తుగ్లక్‌ పాలన

పిచ్చివాడి చేతిలో రాయిలా ఆర్టికల్‌ 3 కక్ష కట్టినట్లుగా అంచెలంచెల వంచన విభజనపర్వంలో అరాచక రాక్షసం Advertisement తుగ్లక్‌ పాలన గురించి మనం కథలు కథలుగా చెప్పుకుంటాం. తెనాలి రామలింగడి తెలవితేటల గురించి, వెర్రిబాగుల…

పిచ్చివాడి చేతిలో రాయిలా ఆర్టికల్‌ 3
కక్ష కట్టినట్లుగా అంచెలంచెల వంచన
విభజనపర్వంలో అరాచక రాక్షసం

తుగ్లక్‌ పాలన గురించి మనం కథలు కథలుగా చెప్పుకుంటాం. తెనాలి రామలింగడి తెలవితేటల గురించి, వెర్రిబాగుల తనం లాగా కనిపించే బీర్బల్‌ లౌక్యం గురించి ప్రచారంలో ఉన్నట్లుగా లెక్కలేనన్ని కథలు, వాస్తవాలు తుగ్లక్‌ అరాచక పాలన గురించి కూడా  ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. అచ్చంగా అదే తరహాలో పాలన సాగుతున్నది. తుగ్లక్‌ కాదనకుంటే గనుక పోల్చుకోవడానికి మనకు మరొక పాత్ర కూడా ఉన్నది.. అదే.. వడివేలు హీరోగా వచ్చిన ‘హింసించే రాజు 23వ పులకేశి’లోని పాత్ర! 

కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘వంచించే రాజు’ అన్నట్లుగా ఈ రాష్ట్ర విభజన వ్యవహారంలో ముందుకు దూసుకెళ్లింది.  విభజన వ్యవహారంలో ఆద్యంతమూ వారు చేసినది వంచన మాత్రమే. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఒక ప్రజాందోళనను ఎన్ని రకాలుగా వంచించడానికి వీలవుతుందో.. అన్ని రకాలుగానూ వంచించడానికి కాంగ్రెస్‌ సిగ్గెగ్గులు లేకుండా తెగబడింది. మాది జాతీయ పార్టీ మేం మాట తప్పలేం.. మడమ తిప్పలేం.. అనే ఒక తరహా పడికట్టు పదాడంబరాన్ని  ప్రదర్శిస్తూ ప్రజలను బురిడీ కొట్టించడానికి కాంగ్రెస్‌ బరితెగించింది. వారి విచ్చలవిడితనాన్ని సరిపోల్చడానికి మహాప్రభువు… మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ మినహా మరొకరు లేరు కదా మన ఎరికలో!

xxxxxxxxxxxxxxxxxxxx

‘అచ్చోసిన ఆబోతు’ అంటూ పల్లెసీమల్లో కొన్ని ఆబోతులు ఉంటాయి. అంటే అది యథేచ్ఛగా విచ్చలవిడిగా వ్యవహరించడానికి లైసెన్సు పొందిన ఆబోతు అన్నమాట.  ఓ లోహపు అచ్చును బాగా ఎర్రగా కాల్చి, ఆబోతు వీపు వెనుక భాగంలో ముద్రలు వేస్తారు. అక్కడినుంచి అది అతిగా మదమెక్కి.. ఊర్లో ఏ ఆవు కనిపించినా దాని అరాచకత్వాన్ని కొనసాగించడానికి అది లైసెన్సు అన్నమాట. అచ్చంగా కాంగ్రెస్‌ పార్టీ, కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరించింది. కేంద్రంలో అధికార దండం తమ చేతిలో ఉన్నదానికి మదమెక్కి పెచ్చరిల్లడంలో తాము ఏ అంచులకు వెళ్లగలమో నిరూపిస్తోంది. 

