‘‘ద్రౌపది’’ వ్యాసంలో భుజంగరాయ శర్మగారి గురించి రాస్తూ నేను ‘పండితమ్మన్యులు’ అని విశేషణం చేర్చాను. డా|| విష్ణునందన్ అనే మెడికల్ డాక్టర్ మెయిల్ రాశారు. ‘అయ్యా పండితమ్మన్యుడు అంటే తనను తాను పండితుడిగా భావించేవాడు. పండితమ్మన్యుడు, నాయకమ్మన్యుడు యిలాటివన్నీ వ్యంగ్యార్థంలో వాడతారు’ అని. నిఘంటువు చూశాను. ఆయనే కరక్టు. భుజంగరాయ శర్మగారి గురించి అలా అంటే కళ్లు పోతాయి. ‘పండితులలో మాన్యులు’ అని నా భావం. మాట బాగుంది కదాని వాడేశాను. దెబ్బ తినేశాను. క్షంతవ్యుణ్ని.
నేనే కాదు, ఎవరైనా సరే యిలాటి తప్పులు రాయకూడదు. ఎవరైనా ఆ వ్యాసం చదివి, యీ కరక్షన్ చదవకపోతే ఆ పదాన్ని ఆ అర్థంలో వాడేసే ప్రమాదం వుంది. తెలుగు బాగా రాస్తారు అని పేరు తెచ్చుకున్నాక మధ్యలో యిలాటి తప్పులు చేస్తే వీటికి అవసరంగా ఆథెంటిసిటీ వస్తుంది. నేను వాడానని మరొకరు, ఇద్దరు వాడారు కదాని మరో నలుగురు.. యిలా తప్పులు స్థిరపడిపోతాయి. ఇలా జరిగిన కొన్ని తప్పుల గురించి చెపుతా.
ఇలాగే గతంలో ఓ సారి ‘హాసం’ ఎడిటోరియల్ రాసేటప్పుడు సభలో వున్నవారనే అర్థంలో ‘సభికులు’ అని పదం వాడేను. పేరి రవికుమార్ అనే ఆయన ఫోన్ చేసి ‘సభికులు అంటే సంస్కృతంలో జూదం ఆడించేవారని అర్థం, మీరు సభాసదులు అనలేక పోయారా..’ అన్నారు. తెల్లబోయాను. ‘మరి ఎంతోమంది పెద్దపెద్ద వక్తలు సభికులకు నమస్కారం అంటారు. పత్రికలలో సభికులు సంతోషించారు అని రాస్తారు…’ అని అడిగాను. ‘తెలిసున్న వాళ్లు అలా అనరు, రాయరు. నారాయణరెడ్డి గారు చూడండి, సదస్యులకు నమస్కారం అంటారు’ అని ఎత్తి చూపారు ఆయన.
నిజమే. నిఘంటువు చూస్తే ఆయన చెప్పినదే కరక్టు. ఇలాగే మనవాళ్లు తప్పుటర్థంలో వాడే యింకో పదం వుంది. ‘ఘోటక బ్రహ్మచారి’ అని. చాలా నిష్ఠగా బ్రహ్మచర్యం పాటించేవారిని మెచ్చుకుంటూ యీ మాట ప్రయోగిస్తారు. ఓ సారి తిరుమల రామచంద్రగారు ఓ వ్యాసంలో రాశారు – ఘోటకం అంటే మగ గుఱ్ఱం. అది ఆడ గుఱ్ఱం దొరికేవరకు రతిపై ఆసక్తి లేనట్టు వుంటుంది. దొరికిందో చూసుకో నా తడాఖా అంటుంది. దాని శరీరంలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే కొందరు స్త్రీ లభ్యం కానంతసేపు బ్రహ్మచర్యం పాటిస్తారు. దీన్నే తురంగ బ్రహ్మచర్యం అని కూడా అంటారు. (మనవాళ్లు దేవాంతకులు. పశుపక్ష్యాదులను కూడా బాగా పరిశీలించి పలుకుబళ్లు సృష్టించారు. పెళ్లిలో సరిగ్గా భోజనాలు పెట్టని సందర్భాలలో ‘ఇక మనకు దుప్పి భోజనమే గతి’ అనేవారు పెద్దవాళ్లు. ఎవడైనా ఖాళీగా కూచుంటే ‘ఏముంది, దుప్పి భోజనం చేస్తున్నాడు’ అనేవారు. ఈ మాటకు అర్థం ఏమిటాని నిఘంటువు తిరగేసి అర్థం తెలుసుకుని హారినీ ఏం అబ్జర్వేషనూ, ఏం ఇన్‌ఫరెన్సూ అనుకున్నాను).
