఆయనలో కనపడుతుంది. అందుకు ఉదాహరణగా నా స్వానుభవంలో జరిగిన ఓ సంఘటనను వివరిస్తాను.
చిరంజీవిగారు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా, తిరుపతి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను ఆయనకు పొలిటికల్ ఇన్పుట్స్ అందించే బాధ్యతలు చూస్తున్నాను. 2010లో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్ తో చిరంజీవిగారు 'పోలవరం సాధనయాత్ర' చేపట్టారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆయన రోడ్ షో, బహిరంగ సభలు ఏర్పాటయ్యా యి. ఆయన ఏ ప్రాంతానికెళ్లినా… ప్రజలు, అభిమానులు ఆయనను చూసేందుకు తండోపతండాలుగా ఎగబడేవారు. ఆయన ప్రయాణించే వాహనాన్ని ముందుకు కదలకుండా దిగ్బంధం చేసేవారు. ఆ సమయంలో స్థానిక పోలీసులతోపాటు, సొంతంగా ఏర్పాటు చేసుకొనే రోప్ పార్టీ (కాన్వాయ్ కు ఇరువైపులా బలమైన తాళ్లు పట్టుకొని వాహనాల వద్దకు ఎవ్వరూ దూసుకురాకుండా బౌన్సర్ల లాంటి వారు దాదాపు 20 మంది రక్షణగా ఉంటారు) ఉండేది. చిరంజీవి కాన్వాయ్ కదులుతుంటే రోప్ పార్టీ వారు ఇరువైపులా తాళ్లు పట్టుకొని వెంట పరుగెత్తేవారు. ఊరి పొలిమేర దాటగానే రోజాపార్టీ తమకు కేటాయించిన వాహనాలు ఎక్కేసేవారు. మరో ఊరిలోకి ప్రవేశిస్తున్నప్పుడు.. తిరిగి చిరంజీవిగారి వాహనానికి రక్షణగా ఇరువైపులా తాళ్లు పట్టుకొని కాన్వాయ్ సాగుతున్నంతసేపు పరిగెత్తేవారు.
ఆ ఉదయం తిరుపతి నుంచి బయలుదేరిన మాకు మదనపల్లె చేరుకొనే సరికి రాత్రయింది. ఆ రాత్రికి హార్సిలీహిల్స్ పై ఉన్న విశాలమైన గెస్టహౌస్లో చిరంజీవి గారికి బస. మిగతావారికి కూడా ఎకామడేషన్ అక్కడే. గెస్ట్ హౌస్ కి చేరేసరికి ఆయన అలసిపోయి ఉన్నారు. “రేపు కలుద్దాం” అని అందరి దగ్గరా సెలవు తీసుకొని గెస్ట్ హౌస్ లోకి వెళ్లిపోయారు.
చిరంజీవిగారు పర్యటనలలో ఉన్నప్పుడు.. నేను ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి ఆ రోజు టూర్‌కు సంబంధించి ఆయన మాట్లాడాల్సిన అంశాలను, ప్రెస్ మీట్ పాయింట్స్‌ను సిద్ధం చేసి ఏడున్నరకల్లా ఆయన దగ్గరకు వెళ్లేవాణ్ణి. ఓ అరగంటపాటు వాటిపై ఆయన బ్రీఫింగ్ తీసుకునేవారు. తదుపరి బ్రేక్ ఫాస్ట్ ముగించి స్థానిక నేతలు, అభిమానులతో ముచ్చటించాక మీడియాతో మాట్లాడి తొమ్మిదిన్నర, పది గంటలకల్లా బయలదేరడం అన్నది ఆయన టూర్ షెడ్యూల్.
ఎప్పటిలాగే ఆ రోజు ఉదయం ఏడున్నరకల్లా నేను ఆయన బస చేసిన సూట్‌కు వెళ్లాను. ప్రధాన ద్వారం వద్ద అప్పటికే అభిమానులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బయటంతా కోలాహలంగా ఉంది. నన్ను చూడగానే ద్వారం వద్ద ఉన్న గన్ మెన్లు తలుపు తెరుస్తూ నెమ్మదిగా.. “సార్ ఎందుకో కోపంగా ఉన్నారు” అని నా చెవిన వేశారు. నేను ఆశ్చర్యపోయాను. ఆయనకు కోపం తెప్పించిన అంశం ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తూ లోపలికి వెళ్లాను.