జులై 30. గద్దె మీద కూర్చుని ఏలుబడి సాగించడానికి తమకు అత్తెసరు మెజారిటీ ఉన్నా కూడా చాలు.. రాబోయే రోజులకు కాసింత పదిలమైన మెజారిటీని సంపాదించుకోవాలనే యావలో ఎలాంటి దుందుడుకు విచ్ఛిన్నకర నిర్ణయాలు తీసుకోవడానికైనా సరే.. ప్రజలు తమను అచ్చోసి దేశం మీదికి వదిలేశారని కాంగ్రెస్‌ పార్టీ బలీయంగా నమ్మిన రోజు. అందుకే ఆ పార్టీ బరితెగించి వ్యవహరించింది. కేంద్రంలో ఏదో పేరుకు ప్రభుత్వం చెలాయిస్తున్నప్పటికీ.. తమకు సరైన మెజారిటీ కూడా లేదన్న కనీస జ్ఞానం కూడా పక్కన పెట్టి.. వారు రాష్ట్ర విభజనకు ఈ నిర్ణయం తీసేసుకున్నారు. 

అప్పటినుంచి అంచెలంచెలుగా కాంగ్రెస్‌ ప్రజలను వంచిస్తూనే ఉంది. రాష్ట్ర విభజనకు సంబంధించి అన్ని పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెబితే.. కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తను తీసేసుకుంది. ఈ దేశంలో పాలన సాగిస్తున్నది ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమా..? లేదా, వారి పార్టీకి చెందిన కమిటీనా? అనే సిగ్గుమాలిన అనుమానం రేకెత్తే స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించింది. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర సర్కారులో భాగస్వాములుగా ఉన్న ఇతర పార్టీల నాయకులు అందరూ డూడూ బసవన్నల్లాగా తల ఊపి, యూపీఏ భాగస్వామ్య పక్షాల భేటీ పచ్చజెండా ఎత్తారు. 

తమకు.. అనగా కేంద్రానికి విశృంఖల అధికారాలను కట్టబెట్ల్టే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ఉన్నది కదాని.. విచ్చలవిడిగా రాష్ట్రాన్ని నరికేసే నిర్ణయం తీసుకుంటూ వెళ్లిపోయారు. తెలంగాణ అనే పది జిల్లాల ప్రాంతానికి చెందిన వారు ఏం అడుగుతున్నారో అవన్నీ కేటాయించారు. యావత్తు సీమాంధ్ర ప్రాంతంలో ఒక పరిమిత భాగానికి మాత్రం ప్రయోజనం కలిగించగల పోలవరం ప్రాజెక్టు ఒక్కటే.. నిజానికి దానికోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి… కొత్తగా సీమాంధ్రులకు వరప్రసాదం పెట్టినట్లుగా బిల్డప్‌ ఇచ్చారు. అది ఇస్తున్నాం గనుక రాష్ట్ర విభజనకు అంగీకరించాల్సిందిగా ప్రకటించారు. ఇదేదో జాతీయ హోదా అన్నట్లు అంతా మేమే చేస్తాం అంటూ కేంద్రం ప్రకటిస్తున్నది. అనుమతులు తీసుకు వచ్చాక మొదలెడతాం అంటున్నది. ఇదెంతటి భయంకరమైన వంచన అంటే..

పోలవరం అంతటిపెద్ద ప్రాజెక్టు నికరంగా ఒక్క అనుమతి రావాలన్నా కొన్ని నెలల సమయం పడుతుంది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా.. మరో మూడు నెలలో దిగిపోతున్న ఈ సర్కారు.. ముంపు గ్రామాల బాధ్యత కూడా తామే చూసుకుంటాం అనే ముదనష్టపు హామీలను కూడా గుప్పిస్తూ.. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మేం కట్టిస్తాం అని ప్రకటన చేస్తున్నది. మనం 2014లో ఎటూ ప్రభుత్వంలోకి  రాబోవడం లేదు గనుక.. వచ్చే సర్కారు ఎలా చస్తే మనకేంటిలే.. అన్నట్లుగా వీరి వైఖరి ఉంటున్నది. అందుకని వక్రంగా.. మేం చేస్తాం అనే హామీతో సీమాంధ్రులను వంచిస్తున్నది. అయితే ఏదో కక్షకట్టినట్లుగా ఇన్ని రకాల వంచనలకు ఎందుకు పాల్పడుతున్నదో మాత్రం అర్థం కాని సంగతి. 

