మలాలా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియనివారు లేరిప్పుడు. పాకిస్తానీ బాలిక అయిన మలాలాపై తాలిబన్లు దాడి చేసే సరికి ఈమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. అసలామె బతకడమే కష్టం అనుకున్నారంతా. ఆమెపై జరిగిన దాడి అలాంటిది. తల దాదాపు ఛిత్రమైపోయింది. ఆమె తలకు చాలా ఆపరేషన్లు జరిగాయి. గుండె నిబ్బరం, సంకల్పం.. ఇవే ఆమెను బతికించాయి. తనతోపాటు బాల బాలికలంతా చదువుకోవాలని ఆమె ఆకాంక్షించడమే ఒకప్పుడు ఆమె ప్రాణమ్మీదకు తెచ్చింది.. ఆ ఆశయమే ఇప్పుడామెకు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం మలాలా బ్రిటన్‌లో వుంటోంది. ఆమెకు బ్రిటన్ ఆర్థికంగా చేయూతనిచ్చింది. ఆమె కోలుకోవడానికీ, బాలికల చదువు విషయమై తన అనుభవాల్ని పంచుకోవడానికి ఆమె అవకాశాలు కల్పిస్తోంది బ్రిటన్. ఒక్క మాటలో చెప్పాలంటే మలాలాను ఉక్కు బాలికగా మార్చింది బ్రిటన్ అనొచ్చేమో. ఉక్కు తూటాల్ని ఎదుర్కొని, నోబెల్ అందుకోనున్న మలాలా పూర్తి పేరు మలాలా యూసఫ్ జాయ్.
ఇక, మలాలా నోబెల్ బహుమతి అందుకుంటోన్న అతి పిన్న వయస్కురాలు కావడం మరో విశేషం. భౌతిక శాస్త్రవేత్త విలియమ్ లారెన్స్ పాతికేళ్ళ వయసులో నోబెల్ బహుమతిని అందుకున్నారు. అదే ఇప్పటిదాకా రికార్డ్. ఇప్పుడు ఆ రికార్డ్‌ని మలాలా బ్రేక్ చేసింది.