పెద్ద హాలులో ఉన్న సోఫాసెట్లో చిరంజీవిగారు కూర్చొని ఉన్నారు. నేను ఆయనకు విష్ చేసి పక్కకు జరిగాను. కుర్చీలో కూర్చోమన్నట్లు సంజ్ఞ చేశారు. హాల్ లో వాతావరణం గంభీరంగా ఉంది. ఆయనలో ఒకింత ఆగ్రహం ఉన్నట్లు నాకు తెలుస్తూనే ఉంది. ఆయన ఎదురుగా దోషులు నిలబడినట్లుగా చేతులు కట్టుకొని హైదరాబాద్ నుంచి మాతోపాటు వచ్చిన చిరంజీవిగారి ఇద్దరు మేనేజర్లు నిలబడి ఉన్నారు. నేను నిశ్శబ్దంగా యాంటీ రూమ్ వైపు నడిచాను. అక్కడ చిరంజీవి గారి పర్సనల్ కార్ డ్రైవర్ బాలు ఉన్నాడు. “ఏం జరిగింది?” అని అతడ్ని అడిగాను లోస్వరంతో. చిరంజీవిగారికి ఆగ్రహం కలగడానికి కారణం చెప్పాడతను.
ముందురాత్రి హార్స్లీహిల్స్ చేరుకొన్న తర్వాత.. రోప్ పార్టీ వాళ్లకు భోజనాలు సరిపోలేదట. ఆ విషయాన్ని డ్రైవర్ బాలుయే ఉదయం ఆయనకు 'టీ' ఇవ్వడానికి వెళ్లినపుడు చెప్పాడట. నిజానికి, టూర్లకు వెళ్లినపుడు.. ఎక్కడికి వెళ్లినా.. చిరంజీవిగారు తనతోపాటు ఉండే సిబ్బందికి భోజనాలు, ఇతర వసతి సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాట్లను అక్కడి పార్టీ నేతలకుగానీ, నిర్వాహకులకుగానీ అప్పజెప్పకుండా సొంతంగానే ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరు మేనేజర్లను అందుకు వినియోగిస్తారు. వారు చేసేపనల్లా.. ఎవరికీ ఏ ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేయడమే. అందుకే రోజా పార్టీ వాళ్లకు భోజనాలు సరిపోలేదని తెలియడంతో ఆయనకు మేనేజర్ల మీద కోపం తారాస్థాయికి చేరింది. ఇద్దరు మేనేజర్లు ఆయన ముందు నిలబడి చిగురుటాకుల్లా వణికిపోతున్నారు.
“మీరు హైదరాబాద్ నుంచి ఎందుకొచ్చారో మీకు తెలుసా? మీ దగ్గర డబ్బులున్నాయి కదా?” సూటిగా మేనేజర్లను ప్రశ్నించారు. చిరంజీవి గారు. వారిద్దరూ నోరు విప్పే సాహసం చేయలేదు. “చెప్పండి.. ఎందుకొచ్చారు? వాళ్లకు భోజనాలు ఎందుకు సరిపోలేదు?” గద్దించి అడుగుతుంటే వాళ్లు నీళ్లు నమిలారు. “సరైన భోజనం లేకపోతే వాళ్లెలా పనిచేస్తారనుకొన్నారు? పొద్దుటనుంచి వాళ్లు ఎండలో చెమటలు కక్కుకొంటూ పరిగెత్తటం మీరు చూడలేదా?” రోజా పార్టీ వారు పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్లు ఆయన వివరిస్తుంటే వింటున్న నేను ఆశ్చర్యపోయాను. రోజూ నాకు కూడా కనబడే దృశ్యమే అది. కానీ, వారి కష్టాన్ని అప్పుడే తెలుసుకొన్న భావన కలిగింది నాకు. చిరంజీవిగారు ఆ విషయానికి అంత ప్రాధాన్యం ఇవ్వడం నన్ను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.
బయట అభిమానుల కోలాహలం ఎక్కువైంది. తలుపులు కొడుతున్నారు గట్టిగా. లోపల మాత్రం చిరంజీవిగారు తనకు ఇదే ముఖ్యమైన విషయం అన్నట్లుగా ఉన్నారు. “సరే, ఇదే లాస్ట్ వార్నింగ్ మీకు. రోప్ పార్టీ వాళ్లకు, పోలీసులకు ఇకనుంచి మంచి భోజనం పెట్టండి. భోజనంలో వారికి చికెన్, మటన్ పెట్టండి. వాళ్లు ఎంత తినగలిగితే అంత పెట్టండి. వాళ్లకు ప్రొటీన్ ఫుడ్ అవసరం. ఎండల్లో కష్టపడుతున్నారు.. వాళ్లకు డీ హైడ్రేషన్ కలుగుతుంది. మంచినీళ్ల బాటిల్స్ ఇవ్వండి. గ్లూకోజ్, ఎలక్ట్రాల్ పౌడర్ ప్యాకెట్లు కూడా ఇవ్వండి. డబ్బు ఖర్చువుతుందని కక్కూర్తి పడకండి. తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టండి. మళ్లీ జాగ్రత్తగా హైదరాబాద్ కు తీసుకుపోవడానిక్కాదు మీరు వచ్చింది” అంటూ ఒకింత తీవ్ర స్వరంతోనే వారిద్దర్నీ మందలించారు.