అయితే కేంద్రం నిర్ణయంతో సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమంది.. విభజన వ్యతిరేక ఆందోళనలు మిన్నుముట్టాయి. ఇక్కడినుంచి దశలు దశలుగా తుగ్లక్‌ పాలన ఆనవాళ్లు.. అతి తెలివితో.. తాము అనుకున్న ఆలోచనను మాత్రం ముందుకు తీసుకువెళ్లే వ్యవహారాలు షురూ అయ్యాయి.

ఆర్టికల్‌ 3 దఖలు పరిచే అధికారాలతో విచ్చలవిడిగా వ్యవహరించవచ్చునని వారికి అర్థమైంది. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు.. చర్చ మాత్రమే జరుగుతుంది. అనే డైలాగు ద్వారా సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు వ్యక్తం చేస్తున్న నాయకులను అందరినీ బెదిరించి జోకొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో పారలేదు. 

దాంతో తక్షణం సీమాంధ్ర ప్రాంతపు ఉద్యమాన్ని అణిచేయడం లక్ష్యంగా.. ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేశారు. 

కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించినంత వరకు సీనియారిటీ పరంగా గానీ.. విలువల పరంగా గానీ.. చిత్తశుద్ధిపరంగా గానీ,  ప్రజాజీవితంలో  మమేకం అయి ఉండడంలో గానీ.. ఇంచుమించుగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో సరిజోడు అనదగని స్థాయిలో ఉండే నాయకుడు ఆంటోనీ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారు వెల్లడించే భయాందోళనలను వింటారంటూ వారు పేర్కొన్నారు. అయితే ఆంటోనీ రాజకీయ జీవితంలో ఈ కమిటీ అంత భ్రష్టుపట్టిపోయిన ఉదంతం మరొకటి ఉండకపోవచ్చు. ఈ కమిటీని కేంద్ర సర్కారు లేదా సోనియా.. తమ ఇంటి కుక్కలాగా కూడా.. కాదు.. తమ పంచన ఉండే వీధికుక్కలాగా వాడుకుంది. 

ప్రజలందరి సమస్యలను వారిని వినమన్నారు.  పార్టీ పరంగా ఏర్పాటు చేసిన కమిటీకి మేమెందుకు చెప్పాలి అని ఇతర పార్టీలు ఈసడిస్తే.. అప్పుడిక మంత్రుల కమిటీ (జీవోఎం) ఏర్పాటు చేశారు. ఆంటోనీ కమిటీ కూడా తన నివేదిక మంత్రుల కమిటీకి ఇస్తుందని చివరిక్షణాల వరకు ప్రకటించారు. కానీ.. ఆంటోనీ ఆ కమిటీ రూపంలో తన జీవితాన్ని భ్రష్టు పట్టించడం పట్ల ఎంత విముఖంగా ఉన్నారన్నది.. ఆయన నివేదిక ఇవ్వకపోవడంలోనే తెలుస్తున్నది. మంత్రుల కమిటీకి పేరుకు ఆయనను సారథిగా నియమించి.. ‘నిజాయితీ’ రంగు పులిమారు. వాస్తవానికి మన రాష్ట్రంనుంచే మన ఓట్ల భిక్షగా ఎంపీగా పదవి వెలగబెడుతున్న జైరాం రమేశ్‌.. తానే సకలం అయి చీలిక చక్రం తిప్పారు. 

మంత్రుల కమిటీ ప్రజలతో రకరకాల నాటకాలు ఆడడం ప్రారంభించింది. ప్రజలందరినీ, పార్టీని  తమతమ విజ్ఞప్తులు, చింతలు,భయాలు, కోరికలు ఏమిటో ఈమెయిళ్ల ద్వారా తెలియజేయమంటూ అత్యంత బాధ్యతా రహితంగా ఓ  ప్రకటన గుప్పించారు. 18వేల మెయిళ్లు వచ్చాయని వాటిని సాకల్యంగా పరిశీలించామని షిండే ప్రకటించారు గానీ.. డౌటే!

