ఎమ్బీయస్‌ : హైదరాబాదులో సీమాంధ్రుల జనాభా ఎంత?

మంత్రుల ముఠా ఏం చేస్తోందో చాలా రోజులుగా లీకులు వస్తున్నా, కెసియార్‌ మౌనం పాటించారు. రాయల తెలంగాణ విషయం వచ్చినపుడే నోరు విప్పారు – యిది గట్టి ప్రతిపాదన అని మాకు న్యూస్‌ వచ్చింది…

మంత్రుల ముఠా ఏం చేస్తోందో చాలా రోజులుగా లీకులు వస్తున్నా, కెసియార్‌ మౌనం పాటించారు. రాయల తెలంగాణ విషయం వచ్చినపుడే నోరు విప్పారు – యిది గట్టి ప్రతిపాదన అని మాకు న్యూస్‌ వచ్చింది అంటూ. పనిలో పనిగా హైదరాబాదుపై ఆంక్షల గురించి కూడా మళ్లీ ఒకసారి నిరసన తెలిపారు. ఆంక్షలు లేని తెలంగాణా కావాలి, 28 రాష్ట్రాలకు లభించిన స్వేచ్ఛ తెలంగాణకూ వుండాలి. వేరేలా చూసినా, చేసినా వూరుకోం అని చెప్తూనే వున్నారు. ఇప్పుడు మళ్లీ చెప్పారు. ఉమ్మడి రాజధాని కాదు, తాత్కాలిక రాజధానే మాకు సమ్మతం అన్నారు. అది కూడా రాత్రికి రాత్రి పొమ్మంటే ఎక్కడకిపోతారు పాపం అని రెండు, మూడేళ్లు తలదాచుకోనిద్దామనే జాలితో సరేనన్నది అని వివరణ యిచ్చారు. నిజానికి శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం. దాన్ని కేంద్రం తన చేతిలో తీసుకోవాలని చూడడం దారుణం. ఈ సెషన్‌లో మతహింసనిరోధక బిల్లు ప్రవేశపెడదామని యుపిఏ చూస్తోంది. ఏ రాష్ట్రంలోనైనా మతకలహం జరిగితే రాష్ట్రం పిలవనక్కరలేకుండా కేంద్రం డైరక్టుగా తన బలగాలు దింపేయవచ్చు. ఇలా చేయడం రాష్ట్రాల హక్కులను హరించడమే, మేం ఒప్పుకోం అని అన్ని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో అంటున్నాయి. మరి అలాటప్పుడు తెరాస, యితర నాయకులు మాత్రం దానికి ఎందుకు ఒప్పుకుంటారు? కేవలం తమకంటూ ప్రత్యేకరాష్ట్రం యిస్తున్నారన్న కృతజ్ఞతతోనా? ఒప్పుకుంటే తెలంగాణ నాయకులందరూ కలిసి చేస్తున్న పొరబాటు యిది అని ఘంటాపథంగా చెప్పవచ్చు.

రాయల తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడే శాంతిభద్రతలు కేంద్రం తన చేతిలో ఎందుకు పెట్టుకోవాలి? అని కెసియార్‌ ప్రశ్నించారు. కేంద్రం ఏదో ఒక కారణం చెప్పి తీసుకోబోవచ్చు. కారణాలు ఏం చెప్పినా మేం దీనికి సమ్మతించం అని గట్టిగా ప్రతిఘటించాలి. అది మానేసి కెసియార్‌ గతం తవ్వబోయారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయినపుడు మద్రాసులో తెలుగువారు 14 లక్షల మంది వున్నా యిటువంటి రక్షణ గురించి ఆలోచించలేదు కదా, యిప్పుడు హైదరాబాదులో వున్న 5 లక్షల మంది సీమాంధ్ర జనాభా గురించి యింత హంగామా దేనికి? అని అడిగారు. మద్రాసునుండి విడిపోయినపుడు అక్కడ కెసియార్‌ లేరు. తెలుగువాళ్లను రాక్షసజాతిగా ఎవరూ వర్ణించలేదు. జాగో, భాగో అనలేదు. పండగకి సొంతవూరు వెళితే మళ్లీ రానివ్వం అనలేదు, నాలుకలు కోస్తాం, రక్తపుటేరులు పారిస్తాం వంటి నినాదాలు ఎవరూ యివ్వలేదు. అందుకని రాష్ట్రం విడిపోయినపుడు అటువంటి వూహే ఎవరికీ రాలేదు. మరి యిప్పుడు ఆ పరిస్థితి లేదు కదా! ఈ పరిస్థితుల ఎడ్వాంటేజి తీసుకుని కేంద్రం రెండు రాష్ట్రాలపై పెత్తనం తన చేతిలోకి తీసుకుంటోంది.

