ఎన్టీయార్ డబ్బు వ్యవహారాల్లో చాలా నిక్కచ్చి అని అందరూ చెపుతారు. నచ్చితే పొదుపరి అనవచ్చు, నచ్చకపోతే పిసినారి అనవచ్చు. పారితోషికాన్ని మధ్యలో పెంచి నిర్మాతలను ఏడిపించారని ఎవరూ ఆరోపించలేదు. అలాగని ఇస్తానని ఒప్పుకున్న డబ్బు యివ్వకపోయినా ఫర్వాలేదు, తర్వాతి సినిమాల్లో చూసుకుందాం అనేంత ఔదార్యం ఉందనీ అనలేదు. ఇవ్వాల్సిన డబ్బు కచ్చితంగా టేబులు మీద పెడితేనే, డబ్బింగుకి వచ్చేవారట. నిర్మాతల దగ్గర నుంచి డ్రస్సులు తీసుకున్నారనీ, టవల్సు తీసుకున్నారనీ, హోటల్ బిల్లులు కట్టించారనీ యిలాటివి చాలామంది అంటారు. అలాటివి ఆయన కాంప్లిమెంట్స్ గానే భావించి తీసుకుని వుండవచ్చు.
ఇచ్చిన నిర్మాతలెవరూ ఫిర్యాదు చేయలేదు. టవలు పట్టుకెళతానంటే వద్దని చెప్పలేదు. సినిమా మధ్యలో అలా అంటే కోపం వస్తుందని తమాయించుకున్నారు అనుకున్నా, తర్వాతి సినిమాకి బుక్ చేశారంటే ఏమిటి అర్థం? అదో పెద్ద విషయంగా వాళ్లు భావించలేదు. కూతురి పెళ్లికి నా చేత హోటల్ రూమ్స్ బుక్ చేయించాడని ఆత్మకథలో రాసిన ఎమ్మెస్ రెడ్డి, ఎన్టీయార్ బతికుండగా ఆ మాట చెప్పలేదు. నిర్మాతలు హీరోను సంతోషపెట్టడానికి తలకిందులుగా తపస్సు చేయడానికి కూడా సిద్ధపడడం యిప్పటికీ చూస్తూనే వుంటాం. అదే హీరోకి మార్కెటు పోతే ఫోన్లు కూడా ఎత్తరు. ఇక ఎన్టీయార్ నిర్మాతగా ఎలా వ్యవహరించారు? సినిమా బజెట్ మించిపోకుండా చాలా జాగ్రత్త పడినా, ఏ నటుడికీ పారితోషికం ఎగ్గొట్టినట్లుగా ఎవరూ అనలేదు.
వినికిడి ఏమిటంటే చాలా తక్కువ పారితోషికం ఆఫర్ చేసేవారట. నటించేటప్పుడు రిహార్సల్స్ వేయాలని, టైముకి రావాలని షరతులు పెట్టేవారు. నటీనటులకు సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. అయినా వాళ్లంతా ఎన్టీయార్ పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చి వేషాలు వేసేవారు. ఎందుకంటే ఆ సంస్థలో పని చేస్తే యిక తాతాచార్యుల ముద్ర పడినట్లే. ఆ పేరు చెప్పుకుని మార్కెట్ పెంచుకోవచ్చు. ఎన్టీయార్‌కు ఆ నటి/నటుడి నటన, ప్రవర్తన నచ్చితే తన యితర సినిమాల్లో కూడా సిఫార్సు చేయగలరు. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే ఎన్టీయార్ తనపై తాను చాలా తక్కువ ఖర్చు పెట్టుకునేవారని, ఎవరికీ డబ్బు అప్పుగా కూడా యిచ్చేవారు కాదనీ చెప్తారు.
గుమ్మడి తన ఆత్మకథలో రాశారు – '1949 ప్రాంతంలో గుమ్మడి వేషాల కోసం ప్రయత్నిస్తూ మద్రాసులో ఓ తెలుగువారి హోటల్లో ఉండేవారు. నెలకు నాలుగు వందలు ఖర్చు పెట్టేవారు. వచ్చే ఆదాయం రెండు వందలు, తక్కినది యింటి నుంచి తెప్పించుకునేవారు. ఆయన బసకు దగ్గరలో ఉన్న గదిలో ఎన్టీయార్, టివి రాజు కలిసి ఉండేవారు. ఎన్టీయార్‌కు అప్పట్లో నెలకు 500 జీతం వచ్చేది అది కాక 10 నెలలు వర్క్ చేసే సినిమాకై నెలకు 500 వచ్చేది. మొత్తం వెయ్యి, కానీ ఖర్చు పెట్టేది 100 రూ.లు మాత్రమే. రూము అద్దె 50, మీల్స్ కారియర్ 25, సాదరు ఖర్చులు 25! గది నుంచి 3,4 మైళ్ల దూరం ఉన్న ఇరానీ హోటల్‌కు నడుచుకుంటూ వెళ్లి రెండు బిస్కట్లు, టీ తాగి వచ్చేవారు. 1952లో సొంతకారు కొనేవరకు ఆయన అయితే బస్సు, లేదా కాలినడక ప్రయాణమే.