ఉద్యమాల్ని తొక్కడంలో వక్రనీతి

ఈలోగా సీమాంధ్రలో ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వాలకు బెంబేలెత్తించాయి. మరికొద్ది గంటల్లో దక్షిణాది గ్రిడ్‌ ఫెయిలయ్యే పరిస్థితి వస్తుందని, కొన్ని రాష్ట్రాలు అంధకారంలో మునిగిపోతాయని కేంద్రం భయపడే పరిస్థితిని ఉద్యోగులు కల్పించారు. ఢిల్లీ పాలకుల్లోని తుగ్లక్‌ స్వరూపం మళ్లీ ఒళ్లు విరుచుకుని నిల్చుంది. వారి మైండ్‌గేంలో  సమైక్యవాదాన్ని మాత్రమే వినిపించిన ముఖ్యమంత్రి దగ్గరినుంచి అందరూ పావులే అయ్యారు. సమ్మె చేస్తున్న వారిని పిలిపించి… వారికి ఏం మాయమాటలు చెప్పారో ఏమో గానీ.. మొత్తానికి అన్ని వర్గాల సమ్మెలను విరమింపజేశారు. 

రాష్ట్ర విభజన పరంగా విచ్చలవిడి నిర్ణయాల దిశగా దూసుకెళ్లిపోవడంలో.. ఈ సమ్మెలను విరమింపజేయడం అనేది కాంగ్రెస్‌ పార్టీ యొక్క వక్రబుద్ధికి పరాకాష్టగా చెప్పుకోవాలి. 

ఎవరు నాయకులు..? ఎవరు కాదు??

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన విషయానికి వచ్చేసరికి అందరూ నాయకులే! అందరూ కర్తవ్యదీక్షా పరాయణులే! కేంద్రప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నదో.. ఏం చేయబోతున్నదో.. ప్రక్రియను ఎలా ముందుకు తీసుకువెళ్లబోత్నుదో.. ప్రభుత్వంలో భాగస్వాములైన నాయకులు కాదు.. కనీసం ఎంపీగా కూడా అర్హత లేని కేవలం పార్టీ పదవులు మాత్రమే ఉన్న దిగ్విజయ సింగ్‌ … అంతా తానే అయినట్లుగా వెల్లడించేయడం అన్నది.. ప్రపంచంలో మరెక్కడా జరగని సంగతి. యావత్తు రాజ్యాంగ బద్ధంగా జరగాల్సిన ఒక ప్రక్రియను పార్టీ పదవి తప్ప మరేమీలేని ఒక కోన్‌కిస్కా నాయకుడు.. తానే సర్వకర్తను అన్నట్లుగా చెప్పడం అనేది కాంగ్రెస్‌ దిగజారుడు తనానికి నిదర్శనం. 

అయితే అంతకంటె దిగజారుడుతనం ఏంటంటే.. ఈ విభజన వ్యవహారంలో దిగ్విజయసింగ్‌, సుశీల్‌కుమార్‌ షిండే, పి.చిదంబరం కీలక భూమికను పోషించారని అనుకుంటే గనుక.. వారు ముగ్గురూ ఏ ఒక్క సందర్భంలోనూ రాష్ట్ర విభజనకు సంబంధించిన వివరాలను ఒక్కరీతిగా వెల్లడించినది లేదు. ఈ ముగ్గురు నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కతీరుగా మాట్లాడడమే కాదు, ఒకే నాయకుడు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు రీతుల్లో మాట్లాడుతూ.. మొత్తం వ్యవహారాన్ని భ్రష్టు పట్టించారు. ఇది ప్రజల్లో చాలా మితిమీరిన కన్ఫ్యూజన్‌ను సృష్టించింది. ఒకే విషయం గురించి ముగ్గురు మూర్ఖుల మాదిరిగా ముగ్గురూ మూడు తీరులగా తమకు నోచిన వ్యాఖ్యలు రువ్వుతూ.. ప్రజలను రకరకాలుగా తికమక పెట్టారు. 