ఈ సందర్భంగా కెసియార్‌ హైదరాబాదులో సీమాంధ్రుల జనాభా 5 లక్షలే అనడం కాస్త వింతగా వుంది. దిక్కుమాలిన కమిటీ అని తను తీసిపారేసిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులోంచి ఆయన వుటంకించారు. అంటే ఆ రిపోర్టును సమర్థించినట్లా? కాదా? దాని సిఫార్సులు అంగీకరించినట్లా? డేటాను అంగీకరించినంత మాత్రాన, కన్‌క్లూజన్స్‌ను అంగీకరించినట్లు కాదని మనందరికీ తెలుసు. మరి ఆ రిపోర్టులోని డేటాను అంగీకరించారనుకోవాలా? దాని ప్రకారం 1956 తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా అభివృద్ధి చెందినట్లు వుంది. మళ్లీ అది ఒప్పుకోరు కెసియార్‌. ఈ ఒక్క అంకె మాత్రమే ఒప్పుకుంటున్నారు, తన వాదనకు అనువుగా వుందని. మళ్లీ అదే నోటితో లక్షమంది సీమాంధ్రులు హైదరాబాదులో అక్రమంగా ఉద్యోగాల్లో వున్నారంటారు. సక్రమంగా వున్నవాళ్లు కూడా అంతో, లేక దానిలో సగమో, ముప్పావో వుంటారనుకుంటే లక్షన్నర నుండి రెండు లక్షల దాకా సీమాంధ్ర ఉద్యోగులే వుంటారు. కుటుంబానికి నలుగురు సభ్యులున్నా ఆరు నుండి ఎనిమిది లక్షలు తేలారు. మరి కర్రీ పాయింటువాళ్లు, రొయ్యలమ్ముకునేవాళ్లు, యిడ్లీ బండి వాళ్లు – వీళ్లంతా కనీసం ఓ లక్ష మందైనా వుండరా? బంజారా హిల్స్‌, జూబిలీ హిల్స్‌ నిండా వాళ్లే, ఫిల్మ్‌ నగర్‌ నిండా వాళ్లే అని కూడా కెసియార్‌, ఆయన అనుచరులు తరచుగా అనే మాట. ఉద్యోగులు అక్కడుంటారనుకోం కదా. మరి అక్కడ జనాభా కలపవద్దా? వాళ్లూ, వాళ్ల కుటుంబసభ్యులు.. అందరూ కలిసి ఎంతమంది వుంటారు? మొత్తం 5 లక్షలేమిటి స్వామీ అని డైరక్టుగా అడిగితే కెసియార్‌ ఏం సమాధానం చెపుతారా అని ఆలోచించాను. 'నేను ఆంధ్రోళ్లలో మనుష్యుల గురించే చెప్పాను. తక్కినవాళ్లందరూ రాక్షసులే. వాళ్లను లెక్కపెట్టలేదు' అని చెప్పవచ్చును.

అసలు మన భారతదేశంలో వాస్తవాలకు, అంకెలకు గౌరవం లేదు. కవుల దగ్గర్నుంచి రాజకీయనాయకుల దాకా అందరూ అతిశయోక్తులు చెప్పేవారే.  తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన కొత్తల్లో 'ఇది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష' అనేవారు. ఓ నాలుగేళ్లు పోయేసరికి ఆ జనాభా హఠాత్తుగా అరకోటి పెరిగిపోయింది. నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్ష అనసాగారు. నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీ చేష్టలను గమనిస్తున్నారు అనసాగారు. నిజానికి తెలంగాణ జనాభా 3.5 కోట్లు. రాయల తెలంగాణ ఏర్పరిస్తే చేరే జనాభా కూడా నాలుగున్నర కోట్లు లేదు. అయినా అందరూ అదే పాట పాడుతున్నారు. ఇప్పుడు 5 లక్షల అంకె కూడా అలాటిదే అనుకోవచ్చా? జస్టిస్‌ శ్రీకృష్ణ గారు కూడా యిలాటి పొరబాటు చేశారా? 

ఆ మాట అనేముందు అసలు ఎవరు సీమాంధ్రులు అన్న నిర్వచనం కావాలి. కెసియార్‌ దృష్టిలో సీమాంధ్రుడు ఎవడు? జస్టిస్‌ కృష్ణ దృష్టిలో సీమాంధ్రుడు ఎవడు? అక్కడుంది తిరకాసు. శ్రీకృష్ణగారి సంగతి నేను చెప్పలేను – ఆయన తన రిపోర్టులో నిర్వచనం యివ్వలేదు కాబట్టి! కానీ కెసియార్‌, తదితర ఉద్యమకారుల దృష్టిలో సీమాంధ్రుడు అన్నవాడెవడో తెలుసు. ఇక్కడే పుట్టి, యిక్కడే చదువుకుని, యిక్కడే ఉద్యోగం చేస్తూ, యిక్కడే శాశ్వతంగా నివసిస్తూన్నవాడు కూడా తెలంగాణవాడు కాకుండా పోవచ్చు – అతని తండ్రి లేదా తాత ఆంధ్ర నుండి వచ్చి వుంటే! విభజనను అంగీకరించకపోయినా తెలంగాణవాడు కాడు. అంగీకరిస్తే పదేళ్ల క్రితం వచ్చిన గుజరాతీ అయినా, యిరవై ఏళ్ల క్రితం వచ్చిన మార్వాడీ అయినా స్థానికుడి కిందే లెక్క. ఈ నిర్వచనం పెట్టుకుని తెరాస, టి-జాక్‌ మాత్రమే కాదు, టి-కాంగ్రెసు, టి-టిడిపి నాయకులు తమకు ప్రత్యర్థులందరినీ తిట్టిపోస్తున్నారు. సీమాంధ్ర మీడియా అంటారు, సీమాంధ్ర పెట్టుబడిదారులు అంటారు. వాళ్ల దృష్టిలో కిరణ్‌కుమార్‌ రెడ్డి యిక్కడే పుట్టి, యిక్కడే చదువుకున్నా తెలంగాణ వ్యక్తి కాదు. ఖమ్మం ఎంపీగా వుండిన రేణుకా చౌదరి తెలంగాణ  మహిళ కాదు. నిజామాబాద్‌లో పుట్టి, యిక్కడే పెరిగి, యిక్కడే ఉద్యోగం చేసి, పరిశ్రమ పెట్టి, తెలంగాణ ఉద్యమానికి పూర్తి సహకారం అందించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ వ్యక్తి కాదు. 

వీళ్లందరినీ కలిపినా యింకా ఐదు లక్షలమంది మాత్రమే అంటే కెసియార్‌ లెక్కల్లో వీక్‌ అనే చెప్పాలి. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]