ఓసారి గుమ్మడి ఆదాయవ్యయాలు తెలుసుకుని 'మీ ఆదాయానికి మించి ఎప్పుడూ ఖర్చు పెట్టకండి. మీ కొచ్చిన జీతంతోనే మీరు సరిపెట్టుకోవాలి.' అని హితబోధ చేశారు. ఎందుకంటే తను వచ్చిన దానిలో పదోవంతో ఖర్చు పెట్టేవారు కనుక. అప్పుడే కాదు, లక్షలు, కోట్లు సంపాదిస్తున్న రోజుల్లో కూడా డబ్బు విషయంలో అంత జాగ్రత్తగా ఉండేవారు. ఎవరి దగ్గర్నుంచైనా డబ్బు పుచ్చుకున్నపుడు చిల్లరతో సహా లెక్క పెట్టి మరీ జేబులో పెట్టుకునేవారు. అలాటి వ్యక్తి అడగకపోయినా మరో నటుడికి 500 రూ.లు అప్పు యిచ్చారంటే ఆశ్చర్యమే కదా! ''అనగనగా ఓ రాకుమారుడు..'' పేరుతో రాసుకున్న తన ఆత్మకథలో కాంతారావు ఆ విషయాన్ని చెప్పారు.
''దీపావళి'' (1960) సినిమా షూటింగు టైములో కాంతారావు నారదుడిగా, రామారావు కృష్ణుడిగా వేస్తున్నారు. దాని షూటింగు టైములో కాంతారావు అమ్మమ్మ ఆరోగ్యం సీరియస్ అయి, వెంటనే రమ్మనమని కబురు వచ్చింది. కాంతారావు ప్రొడక్షన్ మేనేజరు వద్దకు వెళ్లి తన ఖాతాలోంచి 500 రూ.లు యివ్వమని అడిగారు. ఈ షెడ్యూల్లో షూటింగు యింకా వుంది కదా, పూర్తి చేసి వెళ్లండి. మొత్తం డబ్బు ఒకేసారి యిచ్చేస్తాం' అన్నాడాయన. 'వెంటనే వెళ్లకపోతే కడసారి చూపు కూడా దక్కదు. ఈ ఆపత్కాలంలో షూటింగు అంటే ఎలా?' అని నిర్మాత వద్దకు వెళ్లి మొత్తుకున్నా అరణ్యరోదనే అయింది. పక్కగదిలో ఉన్న ఎన్టీయార్ మేకప్ తుడుచుకుంటూ యీ వేడికోళ్లు అన్నీ విన్నారు.
ఇంటికి వెళుతూ కాంతారావును తనతో రమ్మన్నారు. వెళ్లాక లోపల్నుంచి 500 రూ.లు పట్టుకుని యిచ్చి ''నేను ఎంత అవసరం వచ్చినా, ఎవ్వరికీ డబ్బు యివ్వను. డబ్బు చాలా పాపిష్టిది. అది, మనుషుల మధ్య ఉండే అనుబంధాలనీ, ప్రేమాభిమానాలనీ సర్వనాశనం చేస్తుంది. అందుకే, నేను అభిమానించే మనుషులతో డబ్బు ప్రమేయం పెట్టుకోను. ఇవాళ మీరు పడుతున్న బాధను చూడలేక, చూసి ఊరుకోలేక డబ్బు యిస్తున్నాను. వెంటనే ఊరుకెళ్లి మీ అమ్మమ్మగారిని చూసి, తిరిగి రాగానే నా డబ్బు నాకు యిచ్చేయండి.'' అన్నారు. కాంతారావు ఎన్టీయార్ అభిమానించే వ్యక్తులలో ఒకరు. ఆ దీపావళి సినిమాలో నారదుడిగా ఆయన నటిస్తున్న తీరుచూసి ముగ్ధుడైపోయిన ఎన్టీయార్ ''నేను శివుడు, రాముడు, కృష్ణుడు వంటి పాత్రలన్నీ వేస్తాను కానీ నారదుడి పాత్రను మాత్రం జీవితంలో ఎప్పుడూ చేయను. ఆ పాత్ర, ఎప్పటికీ మీ కోసమే రిజర్వ్ అయి వుండాలి'' అని మాట యిచ్చారు. దాన్ని నిలబెట్టుకున్నారు.
