ప్రాంతీయ పార్టీల నిర్మూలనే మోడీ లక్ష్యమా?

2014 లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు పాతిక పార్టీలు ఒక్క సీటు కూడా సాధించలేదు. ఎన్‌డిఏలోనే 17 పార్టీలకు కేవలం సున్నా సీట్లు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్‌ లాంటి అతి పెద్ద పార్టీలో సమాజ్‌వాది పార్టీకి…

2014 లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు పాతిక పార్టీలు ఒక్క సీటు కూడా సాధించలేదు. ఎన్‌డిఏలోనే 17 పార్టీలకు కేవలం సున్నా సీట్లు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్‌ లాంటి అతి పెద్ద పార్టీలో సమాజ్‌వాది పార్టీకి కేవలం 5 సీట్లు రాగా బహుజన సమాజ్‌ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. బీఎస్‌పీ గతంలో ఉత్తర ప్రదేశ్‌లో అధికారం చలాయించింది. కేంద్రంలో ఏ సర్కార్‌ వచ్చినా బీఎస్‌పీ కీలక పాత్ర పోషించేది. సమాజ్‌వాది పార్టీ కూడా అలాంటి పాత్ర గత కొన్నేళ్లుగా పోషిస్తూ వచ్చింది. ఈ రెండు పార్టీల ఎంపిలను కొనుగోలు చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. అలా కొనుగోలు చేయకుండా చేసేందుకు, తమపై సీబీఐ దృష్టి మళ్లకుండా ఉండేందుకు బీఎస్‌పీ, ఎస్‌పీలు కేంద్రంలో యూపిఏ సర్కార్‌కు మద్దతునిచ్చాయి. యూపీఏ సర్కార్‌లో కాంగ్రెస్‌కు గట్టి మద్దతునిచ్చిన పార్టీల్లో డీఎంకే కూడా ఒకటి. అలాంటి పరిస్థితి ఎన్నికల తర్వాత మారిపోయింది. బీహార్‌లో కూడా జనతాదళ్‌ (యు) పరిస్థితి కూడా బాగా దెబ్బతింది.

ఎన్నికలైన తర్వాత చూస్తే బీజేపీకి 281 సీట్లు రాగా ఎన్డీఏకు దాదాపు 330 సీట్లు వచ్చాయి. లోక్‌సభలో 275 సీట్లు మాత్రమే అధికారంలోకి రావడం అవసరం. అందువల్ల బీజేపీకి ఇతర పార్టీల మద్దతు ఏమాత్రం అవసరం లేదు. దాదాపు 30 ఏళ్ళ తర్వాత దేశంలో సంకీర్ణ యుగం అంతమై ఒకే ఒక్క పార్టీకి ప్రజలు అధికారాన్నిచ్చారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లభించలేదు. 

ఎన్నికలకుముందు ఆరు పార్టీలను లోక్‌సభలో జాతీయ పార్టీలుగా గుర్తించారు. వాటిలో కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, బీఎస్‌పీ, ఎన్‌సీపీ, సీపీఐ(ఎం) ఉన్నాయి. కనీసం 6 శాతం సీట్లు వస్తే ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎన్నికల కమిషన్‌ గుర్తిస్తుంది. కాని ఎన్నికల తర్వాత ఎన్‌సీపీ, సీపీఐ, బీఎస్‌పీ మూడూ జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. సీపీఐ (ఎం) పడుతూ లేస్తూ జాతీయ పార్టీ హోదాను దక్కించుకుంది. లోక్‌సభలో మొత్తం 39 పార్టీలున్నాయి కాని అందులో 24 పార్టీలకు కేవలం 5 సీట్లలోపే ఉన్నాయి. వాటిలో అన్నీ ప్రాంతీయ పార్టీలే. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని దాదాపు ఉత్తరాది పార్టీగా పరిగణించేవారు. పశ్చిమ బెంగాల్‌, కేరళ లాంటి పార్టీల్లో బీజేపీకి ఉనికే ఉండేది కాదు. కాని ఈ సారి బీజేపీ దేశ వ్యాప్తంగా విస్తరించింది. బెంగాల్‌, కేరళల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్ల శాతం సాధించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బెంగాల్‌లో కూడా బీజేపీ సభ్యుడు ఒకరు గెలిచారు.

అయితే అంత మాత్రాన ప్రాంతీయ పార్టీలను బీజేపీ ఖతం చేసినట్లు కాదు. ఉప ఎన్నికల్లో ఎస్‌పీ ఉత్తర ప్రదేశ్‌లో పుంజుకోగా, బీహార్‌లో లాలూ` నితీష్‌ కూటమి చెప్పుకోదగ్గ సీట్లను సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలం అంత ఉధృతంగా ఊహించని ప్రాంతీయ పార్టీలు కలిసికట్టుగాను, కాంగ్రెస్‌, వామపక్షాలతోనూ చేతులు కలిపి లౌకిక పార్టీల పేరుతో బీజేపీని ఎదుర్కొనేందుకు సన్నద్దమవుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో కూడా బీజేపీ ప్రవేశిస్తుందని ఊహించని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తనతో చేతులు కలపాల్సిందిగా ఆఖరుకు వామపక్షాలకు కూడా పిలుపిచ్చేంత వరకు వెళ్లారు.

నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలకు ఈ పరిస్థితి తెలియనిది కాదు. వారిద్దరి వ్యూహం ఒక్కటే. అది దేశ వ్యాప్తంగా బీజేపీని విస్తరింపచేయాలన్నది. దేశంలో ఒకే పార్టీ ఉంటేనే సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని, ఎవరి బ్లాక్‌మెయిల్‌కూ లొంగాల్సిన అవసరం లేదని, దేశాభివృద్ధి జరగాలంటే ఒకే పార్టీ ఉండాలని మోడీ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రతి చోటా చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మోడీ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచార సభల్లో ఉధృతంగా పాల్గొంటున్నారు. రోజుకు కనీసం నాలుగు సభల్లో మాట్లాడుతున్నారు. బీజేపీ లాంటి జాతీయ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి నష్టం అని చెబుతున్నారు. మోడీ ఇంత ఉధృత ప్రచారం చేయడం చూసి ప్రాంతీయ పార్టీలైన ఎన్‌సీపీ, శివసేన తదితర పార్టీల గుండెల్లో వణుకు ఏర్పడిరది. అసలు తమతో బీజేపీ తెగతెంపులు చేసుకుంటుందని శివసేన కలలో కూడా  ఊహించలేదు. గతంలో లాగా తమ ఒత్తిళ్లకు బీజేపీ లొంగుతుందని, ఇచ్చిన సీట్లలోనే పోటీ చేస్తుందని శివసేన భావించింది. కాని నరేంద్రమోడీ ఏకంగా శివసేననే విస్మరించాలని నిర్ణయించారు. శివసేనకూ బీజేపీకి దాదాపు పాతికేళ్ల అనుబంధం ఉన్నది. అంతేకాక సిద్దాంతాల విషయంలో రెండు పార్టీలు దాదాపు ఒకటే. అయినప్పటికీ నరేంద్రమోడీ శివసేనను లెక్కచేయకుండా ఒంటరి పోటీలో దిగి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనితో మహారాష్ట్రలో బీజేపీ తొలి సారి స్వంత మెజారిటీతో అధికారంలోకి వస్తుందేమోనని ప్రాంతీయపార్టీలు కలవరపడుతున్నాయి. 

ప్రాంతీయ పార్టీలను జాతీయ స్థాయిలో కన్నా, ఆయా రాష్ట్రాల్లోనే ఢీకొనడం మంచిదని మోడీ భావిస్తున్నట్లున్నారు. అందుకే వారి రాష్ట్రాల్లోనే వార్ని తుడిచిపెట్టాలని భావిస్తున్నారు. అప్పుడు వారు జాతీయ స్థాయిలో తమతో పోటీకి దిగేంత సత్తా చూపించలేరు. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీలను బీజేపీ దెబ్బతీస్తే ఇక కేంద్రంలో వాటి పాత్ర కూడా ఏ మాత్రం ఉండదు. ఇదే వ్యూహాన్ని మోడీ ఇతర రాష్ట్రాల్లోనూ క్రమంగా అమలు చేయాలని భావిస్తున్నారు. తమిళనాడులో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు పాలు కావడంతో ఆ పార్టీ ఉనికే ప్రమాదంలో పడిరది. ఈ పేరుతో తమిళనాడులో కూడా రజనీకాంత్‌ లాంటి వార్ని చేర్చుకుని బీజేపీ స్వంతంగా రంగంలోకి దిగి డీఎంకేను ఢీకొనే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగుదేశం పార్టీని బీజేపీ చాలాకాలం సహించే అవకాశాలు లేవు. ఇప్పటికే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో స్వంతంగా విస్తరించే కార్యక్రమాలు చేపట్టింది. హరిబాబు, కేఎస్‌ రావు లాంటి నేతలు పార్టీని బలోపేతం చేస్తున్నారు. వెంకయ్యనాయుడును కూడా పార్టీని బలోపేతం చేసేందుకు పూనుకోవాలని, చంద్రబాబును ఎక్కువగాప్రోత్సహించకూడదని బిజెపి అధిష్ఠానం అదేశించింది. ఇతర పార్టీలలో ఉన్న దళిత నేతలను  ప్రోత్సహించడం ఇప్పటికే ప్రారంభించింది. వచ్చే ఎన్నికల నాటికి పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ ఉధృతంగా ఉపయోగించుకుంటుంది. ఆయన ద్వారా చిరంజీవిని కూడా ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రబాబునాయుడు అడిగిన విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, నిధుల విషయంలో బీజేపీ సర్కార్‌ స్పందించే అవకాశాలు లేవు. ఎంతో కొంత విదిలించి సంతృప్తిపరచాలనే భావిస్తోంది. కాని చంద్రబాబును పూర్తిగా విజయవంతం చేయాలని బీజేపీ భావించడం లేదు. అయితే నరేంద్రమోడీని మెప్పించాలని మాత్రం చంద్రబాబు ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రకటించిన స్వచ్చ భారత్‌ లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయినా మోడీ మనసు కరగడం లేదు. తెలుగుదేశం ఆత్మస్థైర్యం, ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నేతల్ని కూడా బీజేపీలోకి ఆహ్వానించి సీమాంధ్రలో బలోపేతం కావడం నరేంద్రమోడీ ఉద్దేశం. సైద్దాంతికంగా సంబంధాలున్న శివసేన విషయంలోనే నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన మోడీకి తెలుగుదేశంను ప్రక్కన బెట్టడం ఇంకా సులువు.