ఇంట్లో ఓ కష్టం వస్తే…ఓ ఇంటి పెద్ద ఎలా మాట్లాడతాడు? టెన్షన్ వద్దు అంతా సర్దుకుంటుంది అనేగా.
అంతేకానీ సర్వనాశనం అయిపోయింది. మనం చావడం తప్ప వేరే మార్గం లేదు అని అనడుగా?
ఎంత తీవ్రమైన రోగంతో డాక్టర్ దగ్గరకు వెళ్లినా ఏం చెబుతారు.. ఫరవాలేదు. చూద్దాం. మందులు వాడదాం అనేగా.
అంతేకానీ కష్టం, లాభంలేదు, పోతావ్ అని చెప్పడుగా.
ఓ నాయకుడిగా జగన్ ఏం చెప్పాలి? జనానికి?
మీరు పోతారు. కష్టం. ఈ రోగం మహమ్మారి. ఎవరినీ బతకనివ్వదు. నెత్తురు కక్కేసుకుంటారు. ఇలాంటి రోగం ఇప్పటి వరకు రాలేదు. మా ప్రయత్నం మేం చేస్తున్నాం. అని చెప్పాలా?
అప్పుడు ఇదే కులపిచ్చతో కొట్టుకునే పత్రికలు, వెబ్ సైట్లు ఏం అంటాయి?
అదిగో జగన్ చేతులు ఎత్తేసాడు. బేలమాటలు మాట్లాడుతున్నాడు అని అనదా? అసలు ఈ కులపిచ్చతో కొట్టుకుంటున్న పత్రికలు, వెబ్ సైట్లు ఏం రాస్తున్నాయి పేజీకో తరహాగా, రోజుకో తరహాగా రాయడం లేదా?
ఓ పేజీలో లిబరల్ గా వదిలేసారు. అస్సలు కంట్రోలు లేదు అని రాస్తారు. మరో పేజీలో కేంద్ర రిలాక్సేషన్లు ఇచ్చినా రాష్ట్రం ఇవ్వడం లేదు. జనం ఇబ్బంది పడుతున్నారు అని రాస్తారు.
ఓసారి కేసులు దాస్తున్నారు అంటారు. ఎక్కువ కేసులు వస్తే, అదిగో అల్లకల్లోలం అయిపోతోంది అని రాస్తారు.
పక్క రాష్ట్రంలో రోజుకు వంద, రెండు వందల టెస్ట్ లుచేస్తే, అసలు టెస్ట్ లు చేయవద్దని కట్టడి చేస్తే, రాయగల దమ్ము, ధైర్యం ఈ కులపిచ్చతో కొట్టుకునే పత్రికలకు, వెబ్ సైట్లకు లేదు. కానీ ఆంధ్రలో రోజుకు ఆరేడు వేల టెస్ట్ లు చేస్తుంటే, ప్రశంసించేంత గొప్ప మనసు అంతకన్నా లేదు.
ఈ కులపిచ్చ పత్రికలకు, వెబ్ సైట్లకు జగన్ ఏం చేసినా తప్పే, ఏం మాట్లాడినా తప్పే. మనం కరోనాతో కలిసి బతకాల్సిందే అన్న మాట తప్పా? మలేరియా, టీబీ, చికెన్ ఫాక్స్, ఫ్లూ ఏవయినా ఎరాడికేట్ అయ్యాయా? మనం వాటితోనే కలిసి జీవిస్తున్నాం. ఎటొచ్చీ వాటికి నివారణ మందులు వచ్చాయి. వ్యాక్సీన్లు వచ్చాయి. అందువల్ల ధైర్యంగా వున్నాం.
జగన్ చెప్పింది అదేగా. రేపు వ్యాక్సీన రావచ్చు, మందులు రావచ్చు. కానీ కరోనా మాయం అయింది అని చెప్పడం సాధ్యం అవుతుందని ఈ కుల పిచ్చ పత్రికలు, వెబ్ సైట్లు అనగలవా? ఏడాది పాటు అధికారం లేకపోయేసరికి, ఆదాయం మాయం అయ్యేసరికి ఆగం ఆగం అయిపోతున్నారు. ఎలా జగన్ ను బదనామ్ చేయాలా? అని కిందా మీదా అయిపోతున్నారు. ఏం జరిగినా మరో నాలుగేళ్ల వరకు ఇలా కొట్టుకోవడం తప్ప మరోటి వీళ్లకు సాధ్యం కాదు.
ఏదో అద్భుతం జరిగిపోదా? ఆంధ్రలో నానా బీభత్సం జరిగిపోదా? రాష్ట్రపతిపాలన పెట్టేయరా? ఆ తరువాత మధ్యంతర ఎన్నికలు వస్తే, మళ్లీ మనకు పగ్గాలు తెచ్చేసుకోవచ్చు. ఇదే కదా? యావ? ఇదేకదా బాధ?