మేనేజర్లు ఇద్దరూ మౌనంగా తలలు ఊపారు. పోండి వెళ్లి వాళ్లకి బ్రేక్ ఫాస్ట్ అందిందోలేదో చూసుకోండి' అని చివాట్లు పెట్టి పంపించేశారు. వారిద్దరూ వెళ్లిపోయాక హాల్ లో నేను, ఇద్దరు ముగ్గురు సీనియర్ లీడర్లు మాత్రమే ఉన్నాము. మేనేజర్ల మీద ఇంకా ఆయనకు కోపం తగ్గలేదు. “ఇడియట్స్ అన్నీ చూసుకోవాలి కదా (బాగా కోసం వస్తే ఆయన ప్రయోగించే పదం ఇడియట్)” “నేను టూర్ లో ఉంటే.. ఆర్గనైజర్లు కేవలం నా ఒక్కడి మీదనే ఫోకస్ పెడతారు. మిగతావారిని అంతగా పట్టించుకోరు. అందుకే.. ఎక్కడికి వెళ్లినా మనవారందరికీ అవసరమైన ఏర్పాట్లు మనమే సొంతంగా చేసుకొంటాము” అని చెబుతూ “రోజాపార్టీ వాళ్లకు నిన్న రాత్రి భోజనాలు సరిపోలేదని తెలియగానే నాకు చాలా కోపం కలిగింది. వాళ్లెంత కష్టపడతారో తెలుసా? రోజంతా జరిగే ర్యాలీలలో కాన్వాయ్ వెంట పరుగెడుతూనే ఉంటారు. అలాంటి వారిని జాగ్రత్తగా చూసుకోవాలికదా?” చిరంజీవిగారు చెబుతుంటే అక్కడున్న అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు.
ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి రోజా పార్టీ వ్యక్తుల గురించి ఆలోచించడమేమిటి? పైగా, వాళ్లకు రోజువారీగాను, టూర్ మొత్తానికి కలిపి ఇచ్చే రెమ్యూనరేషన్ ఇస్తారు. వాళ్లకు ఇవ్వాల్సిందేదో ఇస్తున్నప్పుడు.. వాళ్లకు మంచి భోజనం అందుతున్నదా? అందులో చికెన్, మటన్ వంటి ప్రొటీన్ ఫుడ్ ఉన్నదా? అని ఆలోచిస్తారని ఎవరూ అనుకోరు. పైగా, బయట ఎంతో మంది తనను కలవడానికి వేచిచూస్తున్న సమయంలో ఈ అంశానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటి? అనే అభిప్రాయం కూడా అక్కడి వారిలో కలిగింది.
చిరంజీవి గారి దృష్టికోణం ఏవిధంగా ఉంటుందో నాకు తెలుసు. మానవత్వం చాటేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ, కష్టజీవుల కష్టం పట్ల అవగాహనతో పాటు వారిపట్ల కంపేషన్ ఉండటం కొందరికే సాధ్యం. పైగా, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ.. సాధారణ మనుషుల పట్ల కూడా మానవత్వం చూపడం అరుదైన గుణం. శ్రమజీవుల శ్రమను దోపిడీ చేసిన ఎంతో మందిని చూసిన నాకు మొట్టమొదటిసారి అందుకు భిన్నమైన అనుభవం ఎదురైంది. చిరంజీవిగారి దృష్టికోణం ఏవిధంగా ఉంటుందో అర్థమైంది. ఆయనపట్ల నాకున్న గౌరవం మరింత పెరిగింది.
ఆ తర్వాత చాలా సందర్భాలలో.. ప్రత్యేకించి టూర్స్ లో.. పోలీసులుగానీ, రోప్ పార్టీ వాళ్లు గానీ.. పడే కష్టాన్ని ఆయన నిశ్శబ్దంగా గమనించడాన్ని నేను గ్రహించాను. అందరికీ భోజనం, ఇతర సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అనే విషయంలో ఆయన చాలా పర్టిక్యులర్‌గా ఉండటం కూడా నేను చూశాను.
ప్రపంచ కుబేరుడు అయిన వారెన్ బఫెట్ ను ఓ విలేకరి ఇలా అడిగాడు “మీరు మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్ కదా.. సక్సెస్ కు మీరిచ్చే నిర్వచనం ఏమిటి?”
బఫెట్ సమాధానం చెప్పాడు “మనం ఆనందంగా ఉండాలి, మన చుట్టూ ఉన్నవారు ఆనందంగా ఉండాలి, వారందరి ప్రేమను మనం పొందగలిగితేనే.. మనం సక్సెస్ అయినట్లు లెక్క”
సినీహీరోగా చిరంజీవిగారు మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్. వ్యక్తిగా కూడా.. వారెన్ బఫెట్ ఇచ్చిన నిర్వచనానికి సరిగ్గా సరిపోతారు.
విక్రమ్ పూల