బాపు అనగానే అందమైన అమ్మాయిల బొమ్మలు, దేవుళ్ల బొమ్మలు మాత్రమే గుర్తుకువస్తాయి కొందరికి.
కథ సబ్జక్ట్ బట్టి, సందర్భం వచ్చినప్పుడు బాపు సమాజం పట్ల తన అవగాహనను తెలియపరచారు. పేద ప్రజల నిర్భాగ్యపు బ్రతుకులకు కుంచెతో రూపం కల్పించారు. క్రింద నిచ్చిన ఉదాహరణలు చూడండి. అవే ఆయిల్ పెయింటింగులుగా అంతర్జాతీయ కాన్వాస్‌కి ఎక్కి ఉంటే ప్రపంచ ప్రఖ్యాతులయ్యేవారు బాపు. ఎందుకంటే లిపికి పరిమితులున్నాయి. చిత్రానికి లేవు. విశ్వంలో ఏ మూలనున్న పెదవాడి కైనా ఆకలి బాధ, ఆకలి భాష ఒక్కటే! ఈ బొమ్మలతో ఐడెంటిఫై చేసుకుంటాడు.
స్వాతంత్య్రం వచ్చి యిన్నేళ్లయినా అకలిచావులను మట్టుపెట్టలేకపోయాం. సమాజంలోని హీనుల, దీనుల దురవస్థ గురించి వేదికలెక్కి ఉపన్యసించకపోయినా, వ్యక్తిగత సంభాషణలలో బాపు గారు ఎంతో ఆవేదన వ్యక్తపరుస్తారు. చిన్నపిల్లలకు వీడియోపాఠాలు వంటి కష్టతరమైన ప్రాజెక్టు బాపు, రమణలు అంగీకరించడానికి కారణం – వారికి సమాజ స్థితిగతుల పట్ల గల ఆవేదనే!
ఎంతటి ఆవేదన లేకపోతే ఈ చిత్రాలు రూపుదిద్దుకునే వంటారు !?
ఒకదాంట్లో ఓ పేదవాడు కొరతవేయబడి వున్నాడు. అతను శిలవ ఎక్కినది మన పాపాలకోసమే! అతని స్థితిగతులపట్ల మనం చూపిన నిర్లక్ష్యం వల్లనే!
పేదలు ఎక్కువగా నమ్ముకునేది భూమినే. ఆర్థిక కారణాల వల్ల స్వంతదారులు ఆ భూమిని పంచు కున్నప్పుడు దాని వల్ల నష్టపోయేది ఎవరో వేరే చెప్పాలా? ఊరు వదలి కొలువు కోసం బిడ్డతో నగరం దారి పట్టిన పేదరైతు అతను.
ఈనాటి పౌరుడి స్థితి చూడండి. ఖాళీ కడుపుతోనే జీవితాన్ని ఈడ్చుకు వచ్చేస్తున్నాడు. రేపటి పౌరుడి యీ నాటి దుస్థితి చూడాలంటే వేరే ఎక్స్‌రేలు అక్కరలేదు. సూర్యకాంతి చాలు అతను నడిచే అస్థిపంజరం అని చూపడానికి.
ధనికులు పేదలను హింసించే విధం చూడండి. కొందరికి పేదల రక్తం రెడ్‌వైన్ అయితే, మరి కొందరికి వారి కళేబరాలు పులిగోరు పతకాలు!
ఎమ్బీయస్ ప్రసాద్