కమిటీల ప్రకటన అంతా వంచనే…

ఇప్పుడు కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన  ముసాయిదా బిల్లులోని అంశాలను గమనించిన తరువాత.. మొత్తం క్లారిటీ వస్తోంది. జులై 30న ఏమైతే ప్రకటించారో.. అదే ఇవాళ కేబినెట్‌ నిర్ణయంగా వచ్చింది. మధ్యలో జరిగిన నాలుగు నెలల కసరత్తు యావత్తూ.. వృథా అన్నమాట. ఈ కమిటీలు అన్నీ ముఖప్రీతికి ఏర్పాటుచేసినవే అనే సంగతి ఆంటోనీకి నాలుగు రోజులు గడిచేసరికే క్లారిటీ వచ్చినట్లుంది. అందుకే ఆయన తాను తుగ్లక్‌ల పాలనలో విలువల గురించి ఆరాటపడడం తప్పు అని తెలుసుకుని ఈ విభజన ప్రక్రియ పట్ల నిర్లిప్తంగా ఉంటూ వచ్చారు. మంత్రుల కమిటీకి ఆయననే సారధిని చేసినా.. మొక్కుబడిగా చివరి సమావేశాలకు మాత్రమే హాజరయ్యారు. అలా కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీలు అన్నీ పిచ్చివాడి చేతి రాళ్లు మాదిరిగా వృథా అయ్యాయి. 

ఆ కమిటీలను నమ్మిన ప్రజలందరూ వెర్రివెంగళాయిల్లాగా నిరూపణ అయింది. ఆంటోనీ కమిటీ వద్దకు, మంత్రుల కమిటీ వద్దకు పదే పదే వెళ్లి మొరపెట్టుకున్న వారంతా.. వెధవలైపోయారు. వారిలో కాంగ్రెసుకే చెందిన సీమాంధ్ర కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు కీలక నాయకులు ఇలా ఎందరో ఉన్నారు.

కాంగ్రెస్‌ మాత్రం అచ్చంగా తుగ్లక్‌ మాదిరిగానే.. యావత్తు సీమాంధ్ర నాయకులను తమ ప్రభుత్వానికి దన్నుగా ఉన్న అందరి రాజకీయ భవిష్యత్తును ఎవరి ప్రయోజనాలకొరకో అర్థంకాని ఒక ప్రక్రియకోసం పణంగా పాతిపెట్టేసింది. వారందరి రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టేసింది. కమిటీలు అంతా కేవలం నాటకం.. ముందు తాము ఏదైతే అనుకుని ఉన్నారో.. కాంగ్రెస్‌ పెద్దలు దాన్ని మాత్రమే కార్యరూపంలోకి తెచ్చారు. కమిటీల ఏర్పాటు అనేది.. సాంకేతికంగా తమ విశృంఖలతకు కప్పుతున్న ఒక తొడుగు లేదా ముసుగు అనుకోవాల్సిందే. 

మిగిలిఉన్నది కూడా తుగ్లక్‌పాలనే!

ఇంకా రాష్ట్ర విభజనకు సంబంధించి.. కొత్త రాష్ట్రపు రాజధాని ఎంపిక వ్యవహారం ఒకటి మిగిలి ఉంది. నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి.. ఆ వ్యవహారాన్ని 45 రోజుల్లోగా తేలుస్తాం అంటూ షిండే ప్రకటించారు. అయితే రాజధాని ఎంపికకు వేయబోయే కమిటీ కూడా ఉత్తుత్తిదే.. కొత్త నాటకమే అని అందరూ నమ్ముతున్నారు. కమిటీ పేరుతో పైకి ఒక నాటకం నడిపిస్తుంటారు. అధ్యయనం అంటారు.. స్టడీ అంటారు. విజిట్స్‌ అంటారు. చివరికి అమ్మ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ కొత్త రాజధానిని ఎంపిక చేసేస్తారు. ఇప్పటికే అమ్మ ప్రాపకం మరియు దయకు పాత్రమైన నాయకులు ఆల్రెడీ ఎక్కడైతే వందల ఎకరాల భూములను కొనుగోలు చేసుకుని సిద్ధంగా ఉన్నారో.. ఆ ప్రాంతంలోనే రాజధాని కూడా వస్తుంది తప్ప.. నిపుణుల కమిటీ పూర్తి స్వేచ్ఛతో నిర్ణయిస్తుందని అనుకోవడం భ్రమ. అలా కమిటీలను పరిహాసాస్పదం చేస్తూ.. కేంద్రం తన విశృంఖలత్వాన్ని కొనసాగిస్తూ.. ప్రజలను యథేచ్ఛగా ఇప్పటికీ వంచిస్తూనే ఉంది. 