వాళ్లిద్దరికీ పరిచయం ఎచ్ఎమ్ రెడ్డిగారి సినిమాల ద్వారా అయింది. ఆయన మూడు సినిమాలు ఏకకాలంలో తీశారు. ''ప్రతిజ్ఞ'' (1953)లో కాంతారావు, ''బీదల ఆస్తి'' (1955)లో జగ్గయ్య, ''వద్దంటే డబ్బు'' (1954)లో ఎన్టీయార్ హీరోలు. మూడూ ఒకేసారి రోహిణి స్టూడియోలో షూటింగ్సు జరుపుకునేవి. షాట్ పూర్తయ్యాక బయటకు వచ్చి కూర్చోవడంలో కాంతారావు, ఎన్టీయార్లకు పరిచయం ఏర్పడి ఆప్యాయంగా మాట్లాడుకునే స్థితికి వచ్చారు. ఈ మూడిటిలో కాంతారావు సినిమాయే హిట్టయింది. తర్వాత ఎన్టీయార్ ''జయసింహ'' (1955) ప్లాను చేసినపుడు తన తమ్ముడి పాత్రకు ఎయన్నార్‌ను అనుకున్నారు. కానీ అప్పటికే ఆయన బిజీ స్టార్ కావడంతో బజెట్ పెరిగిపోతుందనే బెదురుతో, డేట్లు దొరకవనే సందేహంతో జగ్గయ్య ననుకున్నారు.
జగ్గయ్యతో ఎన్టీయార్‌కు స్నేహం వున్నా జగ్గయ్య రిజర్వ్డ్గా ఉండడం చేత సంశయించారు. వినయవిధేతలు, కలుపుగోరుతనం ఉన్న మనిషిగా కాంతారావు తోచడం చేత ఆయనకు ఛాన్సు యిచ్చారు. దానికి గుమ్మడిగారి రికమండేషన్, పుండరీకాక్షయ్యగారి సిఫార్సు కూడా తోడయ్యాయి. జయసింహ బాగా హిట్టయింది. కాంతారావుకి 1500 రూ.లు పారితోషికం దక్కింది. తర్వాత వచ్చిన ''శ్రీ గౌరీమహత్యం'' (1956)లో శివుడి పాత్రకే కాంతారావుకి 3000 రూ.లు ముట్టింది. ఆ తర్వాత కూడా ఎన్టీయార్ కాంతారావును ఒక సోదరుడిగానే చూశారు. ''దేవాంతకుడు'' సినిమాలో కాంతారావు విష్ణువుగా చూపిన నటన చూసి అబ్బురపడిన దర్శకుడు సి.పుల్లయ్య నేను పౌరాణికం తీస్తే నీకు ఓ వేషం యిస్తాను అన్నారు.
అన్నట్లే ''లవకుశ'' (1963) డైరక్షన్ ఛాన్సు రాగానే లక్ష్మణుడి పాత్ర యిచ్చారు. అయితే కొందరికి అది నచ్చలేదు. స్క్రిప్టు చేతిలో పెట్టినపుడు ఆయన ధరించే పాత్ర పేరు రాయకుండా కాంతారావు అనే రాశారు. పాత్ర చేజారిపోతుందని భయపడి కాంతారావు ఎన్టీయార్ వద్దకు వెళ్లి చెప్పుకుంటే ఆయన నిర్మాత శంకరరెడ్డికి ఫోన్ చేశారు. ''మీ సినిమాలో కాంతారావుకి లక్ష్మణుడి పాత్ర యిస్తున్నారా లేదా?'' అని. దాంతో నిర్మాత కంగారు పడి 'ఆయనే లక్ష్మణుడు' అన్నారు. అయినా ఎన్టీయార్ శాంతించకుండా త్రివిక్రమరావుగారి చేత మళ్లీ ఫోన్ చేయించారు 'మీరు మాట తప్పితే అన్నగారు బాధపడతారు' అని. దెబ్బకి నిర్మాత కాంతారావును పిలిచి 'ఇంత చిన్న విషయానికి రామారావు గారి దాకా వెళ్లాలా? నీతో వేగడం కష్టమే' అని మొత్తుకున్నాడు.
లక్ష్మణుడి పాత్రలో కాంతారావు ఎంత బాగా రాణించారో అందరికీ తెలుసు. ఆ ఏడాది జాతీయ బహుమతుల్లో ఉత్తమ సహాయ నటుడి అవార్డు లభించింది. ఇవన్నీ కాంతారావు తన ఆత్మకథలో రాశారు. ఇవిచూస్తే ఎన్టీయార్ తనకు ఆత్మీయంగా తోచినవారి కోసం ఎంతైనా సాయపడేవారని తెలుస్తుంది. ఎటొచ్చీ వారు తన పట్ల వినయవిధేయతలతో ఉండాలి. అదే ఆయన కోరుకునేది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2019)
[email protected]
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 01 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 02 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 03
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 04 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 05 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 06
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 07 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 08 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 09