నేను ‘సింపుల్‌టన్’ అనే మాట వినివున్నాను. సింపుల్‌గా జీవితం గడిపేవారిని అలా అంటారని అనుకున్నాను. మా ఫ్రెండు నాన్నగారితో ఓ సారి ఒకాయన గురించి చెపుతూ ”చాలా తెలివైనాయనండి. అయినా సీదాసాదాగా వుంటారు. గొప్ప సింపుల్‌టన్!” అన్నాను. ఆయన అదోలా చూసి ”బాబూ, సింపుల్‌టన్ అంటే ఏమిటో డిక్షనరీ చూసి మాట్లాడితే బాగుంటుందేమో” అన్నారు. వెంటనే యింటికి వచ్చి చూసి కెవ్వుమన్నాను. ”దద్దమ్మ” అని అర్థం. అప్పటికే కొన్నేళ్లగా చాలామందిని ”మీకు హంగూ ఆర్భాటం లేదు. చాలా సింపుల్‌టన్” అని మొహం మీద మెచ్చుకున్నాను కూడా. వాళ్లందరినీ గుర్తు చేసుకుని నా ఇంగ్లీషు పట్ల ఎంత జాలిగా చూసివుంటారో వూహించుకుని విలవిలలాడేను.
నేను వాడలేదు కానీ కొందరు ఫ్రీనెస్ అనే మాట చాలామంది వాడగా విన్నాను. బస్టాండ్‌లో మా ఫ్రెండు ఆ పదం వాడుతుండగా విన్న పంచెకట్టు పెద్దాయన ”బాబూ ఫ్రీడమ్‌కీ, ఫ్రీనెస్‌కి తేడా ఏమిటి?” అని అడిగాడు అమాయకపు మొహం పెట్టి. మావాడు ఆయన వంక జాలిగా చూసి ”చాలామంది రెండూ ఒకటే అనుకుంటారు. కానీ కాదు. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. ఫ్రీనెస్ అంతకంటె దానికి ఓ మెట్టు పైన. ఇంకా ఫ్రీగా వుండడం అన్నమాట.” అని విశదీకరించాడు. అంతలో బస్సు రావడంతో ఆయన ఎక్కి వెళ్లిపోతూ ”నీ వల్ల యిన్నాళ్లకి ఓ కొత్తమాట తెలుసుకున్నాను నాయనా” అన్నాడు. మా వాడు కాలరెగరేశాడు కానీ నాకు అనుమానం తగిలింది. చూడబోతే రోశయ్యగారిలా వున్నాడు, ఇది వెటకారమేమో అని. ఇంటికి వచ్చి చూశా. ఫ్రీనెస్ అనే మాట లేనే లేదు!
అలాగే ఎటికసీ.. అనే మాట కూడా, చాలామంది దగ్గర విన్నాను ఆ మాటని. ఓ సారి మా మామయ్య దగ్గర వాడి చూస్తే ”ఏంరోయ్, కొత్త డిక్షనరీ రాస్తున్నావా?” అని అడిగాడు. ఎక్కడో దూడ వేశామని అనుమానం వచ్చి చూడబోగా ఎటికసీ మాటే లేదు. ఎటికెట్ వుంది. మనం డీసెన్సీ, కర్టెసీ అంటాం కదా, అదే వరవడిలో ఎటికసీ అనేస్తాం.
ఇంగ్లీషు మాతృభాష కాదు కాబట్టి మనం యిలాటి పొరపాట్లు చేస్తున్నామనుకోవద్దు. శారా పాలిన్ (అలాస్కా గవర్నరుగా చేసి రిపబ్లికన్ పార్టీ ద్వారా 2008లో జాన్ మెక్ కెయిన్‌కి రన్నింగ్ మేట్‌గా అమెరికా ఉపాధ్యక్షురాలు కాబోయి మానేసిన వ్యక్తి. ఈ సారి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెంటు కాండిడేటు అంటున్నారు) రెండు మూడు వారాలక్రితం ‘రిఫ్యూడియేట్’ అనే మాట పుట్టించింది, అనుకోకుండా. వెనకటి కెవడో అశ్వం అందామా, గుఱ్ఱం అందామా అని తర్జనభర్జన పడి చివరికి ‘గుశ్వం’ అన్నాట్ట. అలాగ యీవిడ గ్రౌండ్ జీరో వద్ద మసీదు కడతానన్న ముస్లిములతో మాట్లాడుతూ రిఫ్యూట్, రిప్యూడియేట్ (తిరస్కరించు అని అర్థం) అనే పదం వుపయోగించింది.
అందరూ నవ్వారు. ఆమె తనను తాను సమర్థించుకుంటూ షేక్‌స్పియరూ కొత్త మాటలు సృష్టించాడు. జార్జి బుష్ ‘మిస్‌అండర్‌ఎస్టిమేట్’ అనే పదం పుట్టించలేదా? ఇలాటివి జరిగినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి అంది. మిస్‌అండర్‌స్టాండింగ్ పదం వుంది. అండర్‌ఎస్టిమేట్ పదం వుంది. బుష్ రెండూ కలిపి యీ పదాన్ని సృష్టించాడు.
పదాలు సృష్టించిన వాళ్లందరికీ మాయాబజారులోలా వీరతాళ్లు వేయరు. చాలామందికి తాటాకులు కడతారు. ప్రస్తుతం శారా పాలిన్‌కి అమెరికన్లు చేస్తున్నది అదే! (గ్రేట్ ఆంధ్రకై 2010 ఆగస్టులో రాసిన వ్యాసం)
– ఎమ్బీయస్ ప్రసాద్