తుగ్లక్‌ కంటె నీచత్వం

నిజానికి తుగ్లక్‌ కూడా ఇంత నీచంగా, నీతిబాహ్యంగా వ్యవహరించడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తతిమ్మా 11 జిల్లాలకంటెపెద్దస్థాయిలో సమైక్య ఉద్యమం జరుగుతూ ఉండగా..  ఆ రెండు జిల్లాలను తెలంగాణలో కలిపేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా పుకార్లను లీక్‌చేసి… ఆ పుకార్లను నాలుగు రోజులపాటూ సజీవంగా ఉంచి.. ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు అందరూ.. బుట్టలో పడి.. మేం గత్యంతరం లేక రాయల తెలంగాణకు జై కొడతాం అంటూ.. తమ వక్రబుద్ధులను బయటపెట్టేసి సమైక్య క్రెడిబిలిటీని పోగొట్టుకున్నాక.. కేంద్రం తిరిగి యథేచ్ఛగా తాను ముందుకు అనుకున్న యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారమే వెళ్లిపోయింది. ఆ రెండుజిల్లాల నాయకుల్ని వెర్రి వెంగళాయిలుగా ప్రజల ముందు నించోబెట్టింది. వారు సమైక్యం అంటూ పరువు కాపాడుకుంటూ వచ్చి.. కేంద్రాన్ని నమ్మి.. రాయల తెలంగాణకు జైకొట్టి.. ఇవాళ మళ్లీ సమైక్య వాదుల ముందు అవకాశవాదులుగా ముద్రపడి మిగిలిపోయారు. పార్టీ వారికరి చేసిన లాభం అదీ!! రాయల తలెంగాణ అనే పదం చెప్పడం ద్వారా.. తెలంగాణ వారితో సీమ ప్రజలను రౌడీలు అని.. లుంగీలోళ్లు అని నానా మాటలు అనిపించి ఈ రెండు ప్రాంతాల మధ్య మనస్పర్ధలు, వైషమ్యాలు శాశ్వతంగా మిగిలిపోయేలా కాంగ్రెసు పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరించిందని చెప్పాల్పిందే. మాటొస్తే మనోభావాలు అనే పడికట్టు పదం వాడే కాంగ్రెసు.. సీమ వాసులను రౌడీలుగా తిట్టిస్తే వారి మనోభావాలు గాయపడతాయని ఎందుకు గుర్తించలేదో అర్థంకాని సంగతి. 

విభజన విషయంలో.. కాంగ్రెస్‌ పార్టీ దుర్మార్గంగా అచ్చోసిన ఆబోతులాగానే వ్యవహరించిన సంగతి ప్రజలు  కూడా గుర్తించారు. వారికి ఆ విషయంలో కాంగ్రెసు వారికి కూడా చాలా స్పష్టత ఉంది. అయితే ఇక్కడ రాజకీయాల్లో, ప్రత్యేకించి ప్రజాస్వామ్యంలో ప్రతి అయిదేళ్లకు ఒకసారి ప్రజల వద్ద అచ్చొత్తించుకోవాలనే సంగతి వారికి గుర్తున్నదో లేదో? ఈసారి గనుక.. అచ్చోసి మళ్లీ ఊరిమీదకు వదిలేయమని కోరుతూ కాంగ్రెస్‌ తెలుగు రాష్ట్ర ప్రజల చెంతకు వస్తే గనుక… అచ్చు వేయడం కాదు.. ఏకంగా కర్రులు కాల్చి వాతలు పెట్టేస్తారనే సత్యం మాత్రం మరో నాలుగు నెలలకు గానీ వారికి స్వానుభవంలో బోధపడే అవకాశం లేదు. 

అయితే కాంగ్రెసు పార్టీ ప్రధానంగా గుర్తించాల్సిన అంశం ఒకటుంది. ఇలాంటి నీతి మాలిన, రీతి తప్పిన అనల్పమైన వంచనలకు పాల్పడిన ఏ రాష్ట్రంలోనూ కూడా ఆ పార్టీ ఇప్పుడు మనుగడలో లేదని వారు గుర్తుంచుకోవాలి. ఒక్క సీమాంధ్రలో మాత్రమే కాదు.. ఇటు తెలంగాణలో కూడా ఆ పార్టీ అదృశ్యం అయిపోయినా ఆశ్చర్యపోకూడదని తెలుసుకోవాలి. 

-కపిలముని 

[email protected]